FeaturedPolitics

ముఖమే సోనియా! మెదడు ప్రణబ్ దా!

తొలుత చాలామంది నేతల్లాగా తాను కూడా ‘టూ-ఇన్‌-వన్‌’ అని ప్రణబ్‌దా భావించారు. మొదట(1969లోనే) ఒక పార్టీ స్థాపనలో పాల్గొన్నారు. అదే ‘బంగ్లా కాంగ్రెస్‌’. ఎన్నికల బరిలోకి దిగారు. వ్యూహ చతురతను ప్రదర్శించారు కానీ, జనసమ్మోహక శక్తిని కాలేక పోయారు. ఇందిరాగాంధీ ఈ రహస్యాన్ని ఇట్టే పట్టేశారు.

రథి సరే, సారథి ఎవరు? ప్రశ్నే. గుట్టును లాగే ప్రశ్న. రాజకీయపు లోగుట్టు కావాలంటే ఈ ప్రశ్న వెయ్యాల్సిందే. విల్లు పట్టిన వాడు అర్జునుడే కావచ్చు; నడిపిన వాడు కృష్ణుడయితేనే కదా యుధ్ధం రక్తి కట్టేది! పురాణమే. భారతమే. కానీ రాజకీయం.
రణక్షేత్రంలోకి వెళ్ళేనేతలు ఎప్పుడూ ఇద్దరే. ఒకరు కర్త; మరొకరు వ్యూహకర్త. కర్త కనిపిస్తారు; మురిపిస్తారు; మయమరపిస్తారు. వెరసి, జనసమ్మోహక శక్తిగా వెలిగిపోతారు. వ్యూహకర్త కనపించరు; నినదించరు; అస్త్రాలు సంధించరు. ‘అటు కాదు, ఇటు నడు’ అని దిశానిర్దేశం మాత్రం చేస్తారు. అలాగని వారిని సినిమాల్లోలాగా ‘హీరో- సైడికిక్‌’ లని చిన్నబుచ్చలేం. ‘పైలట్‌- కోపైలట్‌’ అని సాదాసీదా ‘గాలి’ మాటలతో సాధారణీకరించ లేం.

నాటి పురాణ రాజకీయం ఎందుకుగానీ, ఇప్పటి రాజకీయ పురాణమే తీసుకుందాం. ‘కాషాయ’ రథం మీద కూడా ఇద్దరుంటారు. నరేంద్ర మోడీ రథి¸; అమిత్‌ షా సారథి¸. ధనువు మాత్రమే మోడీ చేతిలో వుంటుంది. పగ్గాలు షా అదుపులోనే వుంటాయి. ఇప్పటి సాంకేతిక సామాగ్రిలోకి అనువదించుకుంటే, ‘మైకు’ పట్టేది మోడీ, ‘బైకు’ నడిపేది షా.
రదీ,¸ సారదీ¸ ఒకరే అయితే..? ‘టూ ఇన్‌ వన్‌’. ఆ నేతకు తిరుగు వుండదు. ఇందిరా గాంధీ ఆ కోవకే వస్తారు. ఆమే కర్త; ఆమే వ్యూహకర్త. ఇలాంటి వారిని నిలువరించటం కష్టం. దూసుకుపోతుంటారు. చెయ్యాలనుకున్నది చేసుకు పోతుంటారు. దాని వల్ల జనానికి మంచి జరగవచ్చు; చెడు జరగవచ్చు. అది వేరే విషయం. ఈ తరహా నేతలు జాతీయ స్థాయిలోనూ వుంటారు; ప్రాంతీయ స్థాయిలో నూ వుంటారు.వారు జ్యోతిబసు, శరద్‌ పవార్‌, కరుణానిధిలూ కావచ్చు; జయలలిత, మమతా బెనర్జీలు కావచ్చు. ఈ తరహా ద్విపాత్రాభినయం చెయ్యగలిగిన వారు, రాజకీయ రణరంగంలో నిలిచి వెలుగుతారు.

కానీ కేవలం వ్యూహకర్తగా మాత్రమే వుంటూ, సుదీర్ఘకాల రాజకీయ ప్రస్థానం చెయ్యగలిగిన వారు బాగా అరుదు. మరీ ముఖ్యంగా భారత రాజకీయాల్లో. అలాంటి అత్యంత అరుదయిన నేత ప్రణబ్‌ ముఖర్జీ. ‘ఛాయ్‌ వాలా నుంచి ప్రధాని వరకూ’ అని చెప్పటమే విజయగాధ అయితే, ప్రణబ్‌దా జీవిత గాథ కూడా అలాంటి మకుటం వంది: ‘గుమస్తా నుంచి రాష్ట్రపతి వరకూ’. ఇలా చెబితే, విద్యార్థుల్ని తాత్కాలికోద్రేకానికి గురిచేసే ‘వ్యక్తిత్వవికాస ఉపన్యాసం’ లాగా వుంటుంది.
ప్రణబ్‌దా రాజకీయ ప్రస్థానం అంతకు మించినది. ద్వితీయుడిగా వుంటూనే, ప్రథముడికి సైతం దక్కని అవకాశాలను పొందారు. కానీ ఎప్పటికీ ప్రథముడు కాలేక పోయాడు. (కాక పోతే రాజ్యాంగ భాషలో ‘ప్రథమ’ పౌరడయ్యారు.) అధికారంలో అత్యున్నత సింహాసనం, ప్రధాని పీఠమే కదా! అది మాత్రం ఎప్పటికప్పుడు, అందినట్టే అంది జారిపోతూ వుండేది.

తొలుత చాలామంది నేతల్లాగా తాను కూడా ‘టూ-ఇన్‌-వన్‌’ అని ప్రణబ్‌దా భావించారు. మొదట(1969లోనే) ఒక పార్టీ స్థాపనలో పాల్గొన్నారు. అదే ‘బంగ్లా కాంగ్రెస్‌’. ఎన్నికల బరిలోకి దిగారు. వ్యూహ చతురతను ప్రదర్శించారు కానీ, జనసమ్మోహక శక్తిని కాలేక పోయారు. ఇందిరాగాంధీ ఈ రహస్యాన్ని ఇట్టే పట్టేశారు. ప్రణబ్‌లోని బలాన్నీ, బలహీనతనీ చిటికెలో అంచనా వేశారు. వెలుపలి నుంచి ఊతమిచ్చి, ‘బంగ్లా కాంగ్రెస్‌’ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాలా చూశారు. కృతజ్ఞతగా ‘బంగ్లా కాంగ్రెస్‌’ ను కాంగ్రెస్‌ పార్టీలో కలిపేశారు. అలా రాజకీయానికి ప్రత్యక్ష మార్గం కాకుండా, పరోక్ష మార్గం చూపారు. మళ్ళీ ఆ మార్గాన్ని వదలితే వొట్టు. మరో నాలుగు సార్లు రాజ్యసభకే ఎన్నికవుతూ వచ్చారు. (చివర్లో లోక్‌ సభకు కూడా ఎన్నికయ్యారను కోండి.) ఇందిరా గాంధీ కి విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. అది ‘తందానా’ అనే విధేయత కాదు. ‘తప్పు’ ను తప్పులా, ‘ఒప్పు’లా చెబుతూ హెచ్చరించే విధేయత. సలహా ఇచ్చేటంత వరకే ఆయన పరిధి. ఆ తర్వాత ఆమె ఇష్టం. కానీ ఆమె తుది నిర్ణయాన్ని గౌరవించేవారు. అందుకని ‘ఎమర్జన్సీ’ విధించినప్పుడు కూడా- పలువురు నేతలు ఈ చర్యను నిరసించారు; ఫలాయనం చిత్తగించారు- కానీ నష్టమని తెలిసి కూడా ప్రణబ్‌ ఆమె వెంటే వున్నారు. అందుకు ఆమెతో పాటు, ప్రణబ్‌ దా తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన జనతా సర్కారు షా కమిషన్‌ వేసింది. ఇందిర తో ప్రణబ్‌ దాను కూడా కమిషన్‌ రచ్చకీడ్చింది.

ఇందిర తిరిగి ప్రధాని అయ్యాక మళ్ళీ ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో కాంగ్రెస్‌ లో ఇందిర తర్వాతే కాదు, ఇందిర అనంతరం ఎవరూ అంటే -ప్రణబ్‌ ఆమె అనుచరగణం చెబుతుండేది. ప్రణబ్‌దా నమ్ముతుండే వాడు. ప్రణబ్‌ ‘టూ-ఇన్‌- వన్‌’ కారని, ఇందిర గ్రహించారు కానీ, ప్రణబ్‌ కు అర్థమయ్యేట్టు చెప్పినట్లు లేరు.
అందుకే ఆమె 1984 హత్యకు గురయ్యాక, తననే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానిని చేస్తుందని నమ్మేశారు. కానీ, ఆ స్థానంలోకి (సంజయ్‌ గాంధీ అప్పటికే మరణించిన కారణంగా) రాజీవ్‌ గాంధీ వచ్చేశారు. నిజం చెప్పాలంటే, రాజీవ్‌ గాంధీ కూడా ‘టూ-ఇన్‌-వన్‌’ కారు. ఆయన జనసమ్మోహక శక్తి, కానీ మంచి వ్యూహకర్త కారు.(అంటే ప్రణబ్‌ కు లేనిదీ, ఆయనకు ఉన్నదీ ఆ ఒక్కటే.) ప్రణబ్‌ ను తోడు పెట్టుకుంటే రాణించేవారు. కానీ ‘ప్రధాని పదవిపై కన్నేశాడన్న’ కోపంతో దూరం పెట్టేశారు. ప్రణబ్‌ తనకు ‘రెండూ వున్నాయనుకుని’ మళ్లీ ‘రాష్ట్రీయ సమాజ్‌ వాదీ కాంగ్రెస్‌’ అని 1986 లో ఒక పార్టీ పెట్టేశారు. ఎన్నికల్లోకి దిగారు. ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ మరణానంతరం కాంగ్రెస్‌ విజయంతో, కొన్ని నాటకీయ పరిణామాల, మధ్య పి.వి. నరసింహారావు ప్రధాని అయ్యారు. పీవీకీ కూడా అంతే. ప్రధాని పదవికి పోటీ పడ్డ జనాకర్షక నేతలు, శరద్‌ పవార్‌, అర్జున్‌ సింగ్‌ వంటి వారిని దూరం పెట్టి, అది లేకుండా వ్యూహరచన మాత్రమే తెలిసిన ప్రణబ్‌ ను దగ్గరకు తీసుకుని, ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుణ్ణి చేశారు. అప్పుడే రాష్ట్రాలకు‘ ప్రత్యేక హోదా’ ఇచ్చే విధివిధానాలకు సవరణలు చేశారు.
పీవీ తర్వాత, సీతారావ్‌ు కేసరీ కాంగ్రెస్‌ పగ్గాలు పుచ్చుకున్నారు. పార్టీమరింత పతనస్థాయికి వెళ్ళిపోయింది. తిరిగి సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ పైకి ఎదిగి, వరుసగా రెండు సార్లు ‘యూపీయే పేరు మీద రాగలిగిందంటే, అదంతా ప్రణబ్‌ వ్యూహరచనే. ఇందిర కు ఎంత విధేయత చూపారో, సోనియాకూ అంతే విధేయతా చూపారు. ఫలితం? ప్రధానిగా మన్‌మోహన్‌ అయ్యారు కానీ, ఆయన కాలేక పోయారు. తర్వాతయినా ప్రదాని అభ్యర్థిని చెయ్యాల్సి వస్తుందేమోనని, సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రణబ్‌ ను రాష్ట్రపతిని చేసింది. కారణం రాహుల్‌ గాంధీ. అప్పటికే తనగురించి ప్రణబ్‌ దాకు తెలిసిపోయింది.
మూడు భాగాలు గా వచ్చిన తనజ్ఞాపకాల మాలిక ‘డ్రమెటిక్‌ డికేడ్స్‌’ లో ప్రణబ్‌దా చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. దాచాల్సినవీ దాచేశారు. పేచీలేదు. ప్రణబ్‌ స్థానం ప్రణబ్‌ కు శాశ్వతంగా మిగిలిపోతుంది. ఆయన మరణించినా, నేతలు నిత్యమూ నేర్వ దగ్గ పాఠం లా ఆయన రాజకీయ జీవితం మిగిలిపోతుంది.


సతీష్ చందర్ (సతీష్ చందర్ ఇతర రచనలు www.satishchandar.com లో చదవవచ్చు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *