బాబు ప్రచారానికి తప్పని తెలంగాణ బ్రేకులు.!?
రహదారి ఎక్కడ ఒకే విధంగా ఉండదు. దారి మధ్యలో ఎత్తు పల్లాలు ఉంటాయి. అప్పుడప్పుడు బ్రేకులు పడాల్సిందే. (లేదంటే ఏం జరుగుతుందో అందరికి తెలుసు.) అది రహదారి పైనే గానీ, రాజకీయంలో గానీ. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టి.టీడీపీ) పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ బయటకు రాని పరిస్థితి. అయినప్పటికీ, అప్పటి పరిస్థితి బట్టి వారు ఉద్యమంలో పాల్గోన్నారు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోటోను ఎక్కడా ప్రదర్శించనలేనటువంటి పరిస్థితి. గత ఎన్నికలలో కొద్దో గొప్పో తెలంగాణలో అనుకున్నంత మేర కాకున్న ప్రజాదరణతో కొన్ని సీట్లను పొందారు. (అయితే గెలిచిన వాళ్ళు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారనుకొండి. అది వేరు విషయం.)
తర్వాత తెలంగాణలో ఎక్కడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయలేదు. కాగా, సరిగ్గా మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మహా కూటమి భాగస్వామ్యంతో ముందుకేళుతుంది. అంతా బాగానే ఉందనుకునే సమయానికి నాయకులకు సంశయం ఏర్పడింది. తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే రోడ్‌మ్యాప్ వేశారు కూటమి నాయకులు. కూటమి భాగస్వామ్య ప్రచార కార్యక్రమంలో బాబు రెండు రోజుల పాటు పాల్గోననున్నారని సమాచారం. ఈ కార్యక్రమంలో ఏ ప్రాంతంలో పర్యటించాలన్నదే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎలాగూ రాజదాని నగరంలో పర్యటన ఉంటుంది. ఈ ప్రాంతం కాకుండా మరే ప్రాంతాల్లో పర్యటిస్తారనేది తేలియాల్సివుంది.
ఎక్కువగా సెటిలర్స్ ఉన్నా నల్గోండ, నిజామాబాద్‌లతో పాటు హైదరాబాద్ చుట్టూ వున్న ప్రాంతాల్లో తమ ఉనికి ఉన్న చోట పాల్గోంటరేమోనని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళయినా… తెలుగుదేశం అధినేత తెలంగాణ ప్రాంతంలో పర్యటించాలంటే బ్రేకులు పడాల్సిందేనేమో…