హుజూర్ నగర్: కామ్రేడ్ల కోటలో కమ్మ, రెడ్ల వాటా..?
హుజూర్ నగర్ (తెలంగాణ): ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట, ఇప్పుడు కులాలకు కూడలిగా మారిందా..? కొన్ని దశాబ్ధాల కాలం పాటు ఎర్రజెండా పాగా వేసిన ఖిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. ఈరోజు కుల రాజకీయాలకు అడ్డాగా మారిందా…? అంటే, అవుననే చెప్తున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాలు.
ఇప్పటి ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీల నుండి అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరి వరకు 119 మంది నామినేషన్ వేయగా అందులో ఒక చివరి రోజే 109 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. ఇందులో రైతులు, నిరుద్యోగ యువత ఉండటం విశేషం. వీరితోపాటు పట్టాపాస్ పుస్తకం ఇవ్వలేదని ఒక మహిళ (85) నామినేషన్ వేసిన వారిలో ఒకరు. ఇందంతా చూసినట్లయితే, గత పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వున్న పోటీని తలపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి సైదిరెడ్డి, టీడీపీ నుండి చావా కిరణ్మయి, సీపీఐ(ఎం) నుంచి శంకర రావులతో నామినేషన్ వేశారు. ఈ స్థానం నుంచి 2018 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. అప్పటి తెరాస అభ్యర్థి సైదిరెడ్డిపై అతి తక్కువ (7,000) మెజారీటీతో గెలుపోందారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి తిరిగి అధికార పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిపై, ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు.
ఇదిలా వుంటే, గత సార్వత్రిక ఎన్నిక (2018)లలో మహాకూటమి (కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐతో పాటు టీజేఎస్ పార్టీలు)గా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ప్రస్తుతం ఎవరికి వారు పోటీలో ఉన్నారు. అందులో భాగంగానే టీడీపీ పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన చావా కిరణ్మయికి ‘బి’ ఫారమ్ ఇచ్చారు. గతంలో ఈ స్థానం నుంచే ఉత్తమ్ ఐదు సార్లు పోటీ చేసి గెలిచారు. అయితే తెలుగు దేశం పార్టీ మరో గెలుపు దిశగా పయనిస్తుందని అనుకోలేం… కానీ కనీసం తమ ఉనికిని చాటడానికి ప్రయత్నం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-తెలుగూస్ న్యూస్ డెస్క్