‘హింగ్లీష్’ ‘తెంగ్లీష్’ చదువులు!
చదవేస్తే– ఉన్న మతి తర్వాత- ఉన్న స్థితి మారుతుందా? బువ్వ దొరికేస్తుందా? పొట్ట చేత పట్టుకుని కాకుండా, పట్టా చేతపట్టుకుని వెళ్ళితే పని దొరికేస్తుందా? ఇక్కడి చదువు ఎక్కడయినా మారుతుందా?
ఏమో!
ఇలా అనుమాన పడటానికి వీలు లేదంటోంది, కేంద్రంలోని ఎన్డీయే(బీజేపీ) సర్కారు. జాతీయ విద్యా విధానం-2020 మీద వొట్టు. దేశంలో మూడేళ్ళు దాటిన ప్రతీవాడినీ వొడిలోనుంచి బడిలోకి వెయ్యటం ఖాయం- అంటూ సధీర్ఘ పత్రాన్ని ఆమోదించేసి విడుదల చేసేసింది. ఏ బడిలో నన్నది తర్వాత విషయం. సర్కారీ బడిలోనా..? లేక కార్పోరేట్ బడిలోనా..? విధానమన్నాక రెంటికీ వర్తించాలి కదా..! వర్తించటం మొదలు పెట్టాక ఏ బడులు ఎక్కువ లాభ పడతాయన్నది తర్వాత విషయం. ఇప్పటికయితే, కార్పోరేట్ బడులదే పై చెయ్యి. సాధారణంగా ప్రతీ సంస్కరణా ప్రయివేటు బడులకే ఊతమిచ్చేదిలాగా ఇంతవరకూ వుంటూ వచ్చింది. ఈ విధానం కూడా అదే పని చేసిందా?
దేశంలో విద్య, వైద్యం- ఏనాడో భారీ వ్యాపారాలయి కూర్చున్నాయి. బువ్వలేని వారి పిల్లలే వీధి బడులకు వెళ్ళి, చదువుకున్న కొన్నాళ్ళయినా మధ్యాహ్న భోజనం తిని వస్తున్నారు. ఆ తర్వాత ఆ చదువుల్ని వారిలో కొనసాగించే వాళ్ళు తక్కువ. ఇదే జాతీయ విద్యావిధానం పత్రంలో ఇచ్చిన గణాంకాల ప్రకారమే, 2015 లో ప్రాథమిక విద్యను మధ్యలో వదలివేసిన వారు (డ్రాప్ అవుట్లు) 6.2 కోట్లు మంది వున్నారు. వీరు ఇలా మధ్యలో బడి ఎగ్గొట్టకుండా వుండాలంటే ఇంకా చెయ్యాలి? మధ్యాహ్న భోజనంతో పాటు, ఉదయ భోజనం (బ్రేక్‌ఫాస్ట్) కూడా పెట్టాలా? మరీ ఇలా ఆలోచించాలా? అవును అలాగే ఆలోచించారు. ఇప్పుడు కొత్త విధానంలో, అందుకు హామీ కలుగ చేశారు.
రెండు భాషల్లోనూ బోధన?
ఈ విద్యావిధానం చర్చకు వచ్చినప్పటి నుంచి బోధనా మాధ్యమం అన్నది ప్రాధమికంగా వుంటూ వస్తోంది. దీంతో పాటు భాషల అధ్యయనం కూడా చర్చకు వచ్చింది. ప్రాథమిక విద్యను విధిగా మాతృభాష (ఇంటి భాష లేదా ప్రాంతీయ భాష) లో అధ్యయనం చెయ్యాలనే షరతును విధించారు. ఆ తర్వాత ఎనిమిదో తరగతి వరకూ వీలయితే కొనసాగించేలనే షరతును పెట్టారు. ఈ విధానం ప్రభుత్వ, ప్రయవేటు బడులకు కూడా వర్తిస్తుంది. మాతృభాషలోనే విద్యార్థులు వివిధ శాస్త్రాలను సులభంగా గ్రహించగలరనే ఏకపక్ష నిర్ధారణలు ఈ పత్రంలో చేశారు. అందుకు అనువయిన వాదనలనూ, సూత్రీకరణలను మాత్రమే చేశారు. మళ్ళీ ఏమనుకున్నారో, శాస్త్ర విషయాలను బోధించేటప్పుడు వీలయినంత వరకూ ఉభయ భాషలలోనూ (అనగా ఇంగ్లీషూ- మాతృభాషలలోనూ) బోధించే అవకాశం ఇచ్చారు. అంటే ‘మిశ్రమ మాధమ్యమానికి’ ఇలా దారులు తెరిచారు. అప్పుడు తెలుగునాట ‘తెంగ్లీష్’ (తెలుగు. ఇంగ్లీష్), ఉత్తరాది రాష్ట్రాలలో ‘హింగ్లీష్’ (హిందీ. ఇంగ్లీష్)లోనూ బోధన జరిగిపోతుందన్నమాట.
అంతిమంగా ‘హిందీ’త్వమే!
ఆగండి. కొత్త విద్యావిధానంలో భాషా సేవ ఇక్కడితో ఆగిపోలేదు. పిన్న వయసులోనే భాషలు వొంటపడతాయనే సైధ్ధాంతిక ప్రాతిపదికను తీసుకుని, ఎక్కువ భాషల్ని, ప్రాథమిక దశలోనే అందుబాటులో వుంచాలని నిర్ణయించారు. దేశంలో 15 శాతం మంది కూడా మాట్లాడని ఇంగ్లీషు భాషకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు కించెత్తు బాధను కూడా వ్యక్తం చేశారు. అయితే త్రిభాషా సూత్రం ప్రాకారం ఎంచుకునే భాషల్లో ఎక్కువ (54) శాతం మాట్లాడే హిందీని ఎంపికకు సిధ్ధంగా వుంచారు. కాకుంటే ఈ పాలసీ తొలిప్రతిలో చెప్పినట్టుగా మాత్రం హిందీని తప్పనిసరి చెయ్యలేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో వుంచుకొని ‘తప్పనిసరి’ చెయ్యటానికి ఉపసంహరించుకున్నారు. కానీ పరోక్షంగా వారి కోరిక నెరవేరుతుంది. హిందీ రాష్ట్రాలలో ఎలాగూ హిందీ మాధ్యమాన్నీ, హిందీ భాషనూ అభ్యాసం చెయ్యటానికి ఎంచుకోవాల్సి వుంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఏం చేస్తారు? తెలుగు, ఇంగ్లీషు కాకుండా మూడోది విధిగా హిందీ యే అవుతుంది. (పనిగట్టుకుని తమిళం, కన్నడం అధ్యయనం చెయ్యాలని అనుకోరు కదా!)
డ్రాప్ అవుట్ కు బదులు ‘మిడిల్ డ్రాప్‘!
ఇక 1968 తర్వాత స్కూలు- హైస్కూలు- ఇంటర్మీడియట్ విద్య (10.2) పధ్ధతిని పూర్తిగా మార్చి వేశారు. దీని స్థానంలోకి నాలుగంచెల (5.3.3.4) పధ్ధతి వచ్చింది. కాకుంటే, ఇప్పుడు ప్రయివేటు కార్పోరేటు స్కూళ్ళకు ఏ వయసప్పుడు పంపింస్తున్నారో, ప్రభుత్వ బడుల్లోనూ ఆదే వయసులో-అనగా మూడేళ్ళు పూర్తి కాగానే- పంపించవచ్చు. కొత్త పద్ధతిలో ప్రీప్రైమరీ (5) , ప్రైమరీ(3), అప్పర్ ప్రైమరీ(3), సెకండరీ (4) ఏళ్ళు చదివితే.. తర్వాత ఏకంగా అండర్ గ్రాడ్యుయేషన్ (డీగ్రీ) కోసం కళశాల కు వెళ్ళవచ్చు. ఇది నాలుగేళ్ళు వుంటుంది. ప్రీప్రైమరీ అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటి, రెండు తరగతులతో ప్రీప్రమైరీ ముగుస్తుంది. మూడు, నాలుగు, అయిదు తరగతులతో ప్రైమరీ అవుతుంది.ఆరు, ఏడు, ఎనిమది తరగతులతో అప్పర్ ప్రైమరీ విద్య పూర్తి అవుతుంది. తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు తరగతులతో సెకండరీ విద్య ముగుస్తుంది. అంటే ఇప్పటి స్కూలు, హైస్కూలు. జూనియర్ కళాశాల లో చదివే మొత్తం చదువును ఇలా గ్రూపు చేశారు.
ఇక కళావాల విద్య అంటే డీగ్రీయే. ఇది నాలుగేళ్ళు వుంటుంది. ఇక్కడ ఒక సౌకర్యం పెట్టారు. విద్యార్థి ఏ సంవత్సరం తర్వాతయినా మానివేసి, ఏదయినా ఉద్యోగం చూసుకోవచ్చు. మొదటి సంవత్సరం చదివే మానివేస్తే సర్టిఫికెట్, రెండవ సంవత్సరం వరకూ వస్తే డిప్లమా తీసుకుని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎప్పుడయినా కొనసాగించవచ్చు.
యూనివర్శిటీల ‘అనుబంధాల‘కు స్వస్తి?
చిత్రం. కళాశాలలు వీలయినంతవరకూ స్వయంప్రతిపత్తి కలిగివుంటాయి. ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా వుండవు. అలా అనుబంధం ప్రకటించే అధికారాలు ఇక మీదట విశ్వ విద్యాలయాలకు వుండవు. అంతే కాదు .ఎం.ఫిల్ ను ఇచ్చే పని కూడా ఇక యూనివర్శిటీలకు వుండదు. ఆ పట్టాలే రద్దవుతున్నాయి. ఇప్పటికే ప్రయివేటు విశ్వవిద్యాలయాలు వచ్చాయి. వాటి స్థాయికి, ప్రయివేటు ఇక మీదట చేరతాయి.
కార్పోరేటుకు నిన్న కాళ్ళు, నేడు రెక్కలు
అంటే కార్పోరేటు విద్య మూడింతలు, నాలుగింతలు అయ్యే అవకాశం వుంది. ఈ విద్యావిధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు మాత్రం, ఉన్నత చదువులకు నోచుకునే అవకాశం తక్కువగా వుంటుంది. ఈ సంస్థల్లో అధిక శాతం చదివే వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. వారు ఇంగ్లీషు నేర్చుకోలేక, మాతృభాషలోనే చదువుకుంటూ స్కూలు చదివిన తర్వాత దిక్కుతోచని వారయిపోతారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని యధాతథంగా అంగీకరిస్తే జరిగే ప్రమాదం ఇదే.
సతీష్ చందర్ (సతీష్ చందర్ ఇతర రచనలకు www.satishchandar.com ను విజిట్ చెయ్యండి)
Good analysis sir