CasteTelangana

ఇంతకీ, వారు కన్నది కూతుర్నా? కులాన్నా?

అవంతి- హేమంత్ ల పెళ్ళి ఫోటో


తెలుగు రాష్ట్రంలో మరో ‘పరువు హత్య’ జరిగిపోయింది. కథ మామూలే. కన్నతండ్రి మాట కాదని ‘కులాంతర’ వివాహం చేసుకుంది. అంతే. చేసుకున్న వాడు హత్యకు గురయ్యాడు. అచ్చం మిర్యాలగూడలో అమృతను చేసుకున్న తర్వాత ప్రణయ్‌ ను చంపేసినట్లే. కానీ చిన్న మార్పు.
ప్రతీ సారీ హత్యకు గురయిన భర్త (ప్రేమికుడు) అణగారిన కులాలకు చెందిన వాడవుతాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, షెడ్యూల్డు కులాలకు చెందిన వాడే అవుతాడు. అనివార్యంగా భార్య (ప్రేయసి) అతని కన్నా పై ‘వర్ణం’ గా భావించుకునే సామాజిక వర్గానికి చెందే వుంటుంది. అమృత-ప్రణయ్‌ ల విషయమే తీసుకోండి. అమృత ‘వైశ్య’ కులానికి చెందిన మారుతీ రావు తనయ. కానీ ప్రణయ్‌ మాత్రం దళితుడు. అంతకు ముందూ, ఆ తర్వాతా జరిగిన ‘పరువు హత్య’ల్లోనూ ఇదే సమీకరణ.

కారణం క్యాషా? కేస్టా?
కానీ ఈ కథనం వేరు. ఇక్కడ ప్రేమించి, పెళ్ళి చేసుకున్నందుకు హత్యకు గురయిన యువకుడు దళితుడు కాడు. అతని పేరు హేమంత్‌ . వైశ్య కులానికి చెందిన వాడు. ఇతనూ, రెడ్డి కులానికి చెందిన అవంతీ ప్రేమించుకున్నారు. కొన్ని రోజుల పాటు కాదు, కొన్ని నెలల పాటు కూడా కాదు. ఏకంగా ఎనిమిదేళ్ళ పాటు. ఇద్దరూ చదువుకున్న వాళ్ళే. హేమంత్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ గా పనిచేస్తున్నాడు. అవంతి బి.టెక్‌ చదువుకున్నది. పెళ్ళి వరకూ వచ్చేసరికి అవంతి తల్లి, దండ్రులు ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళిద్దరూ, చట్టబధ్ధంగా జూన్‌ 10 వ తేదీన వివాహం చేసుకుని, టిఎన్‌జివో కాలనీ(హైదరాబాద్‌)లో కాపురం పెట్టారు. ఆస్తికోసం హేమంత్‌ కన్నేసి ఇలా చేశాడనే అనే అనుమానానికి తావులేకుండా, తన తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అవసరంలేదని రాసిచ్చేసింది. అయినా తల్లి, దండ్రులకు (దొంతిరెడ్డి లక్ష్మీ రెడ్డి, దొంతి రెడ్డి అర్చనలకు) సమీప బంధువులకూ కోపం తగ్గలేదు. ఆస్తి పాస్తులు కాకుండా మరింకేదో పోతుంది. అదే ‘పరువు’. ఏం పరువు? ‘కుటుంబానికి’ వున్న పరువు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కులం ద్వారా సంక్రమించిన పరువు. అక్కడికీ పిలిచి ‘కౌన్సెలింగ్‌’ చేశామని పోలీసులు చెబుతున్నారు. ‘కౌన్సెలింగ్‌ చేస్తే’ దిగిపోవటానికి, ఇది ‘తలబరువు’ కాదు. కులం పరువు.
అందుకే జాగ్రత్తగా పథకం వేసి, మారిపోయినట్లు కొత్త దంపతుల్ని నమ్మించి, పథకం ప్రకారం నమ్మించి వారిని అవంతి తల్లి,దండ్రులూ, సమీప బంధువులూ కిడ్నాప్‌ చేయించారు. అ తర్వాత హేమంత్‌ శవమై ప్రత్యక్ష మయ్యాడు. పీకనులిమి చంపినట్లుగా తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. మూడు కారుల్లో వచ్చి, తమను కిడ్నాప్‌ చేస్తుండగా తాను, పెనుగులాడి బయిట పడ్డట్లు అవంతి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా, సకాలంలో స్పందించ లేదని ఆమె చెబుతోంది. ఈ హత్యకు కుట్రచేసిన వారినీ, పాల్గొన్నవారినీ వెరసి 11 మందిని పోలీసులు అరెస్టు చేసి వెంటనే కోర్టులో హాజరు పరిచేశారు. అందులో అవంతి తల్లి,దండ్రులిద్దరూ వున్నారు.
అయితే ఈ ‘పరువు హత్య’ ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘వైశ్య’ కులానికి చెందిన హేమంత్‌ ను ‘తక్కువ కులం’ వాడని అవంతి తండ్రి లక్ష్మీ రెడ్డి, తదితరులు ఎలా భావించారు. మరి 2018 లో జరిగిన ప్రణయ్‌ కేసులో ఇదే ‘వైశ్య కులానికి’ చెందిన మారుతీరావు తదితరులు తమది హెచ్చుకులమని భావించే ప్రణయ్‌ ను హత్య చేయించారు కదా! అంటే ‘దళితుడయి’ న అల్లుడు, ‘వైశ్యు’డయిన మారుతీ రావు ‘పరువు’ తీస్తే; ‘వైశ్యుడ’యిన అల్లుడు, లక్ష్మీ రెడ్డి ‘పరువు’ తీశాడని అనుకోవాలా?
అప్పుడయితే ‘అమృత’ ప్రేమ కథను అమృత నుంచి కాకుండా ‘అమృత’ తండ్రి నుంచి చూడటానికి తెలుగు మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు పోటీ పడ్డాయి. అల్లారు ముద్దుగా పెంచుక్ను ‘అమృత’ను అలా ‘ఒకతను’ (దళితుడు) ఎగరేసుకు పోతే, అతని మనసు ఎలా క్షోభించి వుంటుందీ- అని. అతని క్షోభ ముందు- కూతురు గర్భంతో వుంటే, ఆమె కళ్ళముందే అల్లుణ్ణి నరికి చంపించిన కిరాతకం అతి చిన్నదిగా వాటికి తోచింది.

‘వర్ణ’ క్రమం తప్పిందా..?
మళ్ళీ అవంతి ప్రేమకథను కూడా అలాగే చూస్తారా? కానీ హేమంత్‌ సమాజం దృష్టిలో ‘ఒకతను’ కాదు. ఒకే వేళ ‘వర్ణవ్యవస్థ’ను నమ్మాల్సి వచ్చినా కూడా, మనుస్మృతి ప్రకారం పైమూడు వర్ణాల్లో నిదే ‘వైశ్య ’ వర్ణం. ఆ తర్వాత వచ్చే ‘శూద్ర’ వర్ణం కిందే మిగిలిన అన్ని వర్ణాలు వస్తాయి. అప్పుడు అవంతి ‘వర్ణం’ కన్నా, ‘హేమంత్‌’ వర్ణమై పైన వుండాలి కదా!! (అప్పుడు ’ఒకతను‘ ఎలా అవుతాడు. ఇక ‘పరువు’ పోయే పరిస్థితి ఎలా వుంటుంది? మనుస్మృతిని తిరగరాసే క్రమంలో నే ‘భారత రాజ్యాంగం’ రూపుదిద్దుకున్నది. దానికి వ్యక్తీ, వ్యక్తి స్వేచ్చాÛ కేంద్రం. అంతే కానీ, కులమో, మతమో కాదు. ఆ రాజ్యాంగ స్పూÛర్తితోనే చట్టాలు చెయ్యాలి; తీర్పులు ఇవ్వాలి. కాబట్టి ‘కులాంతర వివాహాల’కు రక్షణ నివ్వటమే కాదు, వాటిని భగ్నం చెయ్యాలనుకన్న వాళ్ళను ‘కరడు కట్టిన నేరస్తులు’ గా పరిగణించాలి. కాబట్టే చట్టం తన పని తాను చేసుకు పోగలిగింది. కానీ, నిందితులు ఇలా జైలుకు వెళ్ళిన వాళ్ళు అలా సులభంగా రాగలరు. నేర నిరూపణ అయితే, చిన్నా, చితకా శిక్షలతో బయిట పడగలరు. ఇది అలుసుగా తీసుకుని, మరింతమంది మరిన్ని పరువు హత్యలకు పాల్పడగలరు.

పోతున్నది తెలుగు రాష్ట్రాల పరువు!
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ‘పరువు హత్య’ల సంఖ్య రెండు పదులు దాటిపోయింది. ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలోనే జరిగాయి‘ పరువు హత్యలు’ పునరావృతం కాకుండా వుండటానికి వున్న చట్టాలు సరిపోక పోవచ్చని ‘లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ 20 జనవరి 2012లోనే నివేదిక ఇచ్చింది. అంతకు ముందే అప్పటి కేంద్రం ఒక ప్రత్యేక బిల్లు (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ అసెంబ్లీ( ఇంటర్‌ఫియరెన్స్‌ విత్‌ ఫ్రీడవ్‌ు ఆఫ్‌ మాట్రిమోనియల్‌ అలయన్సెస్‌’ ను సిధ్ధం చేసింది కానీ, పార్లమెంటులో ప్రవేశ పెట్టలేక పోయింది. అయితే ‘పరువు హత్యలు’ అంటే ముందుగా గుర్తుకొచ్చే రాష్ట్రమయిన ‘రాజస్థాన్‌’లో గత ఏడాది (ఆగస్టు 2019లో) అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ‘రాజస్థాన్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఇంటర్‌ఫియరెన్స్‌ విత్‌ ది ఫ్రీడవ్‌ు ఆఫ్‌ మాట్రిమోనియల్‌ అలయెన్సెస్‌ చట్టం’ చేసింది. ‘పరువు హత్య’ నేర నిరూపణ అయితే, నేరస్తులకు మరణ దండన, లేదా యావజ్జీవ కారాగార శిక్ష వరకూ విధించే అవకాశం వుంది.

‘దిశ’ చట్టంలాగే, ‘పరువు హత్య’ల కో చట్టం!
అత్యాచారాల నిరోధకానికి ‘దిశ’ చట్టం చేసినట్లు, తెలుగు రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని వెంటనే తేవాల్సిన అవసరం వుంది. లేకుంటే, ఇలా ఎన్నో ప్రాణాలను బలి ఇవ్వాల్సి వుంటుంది.. అయితే కేవలం కరినమైన శిక్షలతోనే సరిపుచ్చ కూడదు. కులాంతర వివాహం చేసుకున్న వారికి, లేదా చేసుకోవాలని నిర్ణయించుకున్న వారికీ, ఇలా కోరగానే, అలా రక్షణను ఇచ్చే అంశాలను చేపట్టాలి. ముందుగా ‘పరువు హత్య’ను సాంఘిక దురాచారంగా ప్రభుత్వం గుర్తించి, అందుకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యయంతో మాధ్యమాల ద్వారా ప్రచారం కలిగించాలి. అంతకంటే ముందు మాధ్యమాల్లో పనిచేసే వారికి అవగాహన కలిగించాలి.

-సతీష్ చందర్ (ఈ రచయిత ఇతర రచనల కోసం www.satishchandar.com ను విజిట్ చెయ్యండి.)

2 thoughts on “ఇంతకీ, వారు కన్నది కూతుర్నా? కులాన్నా?

  • Dr Bandi

    జైభీం సార్…

    విశ్లేషణ ఎప్పట్లానే అద్భుతం.
    మీ ‘డిమాండ్’ కూడా సముచితం.

    ఆల్ ది బెస్ట్.
    డాక్టర్ బండి.

    Reply
  • గుండెబోయిన శ్రీనివాస్

    చాలా రోజులయ్యింది మీ వ్యాసం చదువక !
    చాలా బాగుంది సార్
    గుండెబోయిన శ్రీనివాస్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *