శివసేన దారిలోనే టీడీపీ కూడా..!?
చెట్టుపై కాయలు కొట్టేసేవాడు ఒకడైతే, వాడి ఒడిలోవి కొట్టేసేవాడు ఇంకొకడు అన్నట్లు ఉంది… ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి, టీడీపీల వ్యవహారం. పైగా వారి మధ్య ఉన్నది పొత్తు ధర్మం. 2014 ఎన్నికల తర్వాత పేరుకు కలిసివున్నారు; ప్రతీ అంశంలోనూ ఎవరిదారి వారిదే. ఇప్పడు బీజేపీ నేతలు టీడీపీని బాహాటంగానే విమర్శించేస్తున్నారు. సోము వీర్రాజు లాంటి వారయితే పాత చరిత్ర తవ్విపోస్తున్నారు. 2009 లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినందుకు తీరిగ్గా విచారిస్తున్నారు.చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడుల నేపథ్యం…ఇదే అదనుగా భావించిన చంద్రబాబు, సానుభూతి పవనాలు మెండుగా ఉంటాయన్న ఆశతో … ముందస్తు ఎన్నికలకు వ్యూహరచన చేశారు. అలాగే మరోవైపు కేంద్రం భారత్ వెలిగిపోతుంది. అంటూ పార్టీని,దేశాన్ని చీకటిమయం చేశారు. బాబుగారి సలహాతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఫలితాలతో తలబొప్పి కట్టించుకున్నామనే గుసగుసలు ఇప్పటికీ బిజెపి వారు వినిపిస్తుంటారు.బిజెపి శ్రేణుల్లో బాహాటంగా చేస్తున్న విమర్శ ఒకటి వుంది: కౌగలించుకోవటంలో దృతరాష్ట్రుడు సైతం బోల్తా పడ్తాడేమో, కాని బాబు మాత్రం పడడు. నష్టపోయిన వాళ్ళ వైపు నుంచి చూస్తే అలా అనిపిస్తుంది. కానీ లాభపడ్డవారి వైపు నుంచి చూస్తే అదో వ్యూహం. కానీ పొత్తు వల్ల బీజేపీ నష్టపోయిందన్నది కూడా పూర్తిగా నిజం కాదు. లేకుంటే 2014కి వచ్చేసరికి, మళ్ళీ చంద్రబాబు కౌగిలికి తహతహలాడేవారు కారు. సీట్ల కేటాయింపులోనే వారి బలం,స్థాయి ఏంటి అన్నది బాబు నిరూపించి చూపారు.
శ్రేణులకైతే ఇపుడిపుడే మత్తు వదులుతున్నట్లుంది కాని, అమిత్ షాకైతే గతంలోనే స్పృహ వచ్చినట్లుంది.తాను ఏపి పర్యటనకు వచ్చినపుడు తీసుకున్న మొదటి నిర్ణయంలో భాగమే దేశంలో అత్యుత్తమ ద్వితీయ స్థానానికి వెంకయ్యనాయుడిని సాగనంపేశారు. ఆ తరువాత రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టిసారించిన ధాఖలాలు లేవు. ఐతే వీరి మధ్య రేగిన ప్రస్తుత దుమారం, ఏమేరకు ఉంటుందనేది ప్రస్తుతానికి శేష ప్రశ్నే?నేడు గుజరాత్‌లో చావు తప్పి కన్ను లొట్ట పోయినా, హిమాచల్ ప్రదేశ్‌లో సంతృప్తికర ఫలితాలతో మధ్యస్త మనస్తత్వంతో ఉన్న బిజెపి శ్రేణులు ఏపీలో ఇంకా వేరు కుంపటికే ప్రయత్నిస్తారా..?
2019లో యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్తామంటున్న బిజెపి… సీట్లను శాసిస్తుందా? రాష్ట్రాన్ని శాసిస్తుందా? స్నేహ ధర్మం పాటించకుండా తమ పార్టీని నిర్వీర్యం చేశారన్న ఆరోపణలో వాస్తవం వుంటే ఉండొచ్చు. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగి వుంటే వుండవచ్చు. ఆలాగని ఆ పార్టీ టీడీపీ వల్ల పొందిన స్వల్ప లాభాన్నయినా విస్మరించగలదా..?
చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం బిజెపితో కలిసి అడుగులు ముందుకు వేస్తున్నా, నెపం పెట్టి బయటికి వచ్చేయటానికి కూడా దారులు కోకొల్లలు… అయినా సరే ఇరుపక్షాలు ఎందుకు ముందుకు పయనిస్తున్నట్లు? విడిపొవటానికా? విడిపొయి కలవటానికా?ఐతే ఈ విభేదాలు ఎన్నికల ముందు వరకూ కొనసాగి ఎన్నికల కల్లా దోస్తీ కడతారా? లేక మహారాష్ట్రలో మాదిరిగా ఎవరి విధానాలతో వారు ఎన్నికలకు వెళ్ళి ఫలితాల తర్వాత కలుసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే…