‘ఎర్రచొక్కాలకు’ కూడా గ్లామర్ అంటే క్రేజా..?
కమ్యూనిస్టులు తమ ఉనికిని కాపాడుకునే స్థితిలోనే ఉండిపోయారా? అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
ఈ పార్టీలపై గౌరవం కొద్దీ, అవునని చెప్పలేక పోయినప్పటికీ… వాస్తవంలోకి వెళ్తే నిజమనే చెప్పాలి మరీ. ఎందుకంటే… రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తే… తెలంగాణలో ఐతే కోదండరామ్ … లేదా అటు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే పవన్ వెనుక ప్రయాణానికి సిద్ధపడినట్లున్నారు… వామపక్షాలు.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రబలంగా కాకున్నా… బలంగానైనా చూపిన వీరి ప్రభావం చంద్రబాబు లాంటి వారి ఎత్తులతో… కేసిఆర్ లాంటి జిత్తులతో మసకబారిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అనునిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతూ… క్యాడర్ బేస్‌డ్ మూలాలున్న పార్టీగా ఉన్నా సరే. గత కొంత కాలంగా వీరి వ్యూహాలకు సమయానుకూలంగా పదును పెట్టని కారణంగా… వీరి పట్ల ఉన్న ఆకర్షణను వోట్లగా మలచుకోలేక పోయారు.
ఐతే కొందరి రాజకీయ ఉద్ధండులతో చెలిమి కారణంగానేమో( అప్పటికీ నష్టపోయినా)… వీరికి మెరుపు లాంటి ఆలోచన వచ్చినట్లుంది. అదే పవన్‌తో జత కట్టడం. ఎందుకంటే యువతలో అతనికున్న జనాకర్షణ. ఎంతో క్యాడర్ గల పార్టీగా ఒకప్పుడు వ్యక్తులను దగ్గరకు కూడా రానివ్వని స్థితి నుండి తెలుగు రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి కేంద్రంగా నున్న వారి వెనుకాల ఉంటూ ముందుకెల్లెటందుకు సిద్దపడుతున్నారు.
వ్యక్తి వెంట పార్టీ పడటం కాదు.. పార్టీ వెంట వ్యక్తి పడాలన్నది నిజానికి వారి విధానం.
అందులో ఏపీలో తాము చెలిమి చేయబోయే పవన్‌కు ఆకర్షణ ఉంది. అభిమానులూ వున్నారు. కానీ వారు క్యేడర్ గా ఇంకా మారాల్సి వుంది. వ్యూహం లో ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి ఆ ఆకర్షణకు రాలే ఓట్లు ఏమేరకు అన్నది కాస్త అలోచించాల్సిన విషయమే..? అవికూడా ఏ స్ధాయిలో సీట్లుగా రూపాంతరం చెందగల వోటు బ్యాంకుగా క్రియేట్ అవుతుందో..? ఐతే పవన్‌కు క్యాడర్ , పటిష్టమైన పార్టీ నిర్మాణం లేదు. యువతలో ఇతనికి విపరీతమైన అభిమానగణం ఉంది. సరిగ్గా ఈ విషయాన్నే గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం క్యాష్ చేసుకుంది. ప్రస్తుతం వామపక్షాలు కూడా అదే మోడల్‌ను అనుసరిస్తున్నట్లుంది.
ఎందుకంటే రాష్ట్రంలో ఓ వైపు టిడిపి, మరోవైపు వైసీపీ, ఇంకోవైపున బిజెపి ఎవరికి వారు కత్తులు నూరుతూ, రాబోయే సాధారణ ఎన్నికలకు సమాయత్తమౌతున్నాయి. వామ పక్షాలు వ్యక్తి వెంట పరుగులు తీయటం వల్ల లాభపడతాయా? లేక నష్టపోతాయా- అన్నది వేచి చూడాల్సిందే..!