మత్తు మాఫియా బడి నుంచి పొలానికి..?
ప్రపంచ నగరంగా పిలువబడుతున్న హైదరాబాద్ అన్నింటికి అడ్డాగా మారిందా, అంటే అవుననే చెప్పవచ్చు. అన్ని సంస్కృతులకు నిలయమైన భాగ్యనగరాన్ని ఒక్కొక్కరు ఒక్కొరకంగా ఉపయోగించుకుంటున్నారనేది కాదనలేని సత్యం. ఈ మధ్య కాలంలో వెలుగు చూసిన చీకటి కోణాలు చాలానే వున్నాయి. అందులో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న ఆంశం: మత్తు మందు (డ్రగ్స్) వ్యవహారం.
ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనం. స్కూలులో చదివే విద్యార్థుల నుండి సినిమా ఇండస్ట్రీ వరకు అందరూ బాధితులే. తాజాగా వీరి కన్ను యువత పై పడింది. ఒకప్పుడు నగరంలో ఉన్నటువంటి పబ్‌లు, రిసార్టులకు పరిమితమైన పార్టీలు ఇపుడు సిటీ బయట ఉన్నటువంటి ఫామ్ హౌజ్( వ్యవసాయ క్షేత్రాలు)లలోని రేవ్ పార్టీలకు చేరాయి. మందూ, మత్తూ, అమ్మాయిల అర్థనగ్న చిందులూ..వెరసి రేవ్ పార్టీలు. వీటి ద్వారా జరుగుతున్న దారుణాలు అంత ఇంత కావనేది తాజాగా జరిగిన ఒక ఉదంతం బయట పడ్డాక గాని తెలియరాలేదు బయటి ప్రపంచానికి. మందు పార్టీలో జరిగిన చిన్న గొడవ గుట్టు రట్టయ్యింది.
ఒక తలుపు మూస్తే,మరోక తలుపు తెరచుకొని తన స్వరూపాన్ని మార్చుకొన్న మాఫియా ఔషదనగరాన్ని కాస్త మత్తు నగరంగా చేసింది. జనవరి ఒకటి తర్వాత తొలిపక్షం ఇంకేలా ఉంటుందోననే ఆందోళనల ఇపుడు ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం నుండి సంక్రాంతి వరకూ పండగలే పండగలు. ఇకనైనా అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ఆవరోధాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది.