AndhraFilmsNewsips

సర్కారు వారి ‘ఆట’

ఇప్పుడు APలో  అంతా సినిమా గోల.  అసలు ప్రజా సమస్యలు ఏవీ లేనట్టుగా సినిమా మీద పడ్డారు అందరూ. ఇప్పుడు రాజకీయమంతా సినిమా చుట్టే. దీనికి ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 35. ఆంధ్రప్రదేశ్ లోని ధియేటర్లలో సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తూ వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తూ జారీ చేసిన జీవో ఇది.

చీమా చీమా నన్నెందుకు కుట్టావ్ అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? అందంటా. మరి మా థియేటర్లకు మీరు ధరలు నిర్ణయించడం ఏంటని తిరగబడ్డారు డిస్టిబ్యూటర్లు. సారీ సారీ హీరోలు! ఇదేంటి విడ్డూరం! అయితే గియితే ఓనర్లు మాట్లాడాలి కాని హీరోలేంటి. అదే మరి! సొమ్మొకడిది సోకొకడిది. ఇక్కడ ఎంత కలెక్షన్లు వస్తే అక్కడ అంత రెమ్యూనరేషన్అన్నమాట. ఇండస్ట్రీలో అతి పెద్ద నిర్మాతగా పేరొందిన డీవీవీ దానయ్య, జీవోతో మాకు ఏ సమస్యా లేదు కాని, బెనిఫిట్ షోలు మాత్రం మాకు వదిలేయండి అన్నారు. అక్కడే ఉంది మ్యాజిక్కు. అసలు లాభాలంతా బెనిఫిట్ షోల నుంచే కదా. అసలు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కాని, హీరోలనే దేవుళ్ళుగా భావించే జనాలున్నంత కాలం ఈ దోపీడీ సాగుతూనే ఉంటుంది. సరే! అభిమానం తారాస్థాయికి చేరినప్పుడు ధరలు ఎంత ఉన్న కొంటారనుకోండి. మరి సామాన్య ప్రేక్షకుడి సంగతేంటి? అంతంత డబ్బు పెట్టి సినిమా చూడటం సాధ్యమేనా? వాడికీ వినోదం కావాలిగా మరి? పోని కొద్ది రోజులాగి ఓటీటీళ్ళో చూద్దామంటే ఈ ‘ఆహా’లు,‘ప్రైమ్‌’లు వాడికెక్కడివి? పాపం పండక్కో, పుట్టినరోజుకో సరదాగా సినిమాకి పోదామంటే ధరలు కరెంటు బిల్లుకంటే ఎక్కువై కూర్చుంది. ఇది ఇలాగే కొనసాగితే జగనన్న ‘సినిమా దీవెన’ పధకం తీసుకొచ్చి, ఉచిత టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.

‘చెప్పుకుంటే సిగ్గుచేటు, చెప్పకుంటే గుండెపోటు’ అన్నట్టుగా ఉంది సినిమా రంగం పరిస్థితి. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే నిర్మాతకి దెబ్బ, వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలకు వ్యతిరేకమైపోతామేమో అన్న భయం. ఇక ధరలు పెరిగినా, తగ్గినా నాకొచ్చే నష్టం లేదని నాగార్జున అంటుంటే, ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నాని, సిద్ధార్ధ లాంటి కొంతమంది యువ హీరోలు విరుచుకుపడుతున్నారు. ఇక సినిమాలోని ఒక వర్గం పెద్దన్నగా భావిస్తున్న చిరంజీవి మాత్రం నాకు ఆ పదవి వద్దంటే వద్దని మెల్లిగా ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. ఇక ఇండస్ట్రీలో స్వయంప్రకటిత జ్ఞాని అయిన ఒక దర్శక ‘జీవి’ మాత్రం ఈ విషయంపై భిన్న స్వరం వినిపిస్తున్నడు. ఇది చిలికి చిలికి నాయకులు, సినీ పెద్దల మధ్య యుద్ధంలా మారింది.

అసలు ఎవడిగోల వాడిదే తప్ప ప్రజల భాధ అర్ధం చేసుకునేది ఎవరు? నిజమే! అంతంత భారీ భడ్జెట్ సినిమాలు తీసి చీపుగా యాభై రుపాయిలకే చూపించేద్దామంటే ఎలా కుదురుద్దీ? అసలు సగానికి పైగా బడ్జెట్ రెమ్యూనరేషన్లకే పోతుంది. పోనీ నటీనటులు ఏమైనా తక్కువ తీసుకుంటారా అంటే అదీ జరగదు. పాపం చిన్న చిన్న నిర్మాతలు, దర్శకులు వాళ్ళకి ఉన్న తెలివితేటలతో ఏదో ఒక చిన్న సినిమా తీస్తే, ధియేటర్లలో వందలు, వేలు చెల్లించి దాన్ని చూసేవాడెవడు? వాడూ సినిమా వాడే, వీడు సినిమా వాడేగా? వాడిదీ ఆడాలి, వీడిదీ ఆడాలి. ఇద్దరి సినిమాలు ప్రజలు చూడాలి. ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సరైన విధానాన్ని తీసుకురావల్సిన అవసముంది. టికెట్ల కొనుగోలులో పారదర్శకత ఉండటం మంచిదే కాని, దాన్ని ప్రభుత్వమే నడపగలిగేంత యంత్రాంగం ఉందో లేదో చూసుకోవాలి. పైకి ప్రజలకోసమే చట్టాలు చేస్తున్నామని చెపుతున్నప్పటికీ నిజంగా అది ప్రజలకి మేలు కలిగించేదేనా అని ఆలోచించాలి. ఏది ఏమైనా సామాన్యుడికి ఉపయోగపడే చట్టాలు వస్తే, వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి దాన్ని స్వాగతించాలి. లోపాలు ఉంటే ఎత్తిచూపాలి. ప్రజలు కూడా అన్ని కోణాల నుంచి ఆలోచించి నడుచుకోవాలి.

  – షమైక్ సరిళ్ళ,

ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.

3 thoughts on “సర్కారు వారి ‘ఆట’

  • Kirankumar katta

    Fantastic article 👏👏👏

    Reply
  • Vineetha

    Chala baga chappavu, ne lanti valu future rulers.. Kadikeshai cheta politicians ne..

    Reply
  • Vinay Ram

    Good Brother 👍

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *