FeaturedOpinion

‘బిల్లులు’ రైతుకు, పంటలు వ్యాపారికి..!

కన్నబిడ్డకు పెళ్ళి చేసే తాహతే లేదు మొర్రో, అన్న తండ్రికి ఎలా సాయపడాలి? వీలుంటే కొంత డబ్బివ్వాలి. లేదా డబ్బిచ్చేవాణ్ణి చూసి పెట్టాలి. అంతే కానీ ‘నీ బిడ్డను ఎవరికయనా ఇవ్వవచ్చు. ఓ యువ పారిశ్రామిక వేత్తకయినా ఇవ్వవచ్చు. ఏ రాష్ట్రం వాడికయినా కట్టబెట్టవచ్చు.’ అంటూ ఉచిత సలహా ఇస్తే ఎలా వుంటుందీ?
పంట కొనేవాడే లేడని తిరుగుతున్న రైతును ఎలా ఆదుకోవాలి? వీలుంటే కొని పెట్టాలి. లేదా కొనేవాడిని వెతికి పట్టాలి. ఈ రెండూ చెయ్యకుండా, ‘నువ్వు ఎక్కడయినా అమ్ముకోవచ్చు, ఎవరికయినా అమ్ముకోవచ్చు, ఎంత కయినా అమ్ముకోవచ్చు’ అని గీతోపదేశం చేస్తే ఎలా వుంటుంది.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అదే చేసింది. ముచ్చటగా మూడు బిల్లుల్లో ఈ ఉపదేశాన్ని ప్రకటించింది. ఈ ఉపదేశానికి రైతులు హడలి పోయారు; ప్రతిపక్ష నేతలు బిత్తర పోయారు; సొంతగూటి నేతలు ఠారెత్తి పోయారు. అందుకు నిదర్శనమే ఎన్డీయే భాగస్వామ్య పక్షం, శిరోమణి అకాలీ దళ్‌ (ఎస్‌.ఎ.డి) కు చెందిన హరిసిమ్రాట్‌ కౌర్‌ బాదల్‌ కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు. ఆ పార్ఠీ అధినేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ఆదేశానుసారం ఆమె రాజీనామా చేసేశారు.
అయితే ఇందువల్ల ఎన్డీయే సర్కారు అంగుళం కూడా కదలక పోవచ్చు. ఎందుకంటే ఎస్‌.డి.ఎ నుంచి ఎన్నికయిన లోక్‌ సభ సభ్యులు ఇద్దరే ఇద్దరు. కాబట్టి ప్రధాన పక్షం అయిన బీజేపీకి కేంద్రంలో వచ్చిన నష్టమేమీ లేదు. ఎటొచ్చీ పంజాబ్‌ రాష్ట్రంలోనే. ఎన్నికలు 2022 లో జరగనున్నాయి. పట్టుమని రెండేళ్ళు కూడా లేవు. పైపెచ్చు, గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మైత్రి ఎస్‌.డి.ఎ కి పెద్దగా కలసి రాలేదు. కాంగ్రెస్‌ గెలిచేసింది. అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా పీఠం వేసుకుని కూర్చున్నారు.
పంజాబ్‌ అంటేనే వ్యవసాయం. అక్కడ రైతులు అభద్రతకు గురయితే, రాజకీయ కల్లోలమే. ఈ ‘మూడు బిల్లుల’ బాధ్యత ను మీద వేసుకుంటే, మొదటికే మోసం వస్తుందని భావించిన ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, ఈ ఒక్క విషయంలోనైనా బీజేపీతో తీవ్రంగా విభేదిస్తున్నట్టు కనిపించాలి.


ఇంతకీ ఈ మూడు బిల్లులూ ఏమిటి?
ఒకటి: రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యాల (ప్రోత్సాహ, సదుపాయాల) బిల్లు 2020
రెండు: ఒప్పంద ధర హామీ, వ్యవసాయ క్షేత్ర సేవల బిల్లు 2020
మూడు: నిత్యావసర వస్తువుల ( సవరణ) చట్టం 2020


ఈ మూడింటినీ, 24 సెప్టెంబరు 2020న ఎన్డీయే సర్కారు లోక్‌ సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులు కొత్తవేం కాదు. మూడు నెలల క్రితమే కోవిద్‌-19 కారణంగా ( నెపంగా) వీటిని ఆర్దినెన్సుల రూపంలో తెచ్చేశారు. అప్పుడే దేశవ్యాపితంగా రైతుల నిరసనలు చేశారు. ఇందులో పంజాబ్‌ అగ్రభాగాన వుంది. అయితే ఇది రైతుల క్షేమం కోరే చేసామని కేంద్రం వాదిస్తూనే వుంది. ఇంకా గట్టిగా నిలదీస్తే, ఇది ‘ఆహార భద్రత’ నిస్తుందీ అన్నది.
ఇక్కడే చిక్కొచ్చి పడింది. పూర్తి ‘ఆహార భద్రత’కే ఈ బిల్లులు- అంటే స్పందనలు భిన్నంగా వుండేవి. కానీ ‘రైతు భద్రత’ కోసం కూడా అని అనటంతో రైతు సంఘాల వారికి మరింత కోపం వచ్చింది.
అసలు మొదటి బిల్లుతోనే పేచీ రాష్ట్రాలు దాటింది. ఎందుకంటే, వ్యవసాయం, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ అనే అంశాలు కేంద్ర జాబితాలోకి రావన్నది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరం. వాటి మీద చట్టాలను రాష్ట్రాలు చేసుకోవాలి కదా! కేంద్రం ఎలా చొరబడింది? కేంద్రం దగ్గర కూడా ఈ ప్రశ్నలకు సమాధానం లేక పోలేదు. ఆహార వర్తక, వాణిజ్యాలు కేంద్ర జాబితాలోనివే కాబట్టి చేశామంటోంది. అంటే ‘ఆహార భద్రతే’ కానీ ‘రైతు భద్రత’ ఈ బిల్లు ప్రధానోద్దేశ్యం కాదని, కేంద్రం పరోక్షంగా ఒప్పుకున్నట్టే. ఈ బిల్లులో రైతును ఇరుకున పెట్టే మూడు అంశాలున్నాయి. ఒకటి: రైతు తన ఉత్పత్తులను వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ( ఎపిఎంసి) ద్వారానే అమ్ముకోనవసరం లేదు. ఎక్కడయినా, ఎవరికయినా అమ్ముకోవచ్చు. రెండు: వ్యవసాయోత్పత్తులు పండించిన రాష్ట్రాల్లోనే అమ్మనవసరం లేదు. ఏ రాష్ట్రంలోనైనా యధేఛ్చగా విక్రయించుకోవచ్చు. మూడు: ఎలక్ట్రానిక్‌ వర్తకం ( ఈ- ట్రేడింగ్‌) ద్వారా కూడా వ్యవసాయోత్పత్తులను విక్రయించ వచ్చు. చూస్తే ఈ మూడూ సౌకర్యాల్లా వున్నాయి. కానీ కావు. ఎపిఎంసిలు పంట కొనుగోలు దార్లనూ, కమీషన్‌ ఏజెంట్లనూ, ప్రయివేటు వర్తకులను లైసెన్సింగ్‌ ద్వారా నియంత్రించి, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను ఇచ్చేటట్లు చేస్తాయి. ఇప్పుడు ఈ బిల్లు ఈ రక్షణ కవచాన్ని తొలగించింది. అంటే కొనేవాడి చేతికి నేరుగా రైతు జుత్తును ఇచ్చేసినట్లే.

ఇలా పంట వెయ్యగానే, అలా కొనుగోలు దారును చూసుకుని ‘క్రయ ఒప్పందాన్ని’ రాసుకోవచ్చు


రెండవ బిల్లు ‘కాంట్రాక్టు వ్యవసాయాన్ని’ ముందుకు తెచ్చింది. ఇలా పంట వెయ్యగానే, అలా కొనుగోలు దారును చూసుకుని ‘క్రయ ఒప్పందాన్ని’ రాసుకోవచ్చు. ఈ ఒప్పందంలో ఉత్పత్తి పరిమాణం, ప్రమాణం, గ్రేడింగ్‌, ధర వుంటాయి. ముఖ్యంగా ధరను ముందుగానే నిర్ణయిస్తారు. నాట్లు వేసేనాటికి వున్న ధర, పంట చేతికి వచ్చేసరికి మార వచ్చు. అంటే తగ్గ వచ్చు, లేదా పెరగ వచ్చు. తగ్గ కుండా ‘కనీస మద్దతు ధర’ కాపాడుతుందని బిల్లు భరోసా. కానీ, పెరిగితేనో, అదనంగా పుచ్చుకోవచ్చు- అని బిల్లు చెబుతోంది. కొనే వాడు అంత ఉదారంగా ఎలా ఇస్తాడు? ఇవ్వడు. పోనీ ఇప్పించే యంత్రాంగం ఏదైనా వుందా- అంటే లేదు. పైపెచ్చు. రాసిచ్చిన గ్రేడింగ్‌ ల సరకును ఇవ్వలేక పోతే, నష్టపోయేది రైతే.
ఇక మూడవది నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ మాత్రమే. కానీ ఇది రైతు కొంప ముంచే నిర్ణయం. ఆహార ధాన్యాలూ, పప్పుదినుసులు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లి, ఆలుగడ్డలు వంటి వాటిధరల మీద, స్టాకు నిల్వల మీదా కంట్రోళ్ళు తొలగించేస్తున్నారు. అయితే యుధ్ధాలూ, కరవులూ వంటి విపత్కాలం వచ్చినప్పుడు కేంద్రం కంట్రోలు విధిస్తుంది. అధిక నిల్వలు పెట్టుకుని ధరలు రెట్టింపు చేసినప్పుడు ప్రభుత్వం ఈ కొరడా తీస్తుంది. అప్పుడు కూడా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎగుమతులు చేసుకొనే వారికి ఈ నిబంధన వర్తించదు.
ఇది కార్పోరేట్‌ శక్తుల నెత్తి మీద పాలు పోసినట్లే, పంటను తెగనమ్ముకనేటప్పుడు, రైతు దగ్గర కొని, కృత్రిమ కొరతను సృష్టించి, తర్వాత లాభాలు పొందవచ్చు. ఈ మూడు బిల్లుల పర్యావసనం ఒక్కటే: రైతు పెనం మీద నుంచి పొయ్యిలో పడతాడు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా బెంబేలెత్తి పోతున్నాయి.

సతీష్ చందర్, ( ఈ రచయిత ఇతర రచనల కోసం www.satishchandar.com విజిట్ చెయ్యండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *