ఎన్టీఆరే బాలయ్యగా…
రేటింగ్:3.75/5
ఫస్ట్ ఇంప్రెషన్: బాలయ్య ఎన్టీఆర్ లా వుండటం కాదు; ఎన్టీఆరే బాలయ్యలా వున్నాడు. కొడుకే తండ్రి పాత్ర వేస్తే, పోలికల్ని ఎరువు తెచ్చుకోనవసరం లేదు. నటిస్తే చాలు. బయోపిక్‌లో నటన కన్నా ‘మేనరిజాలు’ ముఖ్యం. రెంటినీ బాలయ్యనుంచి క్రిష్ రాబట్టారో, బాలయ్యనుంచే వాటంతట అవి వచ్చేశాయో తెలీదు కానీ, ఎన్టీఆర్ హావభావాలు కనిపించేశాయి.
కథాంశం: నాందియే ‘శుభం’ కార్డు
ఇక కథ అంటరా..? బయోపిక్ కుండే పరిమితి ఒకటి వుంటుంది. చరిత్ర ముందు పెట్టుకుని కథ అల్లాలి. కానీ అది కల్పిత గాధ కాకూడదు. ఆ టచ్ వుండాలి. ఈ కథను సౌకర్యవంతంగా రెండు భాగాలు చేసేసుకున్నారు. సినిమా జీవితాన్ని ‘ఎన్టీఆర్- కథానాయకుడ’ని, రాజకీయ జీవితాన్ని ‘ఎన్టీఆర్- కథానాయకుడు’ అని రెండు ‘పార్ట్’లు చేసి పెట్టేసుకున్నారు. ఇలా రెండేసి విడతలుగా ఒకే కథను చూడటానికి ప్రేక్షకులకు కూడా అలవాటు వుండాలి. ఇంతకు ముందయితే తెలుగువారికి ఇది కష్టమయ్యేది కానీ, రాజమౌళి అలవాటు చేశారు. ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కొనసాగింపు కోసం మహా అయితే ఓ పావుగంట ఎదురు చూస్తారు. కానీ రెండేళ్ళు సునాయసంగా ఎదురు చూశారు. గుర్తు రాలేదా? ఈ అలవాటు చేసింది రాజమౌళి. బాహుబలి-బిగినింగ్ కూ, బాహుబలి- కన్‌క్లూజన్‌కీ అంత గ్యాప్ వుంది. ఈ అలవాటును క్రిష్ వాడుకుంటున్నారు. కథానాయకుడు ముగింపులో ఇచ్చిన ట్విస్ట్ తర్వాత మహానాయకుడు కోసం నెల రోజులు ఎదురు చూడలేరా ప్రేక్షకులు.
అందుకే ఈ కథలో సినిమా జీవితం అయిపోయాక, రాజకీయ ప్రవేశాన్నీ పార్టీని (తెలుగుదేశం) పరిచయం చేసి ‘నాంది’ అన్నారు. ‘శుభం’ కార్డు మహానాయకుడు తర్వాత పడుతుంది.
ట్రీట్‌మెంట్: ‘మై ఆటోగ్రాఫ్- స్వీట్ మెమరీస్’
జీవిత చరిత్రను సినిమా కథలో ఒదిగే లా చెయ్యటానికి ఒక్కొక్కరు ఒక్కొక ఫీట్ చేస్తారు. ఇందులో నందమూరి బసవతారకం క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూ, తన భర్త జీవితాన్ని నెమరు వేసుకుంటుంది. ఇదీ క్రిష్ ఇచ్చిన ట్రీట్‌మెంట్. సావిత్రి జీవితాన్ని ‘మహానటి’గా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఈ ట్రీట్ మెంట్ కోసం ‘రెండు గతాల్ని’ సృష్టించాల్సి వచ్చింది. జర్నలిస్టు- ఫోటోగ్రాఫర్ల జంట పత్రిక కోసం చేసిన పరిశోధనలా ‘మహానటి’ కథ సాగుతుంది. వాళ్లుకూడా వర్తమానం లో వుండరు. 60వదశకంలో వున్న సావిత్రి కథ చెప్పటానికి వారు 80 వ దశకంలో పాత్రికేయుల్లాగా మారతారు. పైపెచ్చు వారిద్దరూ (సమంత- విజయ్ దేవరకొండ) ప్రేమించుకుంటారు. ఈ జంట కల్పన. సినిమా కోసం ‘సమాంతరంగా ప్రేమ కథ’ను నడిపే పనిని నాగ్ అశ్విన్ పెట్టుకున్నారు. కానీ, ఇందులో ఘటనలు చాలా స్ట్రెయిట్‌గా జరిగిపోతుంటాయి. నవరసాలూ ఎన్టీఆర్ యథాతథ జీవితం నుంచే తీసుకునే ప్రయత్నం చేశారు. అందువల్ల ఎన్టీఆర్ జీవితంతో మరీ ఎక్కువ పరిచయంలేని కొత్త తరానికి అక్కడక్కడా ‘డాక్యుమెంటరీ’గా అనిపిస్తే అనిపించ వచ్చు.
స్క్రీన్ ప్లే: సినిమాలే సీన్లు
ఎన్టీఆర్ ఫిల్మ్‌కేరీర్‌లో బాగా గుర్తుండిపోయే చిత్రాలను వరుస క్రమంలో తీసుకుని వాటి మధ్యలో నిజజీవిత సన్నివేశాలను పెట్టటమే ఈ స్క్రీన్ ప్లేలోని ప్రత్యేకత. మరీ ముఖ్యంగా సినిమాలో భార్య బసవతారకం(విద్యాబాలన్) తమ్ముడు త్రివిక్రమ్(దగ్గుబాటి రాజా) లతో వున్న అనుబంధం చిత్రం మొత్తం సాగుతుంది. అలాగే సినిమా సెకండ్ హాఫ్ అంతా, పేరుకు సినిమా జీవితమే కానీ, రాబోయే రాజకీయ జీవితానికి ప్రిపరేషన్ లాగా వుంటుంది.
హీరో: తండ్రిముందుకు.. కొడుకు వెనక్కి
హీరో అని ఎవర్నననాలి? ఈ సినిమాలో ఇదో చిక్కు ప్రశ్న. బాలయ్యే, ఆ పాత్ర వేసినా, ఎన్టీఆరే హీరో. ఎందుకంటే ఈ పాత్ర పోషణలో బాలయ్య తప్పుకుని, తండ్రికి దారిచ్చారు. ‘పాతాళ భైరవి’, ‘గుండమ్మ కథ’ ‘దాన వీర శూర కర్ణ’ సన్నివేశాలు చూస్తున్నప్పుడు బాలయ్య కనిపించరు; ఎన్టీఆరే ముందుకొస్తారు. మరీ ముఖ్యంగా రెండు సన్నివేశాల్లో బాలయ్య బాగా గుర్తుండిపోతారు. ఒకటి: నాగిరెడ్డి, చక్రపాణిలు వద్దంటున్నా, దర్శకుడు ఎన్టీఆర్ చేతనే శ్రీ కృష్ణుడి పాత్ర వేయించినప్పుడు, శ్రీకృష్ణుడి గెటప్‌లో సెట్స్‌లో నడుచుకుంటూ వచ్చిన సన్నివేశం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రెండు: కొడుకు రామకృష్ణ మరణ వార్త విన్నాక కూడా, షూటింగ్ లో పాల్గొని కృష్ణకుమారి తో డ్యాన్స్ చేసిన సన్నివేశంలో బాలయ్య కదిలిస్తారు
ఇతర నటులు: సుమంతే ఏఎన్నార్
మిగిలిన వారిని ఇతర నటులు అనటానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా బసవ తారకం పాత్రలో విద్యాబాలన్, అక్కినేని పాత్రలో సుమంత్‌లు చాలా సహజంగా చేశారు. ఏఎన్‌ఆర్‌లో వుంటే గ్రేస్ ను మిస్ కాకుండా చూశాడు. సావిత్రి పాత్రలో నిత్యమీనన్ ఎంత అద్భుతంగా చేసినా, ‘మహానటి’లో ‘కీర్తి సురేష్’చేసిన మాయ నుంచి ప్రేక్షకులు బయటపడరు కాబట్టి, ఆమెను సావిత్రగా కన్నా నిత్యామీనన్‌గానే చూస్తారు. కొద్ది సేపు కనిపించినా హెచ్.ఎం. రెడ్డిగా సత్యనారాయణ గుర్తుండి పోతారు. అంతటి వృధ్ధాప్యంలోనూ అద్భుత నటన చేశారు.
రాజకీయ కోణం: తెలుగుదేశానికి అంకితం
సినిమాను ఎంత జాగ్రత్తగా తీసినా ఇందులో రాజకీయ కోణం లేక పోలేదు. ఎన్టీఆర్ జీవితభాగస్వామి అంటేనే బసవతారకం తర్వాత, తర్వాత ఆయన జీవితంలో ఎవరు (లక్ష్మీపార్వతి) ప్రవేశించినా వారు కాలేరు- అని నిరూపించే ప్రయత్నం ఒకటి జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ వెనుక ఎంత గొప్ప నేపథ్యం వుందో- అని తెలిపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొంత ఊతమివ్వాలనే కోరిక కొంత మేరకు నెరవేరింది.
కొసమెరుపు: ప్రముఖుల జీవితాలను తెరకెక్కించేటప్పుడు, కేవలం వారి జీవితంలో ఘటనలను మాత్రమే తీసి ఊరుకుంటే అది సాదా సీదా బయోపిక్ అవుతుంది. వారి జీవిత సారం కూడా చెప్పాల్సి వుంటుంది. ఎన్టీఆర్ ‘పని రాక్షసుడు’, ‘మొండి వాడు’ – ఈ రెండు లక్షణాలు ప్రేక్షకుల మనసు మీద ముద్ర వేస్తాయి. ఈ విషయంలో క్రిష్ కృషి గొప్పది. ఈ సినిమా చూడొచ్చేమిటి? చూడాల్సిందే.
-సర్