ముమ్మారు ముఖ్యమంత్రి- మూడేళ్ళు కూడా లేడు!
అయిదు దశాబ్దాల రాజకీయ జీవితం. కానీ అందలం మీద వున్నది రెండేళ్ళ లోపే. ముఖ్యమంత్రిగా మూడు దఫాలు చేశారు. మొదటి సారి పది రోజులే. రెండో సారి అయిదు నెలలు. మూడోసారి మరో అయిదు నెలలు. కేంద్ర మంత్రిగా ఇంకో పది నెలలు. కానీ చరిత్ర వేసిన సింహాసనం మీద జీవితాంతమే కాదు. జీవితానంతరం కూడా కూర్చున్నారు. ఆయనెవరో కాదు. యావధ్ధారతంలో, గిరిజనోద్యమం చేసి, గిరిజన రాష్ట్రం (జార్ఖండ్) సాధించి, పాలించిన ఒకే ఒక్క నేత శిబు సోరెన్.
పాలన నేర్చేది అమ్మ లాలనలోనే
అమ్మలాలనలో పెరిగినవాడే అసలైన పాలన నివ్వగలడని నిరూపించాడు. తనకు పట్టుమని పదిహేనేళ్ళు దాటకుండానే, తండ్రిని కోల్పోయాడు. అది సహజమరణం కాదు. దారుణ హత్య. అప్పటి అవిభక్త బీహార్ లోని రామ్ గఢ్ జిల్లాలో ఇలాంటి హత్యలు మామూలే. మహాజన్ల (భూస్వాములకు) ఎదురు తిరిగిన ఏ సంతాల్ గిరిజనుడికయినా ఇదే ముగింపు. మహాజన్లు అన్నిరకాలా గిరిజనులను దోచుకునేవారు. నూరుశాతం వడ్డీలతో అప్పులిచ్చి, తీర్చకపోతే చిత్రహింసలు పెట్టేవారు. తండ్రి హత్య మీద వ్యక్తిగత కక్ష పెంచుకోకుండా, తన తండ్రిలాంటి ఇతర గిరిజనుల గురించి, గిరిజనేత కూలీల గురించీ ఆలోచించాడు. అందుకు అన్ని విధాలా అమ్మే కారణంగా. కొడుకును అతి జాగ్రత్తగా పెంచింది. ఈ భూస్వాములకు వ్యతిరేకంగా ఆందోళన సాగించాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడు కలిశారు ఇద్దరు. ఒకరు అనుభవజ్ఞుడయిన మార్క్సిస్టు సిధ్ధాంత కర్త, కార్మిక నేత ఎ.కె. రాయ్. మరొకరు: బినోద్ మహతో. వీరి సాయంతోనే సోరెన్ ’జార్ఖండ్ ముక్తి మోర్చా’ను స్థాపించారు. మహతో జార్ఖండ్ (2000లో) రాష్ట్రం ఏర్పడటానికి తొమ్మదేళ్ళ ముందే చనిపపోయారు. రాయ్ ముందుగానే వేరుపడి తన స్వంత పార్టీ (మార్క్సిస్టు కోఆర్డినేషన్ కమిటీ)ని స్థాపించారు. కానీ రాయ్ సోరెన్ కు రాజకీయ మద్దతు ఇస్తూనే వచ్చారు.
మూడు ‘అ’ లే మూడంచెలు

తన పార్టీకి ఆలంబనగా సంతాల్ గిరిజనులే కాకుండా, సదన్ మహతోలనే గిరిజనేతరులు కూడా వుండేవారు. వీరిని జమిలి గా కూడగట్టటంలో శిబు సోరెన్ పాటించిన ఉద్యమ రాజకీయ వ్యూహం గొప్పది, విలక్షణమైనది కూడా. ఇది మూడంచెల వ్యూహం. ముచ్చటగా మూడు ’అ’ లుగా పిలచుకోవచ్చు: అక్షరం, ఆర్జన, అధికారం. ఈ మూడింటితోనే దుర్భేద్యమైన కార్యకర్తల వలయాన్ని సృష్టించుకున్నారు.
తన పార్టీకి ఆలంబనగా సంతాల్ గిరిజనులే కాకుండా, సదన్ మహతోలనే గిరిజనేతరులు కూడా వుండేవారు. వీరిని జమిలి గా కూడగట్టటంలో శిబు సోరెన్ పాటించిన ఉద్యమ రాజకీయ వ్యూహం గొప్పది, విలక్షణమైనది కూడా. ఇది మూడంచెల వ్యూహం. ముచ్చటగా మూడు ’అ’ లుగా పిలచుకోవచ్చు: అక్షరం, ఆర్జన, అధికారం. ఈ మూడింటితోనే దుర్భేద్యమైన కార్యకర్తల వలయాన్ని సృష్టించుకున్నారు. మహాజన్లు ఇక్కడి పేదల్ని మద్యం మత్తులో వుంచి, పీడించేవారు. దానినుంచి వారిని బయిట పడెయ్యాలీ అంటే ఒక్కటే మార్గం. మత్తు ఎక్కే సమయంలోనే మత్తును దించాలి. అందుకే తొలుత ‘రాత్రి పాఠశాల’తో సోరెన్ తన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా సారావ్యతిరేకోద్యమం ఊపందుకుంది. దాంతో మద్యం మత్తే కాదు. మతం పేరిట కలిగే మూఢవిశ్వాసాల మత్తు కూడా అక్కడ గిరిజనులకు వదిలించాడు. అందుకే ఆయన్ని ’గురూజీ’ అంటారు.
బ్యాలెట్ నుంచి బులెట్ మీదకు
అక్షరం తర్వాత రావాల్సింది ఆర్జన. శ్రమించి కూడ బెట్టని ఆర్జన చేజారిపోకుండా చూసుకోవాలి. అంటే మహాజన్లు దోచుకోకుండా చూసుకోవాలి. ‘మన పంట మనది. మన భూమి మనది’ అని వారి చేత అనిపించారు. అందుకు అడ్డొచ్చే మహాజన్లను, మహాజన్లకు అండగా నిలిచే పోలీసులను తరిమి కొట్టమని పిలుపు నిచ్చాడు. అప్పుడు సోరెన్ కు వామపక్ష వాదుల (లాల్ ఖండిల) నుంచి అపారమైన మద్దతు వచ్చింది. అంతే కాదు, అప్పటికే నిషేధిత సంస్థగా వున్న మావోయిస్ట్ కమ్యూనిస్టు సెంటర్ తో కూడా కలిశాడు. కానీ అది మూణ్ణాళ్ళ ముచ్చట గానే ముగిసి పోయింది. తెగతెంపులు చేసుకున్నా కూడా వారు కత్తికట్టి సోరెన్ పై దాడులకు కూడా ప్రయత్నించారన్న ఆరోపణలు వున్నాయి. కానీ ఎవరు ఎంత కవ్వించినా, తన దృష్టి ’బులెట్ ’ మీదకు మళ్ళలేదు. ’బ్యాలట్’ మీదనే దృష్టి పెట్టాడు. కాకపోతే, మహాజన్ల తిరగుబాటు చేస్తున్నంత కాలం, సోరెన్ అజ్ఞాతంలో వుండాల్సి వచ్చేది. కానీ హఠాత్తుగా ఎక్కడో అక్కడ జనం మధ్య కనిపించి, వారిని ఉత్తేజపరచి మాయమయి పోయారు. దాంతో ’గురూజీ తనంతట తాను అదృశ్యమవ్వగలడు, ప్రత్యక్షమవ్వగలరు’ అని జనం నమ్మేవారు. పరహస్త మైన లక్షలాది ఎకరాల భూములను పేద గిరిజనులకు తిరిగి వచ్చేలా చేశారు. అంతే కాదు. వారిని తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు, మరింత స్వతంత్రంగా ఎదిగేందుకు, చిరువ్యాపారాలు చెయ్యాలని కూడా ప్రోత్సహించేవారు. ఇక్కడితో ఆర్జన దశ దాటారు.
‘పుడమి మాది, అడవి మాది’
ఇక అధికారం. ఈ విషయంలో శిబు సోరెన్ కు స్పష్టమైన అధికార వ్యూహం వుంది. కొందరు గిరిజన గ్రామ రిపబ్లిక్ లను తెచ్చి సంప్రదాయపు గిరిజన పెద్దల చేతిలో పెట్టాలని కొందరు వత్తిడి తెచ్చినా, ఆయన అటు వైపు మళ్ళలేదు. ’మా భూమి, మా అడవి, మా అస్తిత్వం’ అన్నదే తన నినాదం అని స్పష్టం చేసేవారు. ఈ అస్తిత్వమే తనను ప్రత్యేక గిరిజన (జార్ఖండ్) రాష్ట్ర సాధన వైపు నెట్టింది. తమ చట్టాలు తాము చేసుకోగలిగినప్పుడే అధికారం వచ్చినట్టు లెక్క అని తాను నమ్మటమే కాకుండా, తన వారి చేత నమ్మించారు. అంతిమంగా సాధించారు.
వీరుడో, శూరుడో కాదు!
కానీ, ఈ అధికార సాధనలో ఆయనకు అడుగడుగునా అడ్డంకులే, కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం కూలిపోకుండా వుండేందుకు జెఎంఎం మద్దతు ఇచ్చింది. అయితే అందుకు శిబు సోరెన్ కు ముడుపులందాయన్న ఆరోపణ మీద ఆయన్ని జైలు పాలు చేశారు. హత్య కేసుల్లో అరెస్టులయ్యారు. నిర్బంధాల పాలయ్యారు. అంతే కాదు. సొంత కుటుంబంలోనే అంతరాలు లేవదీశారు. అయినా కృంగ లేదు. లొంగ లేదు. తన వారసుడయిన హేమంత్ సోరెన్ ఇవే పరీక్షలు పట్టారు. అయినా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరుడనో, శూరుడనో శిబుసోరెన్ ను పొగడవచ్చు. అతడు నిలువెత్తు నాయకుడు.
సతీష్ చందర్
16 ఆగస్టు 2025