FeaturedFilms

కథ లేక విధిని నమ్ముకున్న ‘నా- నువ్వే’

రేటింగ్‌: 2.75/5

క్విక్‌ లుక్‌:

నిజంగానే కథలేకుండా ‘డెస్టినీ'( విధి)చుట్టూ తిట్టినట్టుంది. కల్యాణ్‌ రామ్‌ నటన, హీరోయిజం కన్నా, తమన్నా ఆద్యంతమూ ఒక యాడ్‌ ఫిలింలో మోడల్‌లా అందంగా కనిపిస్తుంది. అక్కడక్కడా రొమాన్స్‌ పండుతుంది. మరీ విసుక్కునే సినిమా కాదు; అలాగని ఆసక్తితో చూసే సినిమా కూడా కాదు.

ప్లస్‌ పాయింట్స్‌:

– తమన్నా ..తమన్నా.. తమన్నా. నటన సాధారణంగానే వున్నా, లుక్స్‌లో మాత్రం కొత్తగా, తాజాగా కనిపిస్తుంటుంది.

– కల్యాణ్‌ రామ్‌ అన్ని సినిమాల్లో ఎలా చేస్తాడో, ఇందులోనూ అలాగే చేస్తాడు.

– సినిమాటోగ్రఫీ చాలా రిలీఫ్‌ ఇస్తూ వుంటుంది.

– హీరోయిన్‌ తండ్రిలా తనికెళ్ళ భరణి ఆవేశపూరిత సన్నివేశాలు సహజంగా వుంటాయి.

– రష్యన్‌ బ్యాలేన స్ఫురణకు తెచ్చే కొరియోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌:

-కథలేక పోవటం పెద్ద మైనస్‌ పాయింట్‌

– క్లయిమాక్స్‌ సస్పెన్స్‌ ముందుగా తెలిసిపోవటం వల్ల ఆశించిన ఉత్కంఠ నిలువదు.

-హీరో బామ్మ, హీరోయిన్‌ చెల్లెలు పాత్రలు రొటీన్‌ గా వుండటమే కాకుండా విసుగు కూడా రప్పించాయి.


ఎవరెవరు?

చిత్రం: నా. నువ్వే

జోనర్‌: రొమాంటిక్‌ కామెడీ

నిర్మాణ సంస్థ: కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌

నటీనట వర్గం: నందమూరి కల్యాణ్‌ రామ్‌, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి,
వెన్నెల కిషోర్‌, సురేఖ వాణి

దర్శకత్వం: జయేంద్ర పంచపకేశన్‌

నిర్మాతలు: కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి

రచన:శుభ, జయేంద్ర పంచపకేశన్‌

సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌

సంగీతం: షర్రేత్‌

విడుదల తేదీ:14 జూన్‌ 2018

కథాంశం: ‘విధి’రాత

అనుకోకుండా జరిగే సన్నివేశాలు (కోఇన్సిడెన్స్‌స్‌) ఒకటో, రెండో వుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటాయి. కానీ అడుగడుగునా జరిగిపోతుంటే, ఆశ్చర్యం అలవాటయిపోయి ఆసక్తి సన్నగిల్లుతుంది. ఈ అనుకోని ఘటనలన్నిటికీ ‘విధి’ ఖాతాలో వెయ్యటమే ఈ చిత్ర కథాంశం.

కథ: వెంటాడి వేధించే లక్కు

తావీదో, మెడలో హారమో, సత్తు నాణెమో.. హీరోకానీ, హీరోయిన్‌ కానీఎంత వదలించుకుందామన్నా వదలవు కొన్ని సినిమాల్లో. ఇందులో ఆ తావీదు బదులు ‘లవ్‌ సైన్స్‌’ అనే పుస్తకం. అనుకోకుండా (రచయితల భాషలో డెస్టినీ (విధి) వల్ల) వరుణ్‌ (కల్యాణ్‌ రామ్‌) నుంచి మీరా(తమన్నా) చేతికొస్తుంది. ఆమె ఎలా వదలిపెట్టేసినా, తనను వెంటాడుతూనే వుంటుంది. అలా వెంటాడి వెంటాడి వాళ్ళ నాన్న (తనికెళ్ల భరణి) ఆర్డరు చేసిన ‘లా’ పుస్తకాలతో పాటు ఆమె ఇంటికి చేరుతుంది. అక్కడి నుంచి తమన్నా బెడ్‌ రూమ్‌కి వస్తుంది. తీరా ఆ పుస్తకం తిరగేస్తే పేజీలో మధ్యలో పెట్టిన కల్యాణ్‌ రామ్‌ ఫోటో కనిపిస్తుంది. అలా కనిపించటం పాపం. ఆమెకు శుభం జరిగిపోతుంది. ఆ తర్వాత శుభం జరగటం కోసమే పోటోను తీస్తుంది. ఆ శుభాల కారణంగా అతడి ప్రేమలో పడిపోయి, అతణ్ణి కలవాలనుకుంటుంది. ఈ ప్రయత్నంలో ఒక ఎఫ్‌. ఎంకి ‘ఆర్జే'( రేడియో జాకీగా) ఎంపికయి పోతుంది. తర్వాత వీళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ ముదిరి పోయి తనికెళ్ళ భరణి కంట పడుతుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల వల్ల కల్యాణ్‌ రామ్‌ కనపడకుండా పోతాడు. అతడిని కలవటానికి గడుపు పెట్టుకుని అతని కోసమే గడువు పెట్టుకుని రైల్వే స్టేషన్‌ నుంచే లైవ్‌ ప్రాగ్రాం చేస్తుంది. దీంతో కథ క్లయిమాక్సుకు వస్తుంది.

ట్రీట్‌మెంట్‌: ‘విధి’కి పరీక్ష

విధిని పూర్తిగా నమ్మే అమ్మాయికీ, అదే విధిని ఏమాత్రం నమ్మని అబ్బాయికీ మధ్య ప్రేమ పుట్టటం, దానికి ఆ అబ్బాయి అమ్మాయికి కాకుండా ‘విధి’ కి పరీక్ష పెట్టటమూ కొత్తగా వుంటుంది. అయితే రైళ్ళల్లోనూ, రైల్వేస్టేషన్లలోనూ ప్రేయసీ, ప్రియులు ఒకరినొకరు వెతుక్కోకవటం మాత్రం కొత్తే మీ కాదు.

స్క్రీన్‌ ప్లే: రైల్వే ‘లవ్’ ట్రాక్

రైల్లే స్టేషన్లో నుంచే ఎఫ్‌ ఎం లైవ్‌ పెట్టించి తమన్నా తోనే తన ప్రేమ కథను చెప్పించటంతో మొదలయిన కథ అదే లైవ్‌ తో ముగుస్తుంది. కాకుంటే, హీరోను ఎవరు ఎందుకు ఎలా కొట్టించారో, అన్నీ ఇంటర్వెల్‌ తర్వాత ముందే తెలిసిపోతుంటాయి. ఉత్కంఠను పూర్తిగా నిలపలేకపోవటానికి, దృశ్యక్రమంలోని లోపం కూడా ఒక కారణం.

హీరో: ఉన్నంతలో మెరుగు

ఇతర చిత్రాల్లో కంటే హ్యాండ్‌సమ్‌ గా కనిపిస్తాడు. కానీ హీరో పాత్రను అభివృధ్ధి చేయటంలో తగిన జాగ్రత్త తీసుకోలేదు. చిన్న అపార్థానికి ఎంత కోప్పడతాడో, పెద్ద అపార్థానికీ అంతే కోప్పడతాడు. అది హీరో లోపం కాదు. వరుణ్‌ పాత్రను వృధ్ధి చెయ్యటంలో రచయితల వైఫల్యం మాత్రమే.

హీరోయిన్‌: సొగసు చూడ తరమా..

మొత్తం ఈ రొమాంటిక్‌ చిత్రానికి తమన్నా యే ప్రాణం. ఆమె సౌందర్యం ఆమె పాత్రను మింగేసిందా.. అనే అనుమానం వస్తుంది. ఎన్నో చిత్రాల్లో ఆమెను చూసినా, ఒక సౌందర్య వతిని సరికొత్తగా చూసిన అనుభూతిని సినిమాటోగ్రాఫర్‌ కల్పించారు.

ఇతర నటులు: బిత్తిరి బెటరు

వెన్నెల కిషోర్‌ తనదైన శైలిలో హీరో ‘సైడ్‌ కిక్‌’ పాత్ర పోషించారు. కానీ అదే నటుడు గతంలో చేసిన పాత్రలాగే కనిపిస్తుంది. ఇతర చిత్రాల్లో కన్నా కాస్తంత ఎక్కువ నిడివిలో కనిపించిన బిత్తిరి సత్తి, మోతాదు మించని హాస్యంతో అలరించారు.

సంభాషణలు: గుర్తుండవు

సంభాషణలు మరీ గొప్ప ముద్ర వెయ్యలేదు. కనీసం మూఢనమ్మకాలను వెక్కిరించేటప్పుడు కూడా పెద్దగా హాస్యం పండలేదు. అలాగే ప్రేమ గాఢతను వ్యక్తం చేసే సంభాషణలు కూడా పెద్దగా లేవు. పోసాని కృష్ణ మురళి నటనగా ఎప్పటిలాగే ముచ్చట పడి నవ్వటం మినహా, ఆయన పలికిన సంభాషణ వల్ల కాదు.

సినిమాటోగ్రఫీ: ‘యాడ్’ మేకింగ్

చాలా చోట్ల యాడ్‌ ఫిలింలో ఫ్రేమ్‌లను చూసినట్లు వుంటుంది. గడియారం మీద చేసిన డ్యాన్సు చెయ్యటాన్ని బాగా తీశారు. అలాగే హీరో-హీరోయిన్ల రొమాంటిక్‌ సీన్లను, ఇంటిమేట్‌గా తీయటంలో సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ కనపరిచారు.

సంగీతం: బాక్ గ్రౌండు బోరు.. పాటల్లో జోరు

పాటలకు కూర్చిన సంగీతాన్నీ, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌నీ కూర్చింది ఒకరయినా, సంబంధం లేకుండా వున్నట్లుంటుంది. పాటల విషయంలో తీసుకున్న శ్రధ్ధను, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా తీసుకుని వుంటే బాగుండేది.

కొరియోగ్రఫీ: బ్యాలే బ్యూటిఫుల్

బ్యాలే చేసినప్పుడు, తమన్నా ‘క్విక్‌ మూవ్‌మూంట్స్‌’ కొంచెం ఆశ్చర్య పరుస్తాయి. అరిగిపోయిన స్టెప్పులతో కాకుండా, కొత్త మూవ్‌మెంట్స్‌తో ఎక్కడికక్కడ కావలసిన ఉద్వేగాన్ని ఇవ్వగలిగారు. ఈ సినిమాలో మెరిట్‌ అంటూ వుందంటే, సినిమాటోగ్రఫీ తర్వాత కొరియోగ్రఫీనే.

కొసమెరుపు: మరీ కథలేకుండా ‘విధి’ నే నమ్ముకుని తీసిన సినిమా ఇది. ఇంటర్వెల్‌కు ముందు హీరో హీరోయిన్ల పరిచయమూ, పరీక్షలే వుంటాయి. ఇంటర్వెల్‌ అయిపోగానే కథ మొదలవుతుందని ఆశిస్తామో, ఇంతలోనే అది క్లయిమాక్సుకు వచ్చేస్తుంది. ఈ సినిమా థీమ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా ఆడితే ఈ చిత్ర దర్శక. నిర్మాతలు అది ‘డెస్టినీ’ అనుకుంటారు; ఆడక పోయినా ‘డెస్టినీ’ అనుకుంటారు. కానీ చూడటానికి వెళ్ళిన వారి ‘డెస్టినీ’ మాత్రం ఒక్కటే. ఎంత వెదికినా కథ దొరకదు.

-సర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *