FeaturedFilms

ఈ నగరంలో ‘త్రీ ఇడియట్స్‌’కి ఏమైంది?

రేటింగ్‌:3/5

క్విక్‌ లుక్‌:

ఫస్ట్‌ ఇంప్రెషన్‌: ‘త్రీ ఇడియట్స్‌’ సినిమాను హైదరాబాదీ తెలుగులో తీసినట్టుంది. నవ్వుకు నవ్వూ, లవ్వుకు లవ్వూ, స్నేహానికి స్నేహం, కేరీర్‌కు కేరీర్‌. కాకుంటే ఇంకో ఇడియట్‌ ఎక్కువ. స్నేహితులు నలుగురు.

ప్లస్‌ పాయింట్స్‌: ప్రేక్షకులు అందరూ ఆ నలుగురు బ్యాచిలర్స్‌ క్లబ్‌లో చేరిపోయినట్టుంటుంది

ప్రతీ పాత్రా అతుక్కుపోయి, థియేటర్‌ బయిటకు కూడా మనతో వచ్చేస్తున్నట్టుంటుంది.

– డైలాగ్స్‌ పనిగట్టుకుని రాసినట్టుండవు. అంత సహజంగా వుంటాయి.

-సినిమా ఇంకో గంట అదనంగా నడిచినా చూడగలిగేట్టు వుంది.

– దాదాపు హాస్యం చెయ్యని పాత్రంటూ వుండదు.

– సినిమాటోగ్రఫీ గోవా బీచ్‌లో ఎంత గొప్పగా వుంటుందో, ఇరుకు గదిలో కూడా అంత అందంగా వుంటుంది.

-దర్శకుడంటూ ఒక్కడున్నాడని చివరి వరకూ గుర్తుకు రాడు. అంతలా చూసేట్టు చేస్తాడు.

మైనస్‌ పాయింట్స్‌:

-కథ అలా నడిచి పోతుంది. ప్రేక్షకుడు పొందే ఉద్వేగ స్థాయి, ప్రారంభంలో ఎలా వుంటుందో చివరి వరకూ అలాగే వుంటుంది. నలుగురి మధ్యా అదే తిట్టుడు, అదే కొట్టుడు, అదే కలుసుడు.

– నాలుగో పాత్ర (వెంకటేష్‌ కాకుమాను) నిజంగా నాలుగో పాత్రే. మిగిలిన ముగ్గురుకీ మద్దతు ఇస్తుంది.

– ఈ నలుగురూ చాలరన్నట్లు మధ్యలో ఓ బాల పాత్ర వస్తుంది. ప్రయోజనం వుండదు.

– ఈ నగరానికి ఏమయ్యింది అన్న ‘పొగాకు వ్యతిరేక’ ప్రకటనలలోగే ఆద్యంతం ‘మందూ, సిగరెట్‌’ వుంటుంది. ఆ మందు ఖర్చుతో నిజంగానే అరడజను షార్ట్‌ పిలిమ్‌లు తీయవచ్చేమో!


ఎవరెవరు?

చిత్రం: ఈ నగరానికి ఏమైంది

జోనర్‌: కామెడీ

నటీనట వర్గం:విశ్వక్షేన్‌ నాయుడు, సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమతం, వెంకటేశ్‌ కాకుమాను,అనిషా ఆంబ్రోజ్‌, సిమ్రాన్‌ చౌదరి

దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ ధాస్యం

నిర్మాతలు: డి.సురేష్‌ బాబు, శ్రీనివాస్‌ కౌశిక్‌, వెంకట్‌ సిద్దారెడ్డి

రచన :తరుణ్‌ భాస్కర్‌

సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి

సంగీతం: వివేక్‌ సాగర్‌

ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల

విడుదల తేదీ:29 జూన్‌ 2018


కథాంశం: మూడు పాత్రల ముచ్చటే.

త్రీ ఇడియట్స్‌ కథ లాంటిదే. లాంటిదేమిటి.. అదే అనుకోరాదూ..! స్నేహం కోసం హీరో ఊహించినదానికంటా ఎక్కువ చేస్తాడు. ఒకడు చివరివరకూ అమెరికాలో సెటిలవ్వాలనే కలకని చివర్లో కళ్ళు తెరుస్తాడు. ఇంట్లో వాళ్ళకి శుధ్ద మొద్దులాగే కనిపిస్తూ, తనలోని నటుణ్ని రక్షించుకుంటాడు. నాలుగోవాడు.. ముగ్గురికీ మద్దతు దారు. మూడు పాత్రల ప్రవర్తనా .. వెరసి కథాంశం. నాలుగో పాత్ర, ఈ ముగ్గురికీ మద్దతు ఇస్తూ బతికేస్తుంది.

కథ: పెళ్ళి కావాలని ఒకడూ, ప్రేమ ఫెయిలందని ఇంకొకడూ

ఏ ముందీ ..కార్తీక్‌ (సుశాంత్‌ రెడ్డి) అనే కుర్రాడు ఖరీదయిన క్లబ్‌లో పనిచేస్తూ, అక్కడి కొచ్చే ‘హైసొసైటీ’ వాళ్ల లాగా ఖరీదయిన కారుల్లో తిరుగుతూ, అరుదయిన వైన్‌ తాగుతూ గడపాలని కలలు కంటూంటాడు. ఈ విషయాన్ని ఇట్టే గ్రహించేసిన క్లబ్‌ ఓనరు, తన దగ్గర వున్న ఖరీదయిన ఉంగరం ఒకటి ఇచ్చి, తన కూతురుకు ప్రపోజ్‌ చెయ్యమంటాడు. లవ్‌లో ఫెయిలయిన వివేక్‌(విశ్వక్సేన్‌ నాయుడు), డబ్బింగ్‌ చెప్పుకునే కౌశిక్‌(అభినవ్‌ గోమతం), మద్దతు ఇచ్చే నాలుగో మిత్రుడు ఉప్పు(వెంకటేశ్‌ కాకుమాను)లతో మందు కొడతాడు.. అంతే పార్టీలో జరిగిన ట్విస్ట్‌ వల్ల అందరూ గోవా వచ్చిపడతారు. ప్రపోజ్‌ చేసే ఉంగరం కనిపించదు. కార్తీక్‌ పెళ్ళికి కీలకమైన ఉంగరాన్ని సంపాదించటానికి ఏం చేస్తారు…? కడకు ఏమి గుర్తిస్తారు…? ఇంతే కథ.

ట్రీట్‌మెంట్‌: అక్కడ ‘డోరు’.. ఇక్కడ ‘కారు’

సినిమాను ఎంత గోవా చుట్టూ తిప్పేసినా, తరుణ్‌ భాస్కర్‌ తనకు అవార్డుల పంటను కురిపించిన ‘పెళ్ళి చూపులు’ ట్రీట్‌మెంట్‌ నే ఈ సినిమాలోనూ కొంత వాడారు. ”పెళ్ళి చూపుల’ కారణంగా (డోర్‌ యాక్సిడెండల్‌ గా లాక్‌ అయి) ఇరుక్కున్న హీరో, హీరోయిన్లు తమ ఫ్లాష్‌ బ్యాక్‌ లు చెప్పుకుంటారు. ఇక్కడ కూడా అంతే. మందు కొడదామని బార్‌కు వచ్చిన నలుగురికీ ఓ అమ్మాయి ‘మ్యూజిక్‌ ఫెస్టివల్‌’ నిర్వహిస్తున్నానంటూ వచ్చి, వాళ్ల ఫ్లాష్‌ బ్యాక్‌ లు రికార్డు చేస్తుంది. అందులో అందరకీ ఒకే గతం వున్నా…అది వివేక్‌ చుట్టూ తిరుగుతుంది. కథ కార్తీక్‌ పెళ్లి చుట్టూ తిరిగినా, హీరోయిన్‌ వున్నవాడే హీరో కావాలి- అన్న రూలుతో చూస్తే మాత్రం వివేకే హీరో. అతడికో లవ్వూ, అందులో వైఫల్యం. అయితే ‘పెళ్ళి చూపుల్లో’ డోర్‌ యాక్సిడెంటు వున్నట్టు, ఇందులో కూడా యాక్సిడెంటు వుంటుంది. అదే ‘కారు’ యాక్సిడెంటు. ఈ రెండు ఘటనల వల్లా ఫ్లాష్‌ బ్యాక్‌లు సులభ వాయిదాల్లో బయిట పడతాయి. కాబట్టి ఆసక్తి పెరుగుతుంటుంది.

స్క్రీన్‌ ప్లే: ఏ సీనుకా సీనే

తర్వాత ఏం జరగుతుందోనన్న ఉత్సుకతను లేపే విధంగా కాకుండా, ఏ దృశ్యానికా దృశ్యమే ఆసక్తి కలిగించే విధంగా వుంది. అందుకే ఎంత సేపయినా చూడటానికి వీలుగా వుంది. ఇదే పధ్ధతిలో ఇంకో గంట పెంచేసినా చూసేలావుంది స్క్రీన్‌ ప్లే. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్‌ కొచ్చేశాక కూడా, అది క్లయిమాక్స్‌ అని తెలియకుండా వస్తుంది. తెలియకుండా ముగుస్తుంది.

హీరోలు: వివేక్‌ టాపు, అభినవ్‌ తోపు!

నలుగుర్నీ హీరోలుగా చూపించే ప్రయత్నం దర్శకుడు చేసినా, ఇద్దరే హీరోలు. ఒకరుపెళ్లి హీరో కార్తీక్‌ , ఇంకొకరు ప్రేమ హీరో వివేక్‌. ఇందులో వివేక్‌ పాత్ర పోషించిన విశ్వక్సేన్‌ నాయుడు హాండ్‌ సమ్‌ గా వుండటంతో పాటు, లోన భయం వుంచుకొని, పైకి ముక్కోపిలా ప్రవర్తించే నటనలో బాగా గుర్తుండి పోతాడు. కార్తీక్‌ కూడా బాగా చేస్తాడు. అయితే అభినవ్‌ మాత్రం పొదుపైన ఎక్స్‌ప్రెషన్స్‌తో హాస్యాన్ని బాగా పండిస్తాడు. మరీ ముఖ్యంగా క్లయిమాక్సుకు ముందు వివేక్‌ ఒక పక్క తాగుతుంటే, తనను ఎక్కడ కొడతాడో అని అనుమాన పడుతూ చేసిన సన్నివేశంలో ప్రేక్షకులూ నవ్వుతూనే వుంటారు.

హీరోయిన్లు: అందానికీ ఆమే, రాగానికీ ఆమే

హీరోయిన్స్‌ కూడా ఇద్దరు అనుకోవాలి. ఇద్దరూ ‘ప్రేమ’ హీరో చుట్టూనే అల్లుకుంటారు. ఇద్దరిలోనూ అనిషా అంబ్రోజ్‌ గుర్తుండి పోతుంది. అందానికి అందం, నటనకు నటన. ఈ చిత్రంలో రెండూ కలబోసినట్లుంటుంది. సిమ్రాన్‌ చౌదరి ఫర్వాలేదనిపిస్తుంది. అంతే.

సంభాషణలు: లోన స్నేహం, పైకి తిట్టు

తిట్లలోనే ఆప్యాయతలను ప్రకటించుకునే విధంగా సంభాషణలు వుంటాయి. ముఖ్యంగా, హీరోకు హీరోయిన్‌తో బ్రేక్‌ అప్‌ అయిన సన్నివేశంలో.. హీరో తనకు ‘ఏంకాలేదురా.. పొద్దున్నే వచ్చేస్తుంది రా..’ అని తనకు తాను సంభాళించుకుంటూ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి.

కొసమెరుపు: ‘ఆనంద్‌’ తో అబ్బురపరచి, ‘హ్యాపీడేస్‌’తో ఊపిరాడకుండా చేసిన శేఖరకమ్ముల లాగా, తరుణ్‌ భాస్కర్‌ కూడా ‘పెళ్ళిచూపులు’తో ముద్ర వేసి, ‘ఈ నగరానికి ఏమయింది?’ చిత్రంతో తన శైలిని స్థిరపరచుకున్నారు. ఈ సినిమా చదువుకున్న యూత్‌ ని ఏ మాత్రం డిజప్పాయింట్‌ చెయ్యదు.

-సతీష్‌ చందర్‌

ఈ రచయిత ఇతర రచనలకోసం చూడండి https://www.satishchandar.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *