గెలిచి ఓడిన ‘గులాబి’,ఓడి గెలిచిన ‘కమలం’
ఒక్కొక్క సారి అంతే. గెలుపు దుఃఖాన్నీ, ఓటమి అనందాన్నీ మిగులుస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి)2020 ఫలితాల పర్యావసానం అలాగే వుంది. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్‌ఎస్ కే దక్కింది. మొత్తం 150 వార్డుల్లోనూ ఎక్కువ సీట్లు (55) టీఆర్‌స్సే గెలుచుకుంది. జిహెచ్‌ఎంసిలో అతి పెద్ద పక్షంగా టీఆరెస్సే అవతరించింది. కానీ ఏం లాభం? ఆనందంలేదు. సంబరాలు లేవు.
గత(2016) ఎన్నికల్లో, దాదాపు ‘సెంచరీ’ కొట్టినంత పనిచేసింది. మొత్తం 99 సీట్లూ ఒక్క టీఆర్ ఎస్సే కైవసం చేసుకుంది. ఇప్పటి సంఖ్యను తీసుకుంటే, బాగా దెబ్బతిన్నది.
కానీ, బీజేపీ అనుకున్నంత పనీ చెయ్యలేక పోయినా, అతి దగ్గరకు (48 సీట్లతో) వచ్చేసింది. నిజమే బీజేపీ కన్ను కేవలం హైదరాబాద్ నగరాన్ని చేజిక్కించుకోవటం కాదు. ఏకంగా రాష్ట్రాన్నే కైవసం చేసుకోవాలనుకోవటం. అందుకోసం జిహెచ్‌ఎంసిని చివరి మెట్టుగా భావించింది. ఈ ఒక్క మెట్టూ ఎక్కేస్తే, ఇక తెలంగాణలో కాషాయపాగా వేసినట్లే- అని భావించేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పెద్దగా ఏమీ చెయ్యలేక పోయినా, వెంటనే జరిగిన 2019 పార్లమెంటు ఎన్నికలలో, తన తలరాత మార్చుకోగలిగింది. అసెంబ్లీలో ఓడిన వారిని కూడా పార్లమెంటు టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకో గలిగింది. నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకోగలిగింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక, బీజేపీ అధికార అధిరోహణంలో తొలి విజయంగా భావించ వచ్చు. గెలిచినవి నాలుగు సీట్లయినా, టీఆర్‌ఎస్ అధినాయకత్వానికి సవాలుగా మారింది. అందుకు కారణం: నిజమాబాద్ లో కేసీఆర్ తనయ కవితను ఓడించటం. (ఇటీవల తిరిగి ఆమె ఎమ్మెల్సీగా గెలిచారు. అది వేరే విషయం.)
ఆ తర్వాత జరిగిన పురసమరంలో కొంత పుంజుకున్నా, సీట్ల విషయంలో, బీజేపీకి నిరాశే మిగిలింది. కానీ, కొన్ని నెలల క్రితం దుబ్బాక అసెంబ్లీ నియోజకర్గానికి జరిగిన ఉపఎన్నికలో, గతంలో వరుస పరాజయాలు చూసిన అభ్యర్ధి( రఘునందన్ రావు)నే గెలిపించుకోగలిగింది. ఆ తర్వాత బీజేపీ ఆశలు పెరిగిపోయాయి. వెంటనే జిహెచ్‌ఎంసి మీద మొత్తం పాచికలన్నీ వాడేసింది. దాంతో టీఆర్‌ఎస్ వెన్నంటి వచ్చేసింది. అంతకు 2010, 2016 లలో కేవలం అయిదు, నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఏకంగా అతి దగ్గరకు వచ్చేసింది. టీఆర్‌ఎస్ కు నిజంగానే ముచ్చెమట్లు పోయించింది.
బీజేపీ కి మూడు వరాలు:
ఇందుకు బీజేపీకి కలిసి వచ్చిన కారణాలు మూడున్నాయి. ఒకటి:ప్రభుత్వ వ్యతిరేకత,
రెండు:కాంగ్రెస్ నిస్సహాయత, మూడు: డాలు బోర్లించిన ఆంధ్ర పార్టీలు.
తెలంగాణ లోప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుÛటంగా ఏడాది నుంచే ఎక్కువగా కనిపిస్తోంది. అంత ముందు వరకూ తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్ తిరుగులేకుండా ఎదుగుతూ వచ్చింది. ‘ఉచితాల’తో గ్రామీణ పేద వర్గాలను, మహిళలనూ, వృధ్దులనూ బాగా ఆకట్టుకోగలిగింది. కాబట్టే 2018 ఎన్నికలను టీఆర్‌ఎస్ సునాయాసంగా చేజిక్కించుకోగలిగింది. అప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత వున్నా, అది పట్టణ, నగర మధ్యతరగతి వర్గం వరకే పరిమిత మయ్యింది.
ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలు ప్రదర్శించాలంటే, ప్రత్నామ్నాయం కనిపించాలి. పలు కారణాల వల్ల కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వుండలేక పోయింది. ముందు నుంచీ స్థానిక నాయకత్వం లేకపోవటమే ప్రధాన కారణం. జాతీయ నాయకత్వాన్ని ఎంతో కొంత చూపించగలిగింది కాబట్టి, 2019 లో మూడు పార్లమెంటు సీట్లయినా గెలుచుకోగలిగింది. కానీ రాష్ట్ర నాయకత్వాన్ని చూపాల్సిన అసెంబ్లీ ఎన్నికలు (2018) వచ్చేసరికి మొత్తం డీలా పడిపోయింది. కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా చూడలేక పోవటం వల్ల, టీఆర్‌ఎస్‌నే మేలయిన పక్షంగా అప్పుడు జనం చూశారు కానీ, బీజేపీ వైపుచూడలేక పోయారు. సహజంగా కూలిపోతున్న ప్రతిపక్షాన్ని(కాంగ్రెస్‌ని) , కూల్చటానికి పాలక పక్షానికి పెద్ద సమయం పట్టదు. కాని కూల్చటం తనకే నష్టమని టీఆర్‌ఎస్ అప్పుడు భావించ లేదు. కాంగ్రెస్ గడప దాటిన ప్రజా ప్రతినిధులకు కాదనకుండగా కండువాలు కప్పింది. అందుకే అసెంబ్లీలోనూ, మండలి లోనూ కాంగ్రెస్‌కు ఉనికి లేకుండా పోయింది. ఆ స్థానంలోకే బీజేపీ చొరబడింది. బీజేపీ రాష్ట్రంలో యువనేతల్ని ముందు వుంచింది. ఈ ఎన్నికలకు అయితే, ఏకంగా జాతీయ నేతల్నీ, ముఖ్యమంత్రుల్నీ, మంత్రుల్నీ దించేసింది. హల్ చల్ చేసింది.
అయినా కూడా బీజేపీ ఇంత ముందుకు వెళ్ళేది కాదు. కోవిద్-19 దేశంతో పాటు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసింది. అప్పుడు గ్రామీణ జీవితం కన్నా హైదరాబాద్ నగరజీవితం బాగా దెబ్బతిన్నది. మధ్యతరగతి వారు రోగభయంతో అల్లాడి పోతే, బస్తీల్లో వుండే పేద వర్గాల వారు జీవనోపాధిలేక విలవిల్లాడారు. అంతలోనే వర్షాలూ, వరదలూ హైదరాబాద్ ను ముంచెత్తాయి. నగరపేదలు నీడను కోల్పోయారు. ఇలా దెబ్బతిన్న డివిజన్లలోనే టీఆర్‌ఎస్ మట్టి కరిచేసింది.
ముంతే తెలిసిన వాస్తవం ఒకటి వుంది. ఎలాగూ కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ వచ్చింది కాబట్టి, నగరంలో మధ్యతరగతి వర్గం బీజేపీకే పట్టం కడుతుంది. కానీ బస్తీల్లో పేదలు టీఆర్‌ఎస్ వైపూ వుంటారని టీఆర్‌ఎస్ వ్యూహ కర్తలు భావించారు. పదివేల వరద సాయానికి, మంచినీటి సరఫరా మీద రాయితీకీ వారు మరీ ఎక్కువగా స్పందించినట్లు లేరు.
దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక వోటు చీల్చుకుని మనగలగటానికి ఆంధ్రపార్టీలు కూడా బరిలో లేవు. తెలుగుదేశం వున్నా లేనట్లే. దాంతో బీజేపీకి జాగా దొరికింది.
బీజేపీ ‘ఉద్వేగం’తో మజ్లిస్ కు మేలు
లేకుంటే ‘ఉచితాల’ ముందు ‘ఉద్వేగాలు’ నిలిచేవి కావు. అయితే ముందుగా భావించినట్లే, ఈ ‘ఉద్వేగం’ ఒకరకంగా మజ్లిస్‌కు మేలు చేసింది. పాతబస్తీలో ‘మజ్లిస్’ చెక్కుచెరకుండా వుంది.(గతంలో లాగానే 44 స్థానాలు నిలుపుకుంది, గత ఎన్నికల్లో 60 స్థానాలకు పోటీ చేసి పొందిన 44 స్థానాలను ఇప్పుడు 51 స్థానాలకు పరిమితమై పొందగలిగింది.) నిజానికి ప్రభుత్వ వ్యతిరేకత, టీఆర్‌ఎస్ తో ఇన్నాళ్ళూ చెలిమి చేసిన (ఇప్పుడు వేరుగా పోటీ చేసినా) ఈ మజ్లిస్ ను కబళించలేదు. పైపెచ్చు ‘హిందూత్వ’ ఉద్వేగం ముస్లిం మైనారిటీల వోట్లను చీలిపోకుండా ఏకం చెయ్యగలిగింది. అయితే ఉచితాలు మొత్తం పనిచెయ్యలేదని కాదు. పనిచెయ్యకుంటే టీఆర్‌ఎస్ ఆ మాత్రం స్థానాలు వచ్చేవి కావు. ఏకైక అతి పెద్ద పార్టీగా మిగిలేది కాదు. నగర పేదల్లో ఇంకా సింహభాగం టీఆర్‌ఎస్‌తోనే వున్నట్లు లెక్క.
టీఆర్‌ఎస్ (ఎక్స్ అఫిషియో సభ్యులతో కాక పోయినా, మజ్లిస్ సహకారంతోనైనా) మేెయర్ పట్టాన్ని చేపడుతుంది. కానీ, కాంగ్రెస్ వంటి బలహీనమైన ప్రత్యర్థి స్థానంలోకి బీజేపీని చేజేతులా ఆహ్వానించుకున్నది.
అందుచేత, టీఆర్‌ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నా అది గెలుపు కాదు. ఈ ఎన్నికల్లో ఎవరితో ఎవరికీ పొత్తులు లేవు. కాబట్టి మిత్రలాభమూ, మిత్ర నష్టమూ లేదు. కానీ శత్రులాభం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ వల్ల మజ్లిస్, టీఆర్‌ఎస్ వల్ల బీజేపీ లాభపడ్డాయి. బీజేపీ ‘మతపరమైన ఉద్వేగాలకు’, ముస్లిం వోట్లు పొల్లుపోకుండా, మజ్లిస్‌కు పడ్డాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను ఖాళీచేయించి, ఆ జాగాలోకి బీజేపీని పరోక్షంగా ఆహ్వానించింది. ఈ ఎన్నికల్లో ఎవరి జయాపజయాలు వారికున్నట్లే, ఎవరి పాఠాలు వారికి వున్నాయి. ‘గ్రేటర్’ వోటరు, గ్రేట్ టీచర్ గా ఈ పాఠాలు చెప్పాడు.
-సతీష్ చందర్
గెలిచి ఒడిన ‘గులాబి’ ఓడి గెలిచిన ‘ కమలం’ సుపర్ హెడ్డింగ్ సార్
బాగుంది. చాలా చక్కగా వివరించారు