FeaturedFilms

కట్టు కథ గొప్పదా? ’కొట్టు’ కథ గొప్పదా?

కథే. చెప్పొచ్చు. రాయొచ్చు కూడా. కొందరు చెబుతారు. రాయరు. చెప్పటం గొప్పే. అందుకే కథ రాస్తే చెప్పినట్టు (Telling Effect) ఉండాలంటారు. అలా కథలు చెప్పే మనిషి మీద సినిమా తీసేశారు. సినిమా పేరు కూడా ’కథకుడు’ (The Story Teller). తీసి మూడు యేళ్ళయినా, ఆలస్యంగా ఓటీటీకి వదిలారు. 

కథకుడి పేరు తారిణి. పరేష్ రావల్ పోషించాడు. చెప్పేవాడికి వినేవాడు ఒకడు కావాలి కదా! ఉన్నాడు. అతడే రతన్ గరోడియా. ఈ పాత్రను అదిల్ హుస్సేన్ వేశాడు. చిత్రం! చెప్పేవాడు బెంగాలీ. వినేవాడు గుజరాతీ. ఏ భాషలో చెప్పాలి? అదృష్టం కొద్దీ ఇద్దరికీ హిందీ వచ్చు. ఇంగ్లీషు అర్థం చేసుకుంటారు. ఫీజు వుంది లెండి. విన్నందుకు కాదు. చెప్పినందుకు కాదు. ఫీజు అంటే ఫీజు కూడా కాదు. అది జీతం. నెల జీతం. అంటే ఉద్యోగమే. ఎందుకంటే వినే గరోడియా పెద్ద వ్యాపారి. దూదిపరుపుల తయారీ. ఆయన పరుపుల మీద వేల మంది నిద్రపోతారు. కానీ పాపం ఆయనకు మాత్రం నిద్రరాదు. నిద్రలేమి (insomnia) ఆయనకున్న రోగం. యోగాలూ, ప్రాణయామాలూ, నిద్రమాత్రలూ- అన్నీ ప్రయత్నిస్తాడు. అయినా కునుకు రాదు. ఎవరో చెబుతారు కథే నిద్రకు మంచి మందూ అని. పసితనంలో బామ్మల కథలకే కదా అందరూ నిద్రపోయేదీ! వెంటనే గరోడియా ఇంగ్లీషు పత్రికలో ప్రకటన ఇస్తాడు ’కథలు చెప్పేవాడు’ కావాలీ అని. అది కూడా బెంగాలీ అయితే మంచిదీ అని షరతు కాని షరతు పెడతాడు. కలకత్తాలో వుండే తారిణి ఆ ప్రకటన చూసి అహ్మదాబాద్ వచ్చేస్తాడు. గరోడియాకు తారిణి నచ్చేసి, బస కూడా ఏర్పాటు చేస్తాడు. కథకుడి కథ ఇలా మొదలవుతుంది.

అప్పడు తారిణికి అర్థమవుతుంది గరోడియాకు ’కునుకు’ సమస్యను మించిన సమస్య వుందీ అని. అదే ’కీర్తి’ సమస్య. కానీ తారిణి ఏం చేస్తాడూ? చేసేదేముంది? జీతమిస్తున్నాడు కదా. కథలు చెప్పాల్సిందే. ఈ సారి ఇంకా గొప్ప కథలు చెబుతాడు.

కారణం దర్శకుడి (అనంత్ మహదేవన్) నేర్పు మాత్రమే కాదు. ఈ ’కథకుడి’ (The Story Teller) కథ రాసాడే, ఆయన నేర్పు. ఆయనెవరూ? ఇంకెవరూ? దర్శకులకే దర్శకుడు. కథకులకే కథకుడు సత్యజిత్ రే. ఎప్పుడో ఆయన రాసుకున్న ’తారిణి’ కథల్లో ఇది ఒక కథ. ‘కాపీరాయళ్ళ’ (Copy Cats) మీద చాలా కథలు వచ్చాయి. కానీ ’రే‘ కథ ’రే’ కథే. దీనిని బెంగాలీలో ’గోల్పోబోలియే తారిణి ఖురో’  పేరు మీద రాశారు. ఇంగ్లీషులోకి కూడా తర్జుమా  అయ్యింది. సినిమా చూడలేదనుకుని, ఈ కథ చదివితే ఆ అనుభవం ఇంకోలాగా వుంటుంది.

ఇంకే ముంది? ఒక్కో రాత్రి ఒక్కో కథ. తారిణి కథ చెప్పిన కథ చెప్పకుండా చెప్పేస్తుంటాడు. పగలు తారిణికి ఏమీ తోచక, అక్కడి లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుంటూ వుంటాడు.  ఒక రోజు ఒకామె లైబ్రేరియన్ని ఒక గుజరాతీ పత్రిక తాజా సంచిక కోసం గుచ్చి గుచ్చి అడుగుతుంది. అందుకు కారణం అందులో వస్తున్న ’గుజరాతీ గోర్కీ’ కథలు. (అంటే అసలు రష్యన్ రచయిత మాక్సిమ్ గోర్కీ కాదు. ఆ కలం పేరుతో ఒకాయన రాస్తున్నాడు). ఏమిటా కథలూ అని లైబ్రేరియన్నే అడిగితే, మచ్చుకు రెండు మూడు కథలు చెబుతుంది. తారిణికి నోట మాట పెగలదు. ఆ కథలు తనవే. తాను వ్యాపారి గరోడియా కు చెబుతున్నవే. అంటే  ఆ గుజరాతీ గోర్కీ ఎవరో కాదు. ఈ గరోడియానే అన్నమాట. అప్పడు తారిణికి అర్థమవుతుంది గరోడియాకు ’కునుకు’ సమస్యను మించిన సమస్య వుందీ అని. అదే ’కీర్తి’ సమస్య. కానీ తారిణి ఏం చేస్తాడూ? చేసేదేముంది? జీతమిస్తున్నాడు కదా. కథలు చెప్పాల్సిందే. ఈ సారి ఇంకా గొప్ప కథలు చెబుతాడు. ‘గుజరాతీ గోర్కీకి’ (గరోడియాకి) కీర్తి తన్నుకుంటూ వచ్చేస్తుంది. సత్కారాలూ, సన్మానాలూ జరిగిపోతాయి. పాపం తారిణి.. ! ఇలా అనాలి అనిపిస్తుంది కదా!  కానీ సినిమా ముగిసేసరికి ‘అమ్మ.. తారిణీ..!?’ అనేస్తాం.

’రే’ రాసిన కథ: శరత్ సాక్షాత్కారం

అందులోనూ ’తారిణి’ ’తారిణి’ లాగా వుంటాడు. కాకపోతే వ్యాపారి పేరు వేరు (బల్వంత్ పారిఖ్). తారిణి దగ్గర ’కొట్టేసిన’ కథల్ని ‘సాహిత్య’ అనే పత్రిక ప్రచురిస్తుంటే, దానికి పోటీగా వచ్చే ’లలిత’ అనే పత్రిక సంపాదకుడు వ్యాపారి అడ్రసు వెతుక్కుంటూ వచ్చేస్తాడు. వ్యాపారి వేరే పని మీద వెళ్ళటంతో తారిణిని కలుస్తాడు. అప్పడు వ్యాపారి చేస్తున్న ’దొంగ’ పని తెలుస్తుందా? అవునూ.. ఇది దొంగ పనేనా? అంతకు మించింది. ’కబ్జా’ అనుకోరాదూ!  ఖాళీ స్థలాన్నే కాదు, కథ ఇతి వృత్తాన్ని కూడా ఇంగ్లీషులో ’ప్లాటే’ అంటారు. దాన్ని కొట్టేస్తే.. ’కబ్జా’ కోరు కాడూ..? అలా వదిలేస్తే ‘మాఫియా’ లయిపోరూ?

అందుకే. తారిణి ఆ వ్యాపారిని ఇంకా ఎక్కువ ’కబ్జా’కు పాల్పడినిచ్చాడు. అప్పుడు ‘లలిత’ పత్రిక కూడా వ్యాపారి కథల్ని పంపటం మొదలు పెట్టాడు. ’లలిత’ పత్రిక అతడి మొదటి కథను ప్రచురించింది. అంతే. ఆ పత్రిక సంసాదకుడికి ఫోనులే ఫోనులే. ప్రశంసిస్తూ కాదు, తిట్టిపోస్తూ. రచయితను కాదు. సంపాదకుడినే. ’నీకు బుధ్ధిలేదా? కథ వేసేముందు చూసుకోవా?’ అని. అది గొప్ప కథ కాదా అంటే,  చాలా గొప్ప కథ.  అనుమానం లేదు. కానీ రాసింది మాత్రం  బల్వంత్  పారిఖ్ కాదు. మరి? జగమెరిగిన రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ.

కొట్టాడు. కథలుచెప్పే తారిణి వ్యాపారిని గూబ గుయ్యమనేటట్టు కొట్టాడు. అంతవరకూ రాత్రిపూట తన సొంత కథలు మాత్రమే వినిపించిన తారిణి, వ్యాపారి ‘ఎత్తిపోతల’ స్కీము గమనించాక, శరత్ చంద్ర కథల్ని చెప్పటం మొదలు పెట్టాడు. పాఠక జనం ఊరుకుంటారా?

మలచిన తీరు: కీర్తికి స్త్రీ రూపం

కథ ఇదే కానీ, దానిని సినిమాగా ఎలా మలచాలో అలా మలిచాడు ప్రతిభావంతుడయిన దర్శకుడు అనంత్ మహదేవన్. వ్యాపారి కీర్తికి ఒక స్త్రీరూపం ఇచ్చాడు. ఆమె ’సరస్వతి’. గరోడియా యవ్వనంలో వున్నప్పుడు ’సరస్వతి’ మీద మనసు పడతాడు. కానీ గరోడియాకు డబ్బూ దస్కం వున్నాయి  కానీ,  ’సరస్వతి’ ని మెప్పించే విద్వత్తు లేదు. అలా దూరమయి, ఏళ్ళ తర్వాత చేరువవుతుంది. గరోడియా ’కొట్టేసి’ రాస్తున్న కథలకు ముగ్ఢురాలవుతుంది. అతడికి జరిగిన సన్మాన సభకూ వస్తుంది. కానీ, సినిమాలో అతడి మీద కేసువెయ్యటానికి ’రవీంద్రనాత్ ఠాగోర్ పౌండేషన్’ వాళ్ళు వస్తారు.  సత్యజిత్ రే కథకూ, అనంత్ మహదేవన్ సినిమాకూ చిన్నమార్పు. శరత్ చంద్ర కథ బదులు, ఠాగోర్ కథ కొట్టేటట్టు చేస్తాడు తారిణి.

కీర్తికి ఒక స్త్రీరూపం ఇచ్చాడు. ఆమె ’సరస్వతి’. గరోడియా యవ్వనంలో వున్నప్పుడు ’సరస్వతి’ మీద మనసు పడతాడు. కానీ గరోడియాకు డబ్బూ దస్కం వున్నాయి  కానీ,  ’సరస్వతి’ ని మెప్పించే విద్వత్తు లేదు. అలా దూరమయి, ఏళ్ళ తర్వాత చేరువవుతుంది. గరోడియా ’కొట్టేసి’ రాస్తున్న కథలకు ముగ్ఢురాలవుతుంది.

కట్టిన కథకూ, ’కొట్టిన’ కథకూ తేడా ఇవాళ కాకపోతే రేపుతెలుస్తుంది. అప్పుడయినా అభాసు పాలవ్వాల్సివస్తుంది. అయినా ’కొట్టాల’న్న కోరిక వున్న వాళ్ళశాతం సినిమా రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ ఎక్కువగానే వుందాం. ’పోతాం’ అని తెలిసి కూడా ’కొట్టేస్తున్నారు’. ఇది వ్యాధి లక్షణం కూడా. ఇది కూడా ’కోవిడ్’ ’ప్లేగు’ లాంటి మహమ్మారే. దీనినే ’ప్లేగియారిజం’ అంటారు. ఏం చేస్తాం? ఈ వ్యాధి బారిన పడి మన కళ్ళ ముందే దర్శకులూ, రచయితలూ కూలిపోతుంటే చూస్తూ వుండటం తప్ప మనం చేసేదేమీ లేదు. ఎందుకంటే  ఈ వ్యాధికి ఇంకా వ్యాక్సీన్ కూడా కనిపెట్టలేదు.

  • సతీష్ చందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *