Newsips

‘మృగాళ్ళు’న్నారు జాగ్రత్త!

“ఒక సిరా చుక్క… లక్ష మెదళ్లకు కదలిక” అని అన్నారు కాళోజీ. ఇక్కడ ఎన్ని లక్షల సిరా చుక్కలు అక్షరాలుగా మలిచినప్పటికీ, ఒక అంగుళం అలోచన లేని మానవ మృగాలున్నాయి. .. ప్రతిసారీ వేటాడటమే అనిపిస్తుంది. కానీ, ఇప్పటి వరకు సాగిన వేటలో ఏలాంటి మార్పులేదు. రావల్సినదంతా అలోచించే మెదడుతోటే కదా..! ఆ మెదళ్ళలో కదలిక తీసుకురావాలంటే, ఏం చేయాలి..?

జాగ్ర‌త్త‌…. కుక్క‌లున్నాయి జాగ్ర‌త్త‌… అని బోర్డులు చూస్తుంటాం. ప్ర‌తి ఇంటి గేటు ముందు. ఎందుకంటే, భ‌యం. తెలియ‌ని వ్య‌క్తులు వ‌స్తారేమోన‌ని. అది దొంగ‌త‌నానికో లేక మ‌రొకటో…

ఒక కిలోమీట‌ర్ త‌ర్వాత వ‌చ్చేది టైగ‌ర్ జోన్ అంటూ హైవేల‌పై బోర్డులు ప్రత్యక్షమవుతాయి. అట‌వీ ప్రాంతం రాగానే, వ‌చ్చేముందు ల‌య‌న్ బాటిల్ జోన్ లంటూ ముంద‌స్తు జాగ్ర‌త్తలు సూచిస్తారు. కాకులు దూర‌ని కార‌డ‌విలో… చిల‌క‌లు దూర‌ని చిట్ట‌డ‌విలో వున్న‌టువంటి వన్య‌ప్రాణుల‌తో జాగ్ర‌త్తలు సూచిస్తున్నాయి ప్ర‌భుత్వాలు. కానీ, ఎన్ని ఘోరాలు జ‌రుగుతున్న అవే దారుణాలు… ఎంత అవ‌మానానికి గురిచేస్తున్న ఆత్మ‌గౌర‌వంతో నిల‌బ‌డుతున్న నా దేశ ఆడ బిడ్డ‌ల‌కు సూచించావా…? ఈ ప్ర‌భుత్వాలు. న‌గ‌రాణ్యాల‌లో వున్నాయి మాన‌వ మృగాలు జాగ్ర‌త్త అని సూచించావా..? ఎన్నిఅఘాయిత్యాల‌ను చూడాలి ఇంకా… ఎంత కాలం వేచి చూడాలి..? న్యాయం కోసం.

ప‌ట్టుమ‌ని ప‌దిహేను రోజులు కూడా కాలేదు క‌దా..! దేశానికి స్వాతంత్యం వ‌చ్చిన రోజును చూసి సంబ‌ర‌ప‌డి., అంత‌లోనే దేశానికే స్వాతంత్యం కానీ, దేహనికి కాదు అని నిరూపించారు. యావ‌ద్భార‌తం త‌ల‌దించుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళు ఈ అధిపత్యం? అవ‌మానాలను భ‌రిస్తూనే ఉండాలా..? ఈ పురుషాధిక్య‌ స‌మాజంలో జీవించాలంటే, బానిస‌గా బతకలా..? వ‌్యక్తి స్వేఛ్ఛను క‌దా మ‌న‌ం కోరుకున్నది? ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి కాబట్టే, పోరాటాలు వచ్చాయి. వస్తూనే వున్నాయి. పోరాటాలు ఎక్కడి నుంచో రావు. మనం అనుకున్నది మన నుంచి దూరం చేస్తున్నప్పుడే ఆ అసహనం పోరాట రూపం దాల్చుతుంది. ‘‘నా దేహం నాది కాదన్నారు… స్త్రీ వాదినయ్యాను.’’ అంటూ స్త్రీ వాదాన్ని తమ రచనల ద్వారా పోరాట రూపాన్ని చూపించారు ప్రముఖ కవి, రచయిత సతీష్ చందర్ . ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. అయినప్పటికీ, స్త్రీని వ్యక్తిగా కాకుండా, వస్తువుగా చూడటమంటే, మస్తిష్కం లేని సమాజాన్ని మళ్ళీ చూడమనటమే కదా..!?

తెలుగు రాష్ట్రాల‌లో ముఖ్యంగా తెలంగాణ‌లో ఎటూ వైపు తీసుకుపోతున్నారు స‌మాజాన్ని? ఆడ‌పిల్ల‌ల‌ని క‌న్నెత్తి చూస్తే, క‌ళ్లు పీకేస్తామ‌న్నా నాయ‌కులు ఈ రోజు ఎటూ పోయారు..?  ఒక వైపు ప‌రువు హ‌త్యలు, మ‌రో వైపు అత్యాచార ప‌ర్వాలు కొన‌సాగుతూనే వున్నాయి. ఎక్క‌డ ఏ మార్పూ క‌నిపించ‌డం లేదు. సకల సమస్యలనూ ఎన్నిక‌ల వ్యూహలుగానే చూస్తున్నారేమోన‌నే అనుమానాలు కూడా వ్య‌క్త‌మవుతున్నాయి.

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా వున్న కేటీ రామారావు దిశ అత్యాచార ఘ‌ట‌న‌లో నిందుతుల‌కు శిక్ష ప‌డేందుకు తానే స్వ‌యంగా టేక‌ప్ చేస్తాన‌ని మాటిచ్చారు. అదే స‌మ‌యంలో వ‌రంగ‌ల్ లో మానస, అదిలాబాద్ లో స‌మ‌త వీరి గురించి ప‌ట్టించుకున్న పరిస్థితులు లేవు. ఇక్కడ కులాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నారేమోననే అనుమానులను కూడా వ్యక్త పరిచిన సందర్భాలు తెలంగాణలో చాలా ప్రస్ఫుటంగా కనిపించాయి. బాధిత మహిళలు ఏవరైనా మహిళాలే. కానీ, నిందుతులను కూడా విభజించి చూస్తున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు కొంతమంది మేదావులు. అందుకు ఉదాహరణగా, హజీపూర్ ఘ‌ట‌న‌లో మైన‌ర్ బాలిక‌లను అత్యాచారం చేసి, వ‌రుస హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన శ్రీనివాస్ రెడ్డికి సరైన సమయంలో సరైన శిక్ష విధించ‌లేకపోవడమే అందుకు కారణంగా చూశారు.

ఇన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా… ఏ మాత్రం చ‌ల‌నం లేకుండా వున్న ప్ర‌భుత్వాలు, వాటిని కాపాడేందుకు సృష్టించుకున్న‌టువంటి వ్య‌వ‌స్థలు ఎందుకూ ప‌నికి రానివిగా క‌నిపిస్తున్నాయి స‌గ‌టు పౌరుడికి.

బల‌వంతుడు బ‌ల‌హీనుడిని భ‌య‌పెట్టి బ‌త‌క‌డం అన‌వాయితీ అంటూ ఒక రచయిత డైలాగ్ చెప్పారు.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది అదే కదా… కొన్ని వంద‌ల, వేల సంవ‌త్సరాలుగా కొన‌సాగుతుంది. అదే క‌దా… వ్య‌క్తులుగా జీవించాల్సిన మ‌నుషులు, కులం లోప‌ల, కులంతో జీవిస్తున్నారు. నిచ్చెన మెట్ల కుల‌వ్య‌వ‌స్థ‌ను సృష్టించుకుని బ‌తుకీడుస్తున్నారు. అక్క‌డ ఒక‌రి కింద ఒకరు ఉండేలా చూశారు. బ‌లవంతుడిని కొట్టాలంటే, ప‌క్క‌నున్న బ‌ల‌హీనుడిని కొట్టాల‌నేది ఆట‌లలో క‌నిపిస్తుంటుంది. కానీ, ఇక్క‌డ కుల వ్య‌వ‌స్థ‌లో కింద‌నున్న కులాలపై అధిప‌త్యం చేలాయించాలంటే, పక్క‌నున్న స్త్రీపై అధిప‌త్యం చూపిన చ‌రిత్ర ఇప్ప‌టికీ పున‌రావృతం అవుతూనే వుంది. ఇలాగే కొన‌సాగితే, మాన‌వ మ‌నుగ‌డే ఆసాధ్యమ‌ని ఎప్పుడు గ్ర‌హిస్తుందో ఈ సమాజం?

రోజురోజుకూ పెరుగుతున్న అఘాయిత్యాల‌ను నిర్మూలించాలని, మ‌రోసారి జరగకూడదని బాధిత మ‌హిళ‌లు త‌మ అవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. చేస్తునేవున్నారు. అయినప్ప‌టికీ, మ‌హిళ‌ల‌పై దాడులు కొన‌సాగుతూనే వున్నాయి. మ‌హిళ‌ల‌ను ఎదుర్కోవాలంటే, కేవ‌లం భౌతికంగా దాడులే అనేటువంటి త‌ల‌లో మెదడులేని స‌న్నాసుల‌కు ఎలా తెలియాలి. ఎవ‌రు తెలియ‌ప‌ర‌చాలి. అయినా మూర్ఖ‌త్వం కాక‌పోతే, చ‌దువులేని అజ్ఞానులే కాదు. చ‌దువుండి, స‌మాజంలో గొప్ప స్థానంలో ఉన్న‌వారు కూడా ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డ‌టం చాలా దారుణం.


ఈ మ‌ధ్య కాలంలో ఒకే అమ్మాయిపై ప‌ద‌కొండు సంవ‌త్సరాలుగా 139 మంది అత్యాచారానికి పాల్ప‌డ్డ‌ర‌ని బాధిత మ‌హిళ వెలువ‌రించారు. అంటే ఆమె శరీరం మీద ఆమెకు ఇసుమంత హక్కూ లేదా? ఘ‌ట‌న‌లో వారు, వీరు అనే తేడా లేకుండా ప్ర‌తి రంగంలో వున్న ప్ర‌ముఖుల పాత్ర వున్నట్లు అరోప‌ణ‌లు ఉన్నాయి. ‌విచారణ జరపాలి. జరుగుతుంది. ఎప్పడో జరిగిన ఘటనలకు ఇప్పుడు ఫిర్యాదులా? అనే ప్రశ్నల్ని కూడా కొందరు లేవనెత్తుతున్నారు. ’మిటూ’ ఉద్యమం అందుకే వచ్చింది. ఆమె గిరిజన మహిళ. సమాజం లో అట్టడుగున వున్న స్త్రీలను అతి సులభంగా భోగవస్తువులా ఎలా మార్చుకోగలుగుతున్నారో, అన్నదానికి బదులు ఈ విచారణలో లభిస్తుందా.?

ఎల్. అమరనాథ్,

ఎ.పి. కాలేజ్ ఆఫ్ జర్నలిజం
       

One thought on “‘మృగాళ్ళు’న్నారు జాగ్రత్త!

  • Amalapurapu Durga Prasad

    Content is 👌👌👌

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *