Films

బ్లాక్ పాంథర్ రెవ్యూ: ’తెల్ల‘ని భయాల మధ్య ’నల్ల‘ని భరోసా

రేటింగ్‌:4/5

క్విక్‌ లుక్‌:

ఫస్ట్‌ ఇంప్రెషన్‌:పేరుకు సూపర్‌ హీరో సినిమా అయినా, క్షణక్షణాశ్చర్యంతో పాటు, సుకుమార ప్రణయం, సున్నిత హాస్యం వెరసి, అంతకు ముందెప్పుడూ కనని కలలా వుంటుంది.

ప్లస్‌ పాయింట్స్‌: ప్రకృతి,సాంకేతికతల మేళవింపు

– బిగువు సడలకుండా నడిపించే స్క్రీన్‌ప్లే

– ఎత్తైన కొండలనుంచి లోతైన లోయలోకి జారిపడే జలపాతాన్ని ఒడిసి పట్టే సినిమాటోగ్రఫీ

– ఆఫ్రికన్‌ నల్లజాతీయుల చారిత్రక వారసత్వాన్ని, వారు నుగొన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చి మార్చి ప్రదర్శించిన దర్శకుడు రియాన్‌ క్లూగర్‌ ప్రతిభ

– తాత్వికతనీ, శౌర్యాన్నీ పతాక స్థాయిలో చూపించిన సంభాషణలు

– ప్రతీ అనుభూతిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళే నేపథ్య సంగీతం.

– ఆత్యాధునిక టెక్నాలజీని ప్రదర్శించే గ్రాఫిక్స్‌

మైనస్‌ పాయింట్స్‌:

-క్లయిమాక్స్‌లో ఉత్కంఠ కరవైన ఫైట్స్‌

– అక్కడక్కడా భావతీవ్రతను అడ్డుకున్న హాస్యం.


చిత్రం: బ్లాక్‌ పాంథర్‌
జోనర్‌: సూపర్‌ హీరో స్టోరీ
నిర్మాణ సంస్థ: మార్వెల్‌ స్టుడియోస్‌
నటీనట వర్గం: చాడ్‌విక్‌ బోస్‌మాన్‌, మిఖాయెల్‌ బి. జోర్డాన్‌, 
లుపిటా న్యోంగో, డానియల్‌ గురిరా, మార్టిన్‌ ఫ్రీమాన్‌, డేనియల్‌ కలూయా, లెటిటా రైట్‌, విన్‌స్టన్‌ డ్యూక్‌,
ఏంజిలా బాసెట్‌, ఫారెస్ట్‌ విటేకర్‌, యాండీ సెర్కిస్‌.
దర్శకత్వం: రియాన్‌ కూగ్లర్‌
నిర్మాత: కెవిన్‌ ఫీగ్‌
రచన :రియాన్‌ కూగ్లర్‌, జో రాబర్ట్‌ కోల్‌
మూల కథ: స్టాన్‌ లీ, జాక్‌ కిర్బీ రచించిన 'బ్లాక్‌ పాంథర్‌'
ఎడిటింగ్‌: మిఖాయెల్‌ పి. షావర్‌, క్లాడియా కాస్టెల్లో
స్క్రీన్‌ ప్లే:రియాన్‌ కూగ్లర్‌, జో రాబర్ట్‌ కోల్‌
సంగీతం: లుడ్వింగ్‌ గోరాన్సన్‌
సినిమాటోగ్రఫీ: రాహేల్‌ మారిసన్‌
పంపిణీ: వాల్ట్‌ డిస్నీ స్టుడియోస్‌ మోషన్‌ పిక్చర్స్‌

కథాంశం: అగ్రదేశంగా ఆఫ్రికా

స్టాన్‌ లీ, జాక్‌ కిర్బీ అనే రచయితలు 1960లలో నే ఆఫ్రికన్‌ హీరోలను పునర్విచించారు. భవిష్యత్‌ ఈ ఖండంలోని నల్లజాతీయులే భవిష్యత్‌ను శాసిస్తారనీ, సాంకేతిక పరిజ్ఞానంలో ముందుంటారని ఊహ చేస్తూ, ఫాంటసీలతో కామిక్స్‌ను సృష్టించారు. అలాంటి వాటిలోదే ‘బ్లాక్‌ పాంథర్‌’.

కథ: ‘తెలుపు‘ చేసిన పనినే ‘నలుపు’కూడా చెయ్యాలా? 

వకాండా. ఇదో దేశం. నిజమైన ప్రపంచపటంలో వుండదు. రచయితల సృష్టి. కానీ ఒక ఆఫ్రికా దేశం. ఒక పక్క శతాబ్దాల వీరోచిత వారసత్వం, ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని మించిపోయే, అత్యాధునిక జ్ఞానం. ఇందుకు కారణం వారికి మాత్రమే లభ్యమయ్యే ఖనిజం ‘వైబ్రేనియం’. దీంతో ఏదైనా సృష్టించవచ్చు. ఈ దేశపు రాజు అంతర్యుధ్ధంలో మరణిస్తాడు. అతని కొడుకు టి’షల్లా (చాడ్విక్‌ బోస్‌మాన్‌) రాజవ్వాలి. అతని సవాలు చేసే చిట్టచివరి వ్యక్తి ఎవరయినా వుంటే, అతన్ని పర్వత శ్రేణిలోని జల వేదిక మీద ఒంటరిగా గెలిచి రాజవ్వాలి. అలాగే అవుతాడు. కానీ ఇదే వకాండాకు చెందిన మరో రాజవంశీయుడు కిల్‌ మాంగర్‌ (మిఖాయిల్‌ బి.జోర్డాన్‌) ఆమెరికా లో పెరుగుతుంటాడు. అతడు అమెరికాలో నల్ల జాతీయుడిగా జాతి వివక్షను ఎదుర్కుంటాడు. నాటకీయంగా వకండాకు చేరుకుని, టి’షల్లాకు సవాలు విసిరి, ఢీకొని, రాజయిపోతాడు. అంతవరకూ గోప్యంగా వున్న వకాండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, బయిట వున్న శ్వేత జాతి సూపర్‌ పవర్స్‌ను కూల్చేసి, ప్రపంచంలోనే నల్లరాజ్యాన్ని ఏర్పాటు చెయ్యాలనుకుని, యుధ్ధానికి దిగుతాడు.. అతడి ప్రయత్నాలను శాంతికాముకులైన వకాండా యోధులు ఎలా అడ్డుకుంటారు… ? ఇదే కథ.

ట్రీట్‌మెంట్‌: విలన్ కు కూడా హీరో లక్షణాలు 

హీరో, హీరోలాగా కనిపించటం మామూలే. కానీ విలన్‌ కూడా ఒక దశలో హీరోను మించిన హీరోలా కనిపిస్తాడు. టి’షల్లా, కిల్‌ మాంగర్‌- ఇద్దరూ నల్లజాతీయులే. హీరో సాటి ఆఫ్రికా దేశంలో సాటి నల్ల జాతీయుల మధ్యే పెరిగితే, విలన్‌ అమెరికాలో శ్వేత జాతీయుల మధ్య పెరుగుతాడు. కాబట్టి జాత్యహంకారం ఎంత చికాగ్గా వుంటుందో విలన్‌కు తెలిసినంతగా, హీరోకు తెలియదు. కాబట్టి అతడి ఆవేశం అందరినీ ఆకట్టుకుంటుంది. వకాండానో మేధోపరంగా, సాంకేతికంగా పరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని హీరో ప్రయత్నిస్తాడు. కానీ, విలన్‌ అదే జ్ఞానాన్ని, ఆయుధ సంపత్తినీ వినియోగించుకుని, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. మరణించిన పితరులు ‘బ్లాక పాంథర్స్‌'( నల్ల చిరుతలు) గా వుంటారు. అనాలి కాబట్టి కిల్‌ మాంగర్‌ను ప్రతినాయకుడు(విలన్‌) అని అంటున్నాం కానీ, సారంలో అతడు కూడా మరో హీరోనే.

స్క్రీన్‌ ప్లే: అనుక్షణం ఆశ్చర్యం

అప్పుడే అరణ్యం. అంతలోనే అధునాతన నగరం. అంతవరకూ పాత విశ్వాసం, ఉన్నట్టుండి అధునాతన పరిజ్ఞానం. కథ ఎక్కడా బిగువ తగ్గదు. ఊపిరి తీసుకునే తీరికను కూడా ప్రేక్షకుడికి ఇవ్వరు. అలాగని తర్వాత ఏమి జరుగుతుందో మాత్రమే తెలుసుకోవాలనే ఏకైక కోరిక తోనే ప్రేక్షకుణ్ణి వుంచరు. క్షణక్షణం తటిల్లతలకూ, సంభ్రమాశ్చర్యాలకు గురికావటాన్ని సినిమా మొదటిలోనే రుచి చూపిస్తారు. చివరివరకూ ఆ అనుభవాన్ని కోల్పోనివ్వరు. ఇది కేవలం విలక్షణమైన స్క్రీన్‌ ప్లే వల్లనే సాధ్యం.

హీరో: కారుణ్యం వున్న సూపర్ హీరో

టి’షల్లా(బ్లాక్‌ పాంథర్‌)గా బోస్‌మాన్‌ పాత్రలో ఇమిడిపోయాడు. సూపర్‌ హీరో పాత్రలో వీరత్వం పాళ్ళే ఎక్కువ వుంటాయి. కానీ, ఇక్కడ అలా కాదు, కరుణరసం కలగలిసి పోయి, చాలా సార్లు అతి సామన్యుడిగా కనిపిస్తారు. పైపెచ్చు, బ్లాక్‌గా పుట్టి, బ్లాక్‌గా మొత్తం బ్లాక్స్‌ మధ్యనే పెరిగాడేమో, వైట్‌ ఎదురయినప్పుడు, తాను సమానుణ్ణి అనో, వీలయితే కాస్త ఎక్కువ వాడిననో అనుమానం కలుగుతుంది. అవసరమయితే వైట్స్‌ ను కాస్త కిందగా చూసి దయచూపించే ధర్మప్రభువులా కనిపిస్తాడు. దీనికి తోడు తన సామ్రాజ్యాన్ని కాపడే సైన్యాధ్యక్షురాలితోనూ, తనకు టెక్నాలజీని పరిచయం చేసే హైటెక్‌ లేడీగా వున్న సోదరితోనూ, తనకి జ్ఞానబోధ చెయ్యగలిగే ప్రియురాలితోనూ గౌరవంగా, కొండొకచో కృతజ్ఞతతో మెలిగే వైవిధ్య మైన సూపర్‌ హీరో గో బోన్‌మాన్‌ ప్రేక్షకుల మనసుల్లో నిలిచి పోతాడు.

ఇతర నటీనటులు: హెటెక్ చెల్లాయి

హీరో చెల్లెలు ‘షురి’గా లెటిటా రైట్‌ చిరునవ్వు పెదవులమీదనే వుంచుకుని, ప్రతి అత్యవసరాన్నీ టెక్నాలజీ తో ఎదుర్కొంటూ, అందరి మీదా, మరీ ముఖ్యంగా అన్నయ్య మీద విరుపులు విరుచుకుంటూ వెళ్తుంటుంది. ఇక వకాండా రక్షణను తన ఒంటి చేత్తోనే కాపాడుతున్నట్టు కనిపించే యోధగా డనాయ్‌ గురియా శత్రువుకి ముచ్చెమట్లు పోయిస్తుంది.

సినిమాటోగ్రఫీ: ఇదో  త్రీడీ కల

ఒక పక్క అంతు చిక్కని గ్రాఫిక్స్‌, మరొక పక్క దూకే జలపాతాలు కెమెరా రెండు భాషల్ని మాట్లాడుతుంది. గ్రాఫిక్స్‌ ఎక్కువయినప్పుడు సాధారణంగా విసుగు కలుగుతుంది. కానీ ఇక్కడ గ్రాఫిక్స్‌ వచ్చిన ప్రతీసారీ మరో కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. రాహేల్‌ మారిసన్‌ మనకొక కొత్త కలను అందిస్తారు. త్రీడీలో చూస్తామేమో, ‘వకాండా’ మనం వుండే దేశంగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా, హీరో అపస్మారక స్థితికి వెళ్ళి, కలలాంటి స్థితిలో, మృతి చెందిన తండ్రిని కలుస్తుంటాడు. వెన్నెల్లో చెట్టు దగ్గర ‘బ్లాక్‌ పాంథర్స్‌’ల్లాగా పూర్వికులు వున్న దృశ్యాన్ని ‘మ్యాజికల్‌’ గా చిత్రిస్తారు.

సంగీతం: ఆఫ్రికన్ డ్రమ్స్

ఆఫ్రికన్ల సొంతమైన డ్రమ్‌ బీట్స్‌ ఈ సినిమాలో కొత్త థ్రిల్‌నిస్తాయి. అలాగే హీరో కొరియా వచ్చేసరికి మళ్ళీ కొరియన్‌ విద్వాంసుడు సై అందుకుంటాడు. ప్రేక్షకుణ్ణి ఆద్యంతం ఉద్విగ్నం వుంచటానికి ఈ సంగీతం బాగా పనికివచ్చింది.

కొరియోగ్రఫీ:

టి’షల్లా సామ్రాజ్యాన్ని కాపాడే ఎనిమిది మంది స్త్రీలలో, ఇద్దరు స్వతహాగా డ్యాన్సర్లు. వీరు వేసే స్టెప్పులు వీరోచితంగా వుండే ఒళ్లు గగుర్పొడుస్తూ వుంటాయి. కావాలనే ఇలాంటి వారిని దర్శకుడు ఎంపిక చేశారని చెబుతారు. శిరోజాలే స్త్రీని నిర్వచిస్తాయని ప్రపంచంలో పలు చోట్ల నమ్ముతారు. ఈ నమ్మకంలో కూడా పితృస్వామ్యం వుంది. కానీ ఇందులో స్త్రీలు పూర్తిగా గుండు గీయించుకుని వుంటారు. అందం చెడదు కదా- కొత్త అందం వస్తుంది.

కొసమెరుపు: అమెరికాలో ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక, బ్లాక్స్‌ మళ్ళీ తమ ఉనికిని చాటుకోవాల్సిన అగత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఏ వలసవాదానికీ గురికాని ఒక ఆఫ్రికన్‌ దేశాన్ని సృష్టించి, బ్లాక్స్‌ తమ సాధికారతను ప్రకటించే ఒక చిత్రాన్ని తీయటం- అంతటా ఆకర్షించింది. అందుకే ఈ సినిమా కలెక్షన్ల వర్షంలో కొత్త రికార్డును సృష్టిస్తోంది.

-సర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *