కమల్ నాథ్ ను దించింది ’కర్ణాటక స్ర్కీన్ ప్లే‘
మధ్యప్రదేశ్ లో నడిచింది కూడా ‘కర్ణాటకమే’. లేకుటే జ్యోతిరాదిత్య సింధియా కూల్చేస్తే కూలిపోయేది కాదు కదా- అక్కడి రాష్ట్రప్రభుత్వం. ఇంతకీ కర్ణాటకమంటే ఏ కర్ణాటకం? గత ఏడాది (2019)జులై లో జెడి(ఎస్)- కాంగ్రెస్ సర్కారును కూల్చి యెడ్యూరప్ప బీజేపీ సర్కారును స్థాపించారే. సరిగ్గా అదే మోడల్.
ఈ మోడల్ లో ప్రత్యేకత ఏముందీ? ఎప్పటిలాగే కొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎత్తుకు పోవటమూ; హొటల్ లోనూ రిసార్టులోనూ వుంచటమూ, ఆ తర్వాత ఎత్తుకు పోయిన పార్టీ (ప్రతిపక్షం) బలపరీక్ష రోజున వారిని తెచ్చి, అనుకూలంగా వోటు వేయించుకోవటమూ.. ఇంతేకదా!
ఇది చాలా పాత మోడల్. జంపులు చేయించవచ్చు. కానీ డూపులు పెట్టించి దూకించటం కాదు. సినిమాల్లో ఫైట్స్ సీన్సుకు గ్రాఫిక్సు వచ్చినట్లు, ఇక్కడ కూడా స్పెషల్ ఎఫెక్టులు వచ్చేశాయి. ఒక్కొక్కరి చేత విడివిిడిగా దూకించకూడదు. ఖర్చయిపోతారు. పాత ఫిరాయింపు చట్టమే అడ్డుకుంటుంది. పోనీ మూడోవంతు మంది దూకిద్దామంటే ఆపప్పులు ఇప్పడు ఉడకవు. మూడింటా రెండొంతుల మంది చేత దూకించాలి. ఇంత పెద్ద ‘గ్యాంగ్ జంప్’ చెయ్యాలంటే, ఎప్పుడో కానీ కుదరదు. ఫిరాయింపు చట్టం తాజా సవరణ అడ్డుకుంటుంది.
అందుకే కొత్త మోడల్. ఏం లేదు. శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య తగ్గించటం. అది ఏదో ఒక పార్టీ చేతిలోవుండదు కదా! ఎందుకుండదూ..? తలచుకుంటే వుంటుంది. బీజేపీ ఇప్పటికి రెండు సార్లు, రెండు సందర్భాల్లో తలచుకుంది. గత ఏడాది కర్ణాటకలో. ఇప్పుడు (మార్చి 2020లో) మధ్యప్రదేశ్ లో.
ఈ మోడల్ చాలా సింపుల్. ఎంతకు సంఖ్య తగ్గాలనుకుంటే లెక్కగట్టాలి. మధ్యప్రదేశ్ శాసన సభలో మొత్తం సభ్యులు 228. అందులో అధికార పక్షం లోని 22 మందికి ’పసుపు’ రాయాలి. (బలి పశువుల్ని చెయ్యాలి కదా.. ఇంకో మాటలో చెప్పాలంటే ‘మానవ బాంబుల్ని’ చెయ్యాలి. వీరి రాలి పోతూ, అధికార పక్షాన్ని కూల్చాలి.) వారి చేత విడివిడిగా శాసన సభ్యత్వానికి రాజీనామా చెయ్యించాలి. వారిని భద్రంగా రిసార్టులోనో, హొటల్లోనో వుంచాలి. రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలి. స్పీకర్ ఒప్పుకోక పోతే కోర్టు కెక్కాలి. కోర్టు బల పరీక్ష తేదీ నిర్ణయిస్తుంది. అప్పుడు అసెంబ్లీ లో సంఖ్య 206కు పడిపోతుంది. 104 దాటిన పార్టీ దే సర్కారు. సరిగ్గా అలాగే జరిగింది. కాంగ్రెస్ కు 92 మంది మించి లేరు. బీజేపీకి 107 మంది వున్నారు. కమల్ నాథ్ అవుట్.
మానవ బాంబులు ప్రాణాలు వదలుకోవటానికి సిధ్ధపడతారు. ఇక్కడ 22 మందీ శాసనసభ్యత్వాన్ని వదలుకోవటానికి తయారవుతారు. అంతే తేడా.
-సతీష్ చందర్
(ఈ మోడల్ గురించి సతీష్ చందర్ బి ఫర్ బ్యాలెట్ గ్రంథంలో వివరంగా వుంది.)