FeaturedPolitics

‘బ్యాలట్ క్రికెట్’ లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ బాబోయ్!

అవుట్. అంపైర్ ఈల వేశాడు. ఒక ఆటగాడు ఓడిపోయాడు. ఇంకో ఆటగాడు గెలిచాడు. ఓడిన ఆటగాడికి అంపైర్ మీదే అనుమానం వచ్చింది. అనుమానం కాదు. తనను ఓడించింది అంపైరే అని ఆరోపించాడు కూడా. అందుకు ‘ఆధారాలు’ వున్నాయి అన్నాడు. బయిట పెట్టాడు. గెలిచిన క్రీడాకారుడితో అంపైర్ కుమ్మక్కయ్యాడన్నాడు. ఇప్పుడు విచారణ ఎవరు జరపాలి? అదే ’అంపైరా?’  కాదు కదా?

ఓడిన క్రీడాకారుడు రాహుల్ గాంధీ. గెలిచిన క్రీడాకారుడు నరేంద్ర మోడీ. అంపైర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ). ఆట ఎన్నికల రాజకీయం. అవును. సార్వత్రిక ఎన్నికలు (2024) సవ్యంగా జరగలేదని రాహుల్ గాంధీ ఆరోపణ. ఈ ఆరోపణ ఎప్పటి నుంచో చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ‘వోట్ల చౌర్యం’ జరిగిందని ఈ మధ్య స్వరం పెంచారు. పైపై ఆరోపణలు కాదు, ‘ఆధారాలు’ వున్నాయా అని అధికార పక్షనేతలు అంటూ వచ్చారు. కడకు రాహుల్ తన దగ్గర ‘ఆటం బాంబు’ లాంటి ఆధారం వుందని అన్నారు. ఇలా అన్న వారం తర్వాతనే, ఆయన (7 ఆగస్టు 2025న) ‘ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించారు’ అన్న శీర్షికతో మీడియా సమావేశం నిర్వహించి, కొన్ని వివరాలను బయిట పెట్టారు. ‘ఒక వ్యక్తి ఒక వోటు’ అన్న రాజ్యాంగం కల్పించిన వోటు హక్కులోని మౌలిక సూత్రాన్ని కమిషన్ సంపూర్ణంగా విస్మరించిందని ఆరోపించారు. అందుకు మొత్తం 543 పార్లమెంటరీ నియోజక వర్గాల్లోని ఒక పార్లమెంటు నియోజక వర్గాన్ని తీసుకున్నారు. అది కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం. గత (2024) ఎన్నికలలో అక్కడ బీజేపీకి 6,58, 915, కాంగ్రెస్ కు 6, 26, 208 వోట్లూ వచ్చాయి. బీజేపీ 32, 707 వోట్ల ఆధిక్యతతో గెలిచింది. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి  ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఆరింటిలో కాంగ్రెస్ కే మెజారిటీ వచ్చింది. కానీ ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంటు (మహదేవ పుర) లో బీజేపీకి మెజారిటీ వచ్చింది. అది కూడా మామూలు మెజారిటీ కాదు. ఏకంగా లక్షకు పైగా(1,14, 000) మెజారిటీ. ఇంత ఆధిక్యం ఎలా వచ్చింది? ఇదీ రాహుల్ పరిశోధనకు బీజం. అప్పుడు మహదేవపుర లో వోటు హక్కు వినియోగించుకున్న వారి వివరాలను రాహుల్ బృందం సేకరించింది. అక్కడ ఏక లక్షకు పైగా (1,00, 250) వోట్లు ‘చోరీ’ కి గురయ్యాయని ఆ బృందం పరిశోధనలో తేలింది.

ఈ ’చోరీ’ కూడా అయిదు రకాల పధ్ధతులను ఎంచుకుని మరీ చేశారన్నారు.

అంటే వోటరు పేరు పక్కన అడ్రసే గల్లంతు కావటం. అడ్రసు స్థానంలో సున్నా, హాష్ టాగ్, ఎట్సెట్రా గుర్తులు వుండటం. ఇలా  40,009 వోట్లు వున్నాయి.

అంటే ఒకే అడ్రసులోనే ఎక్కువ మంది వుండటమన్నమాట.  ఒకే గది వున్నఇల్లు. కానీ ఇంటి నెంబరుతో  80 మంది వోటర్లు ఒక చోట, 46 మంది వోటర్లు ఇంకొక చోట వున్నారు. ఇంకా చిత్రం. ఒక బ్రూవరీ (సారాయి బట్టీ) లో ఏకంగా 68 వోటర్లు నివసించటం. ఈ తరహా గుంప గుత్త వోటర్లు 10,452 మంది వున్నారు.

’ఫోరం-6’ ను దుర్వినియోగ పరచటం.మొదటి సారి వోటరును నమోదు చెయ్యటానికి ఈ పత్రాన్ని వాడతారు. కానీ దీని కింద 18-23 యేళ్ళ మధ్య నున్న వారు కదా వుండాల్సింది? కానీ ఏకంగా డెభ్భయి పైబడిన వాళ్ళు వున్నారు. శకున్ రాణి అనే 70 యేళ్ళ వోటరు. ఈమె కొత్త వోటరుగా నమోదు అయ్యింది. ఇలాంటి వృధ్ధులైన ’యువ వోటర్లు’ 33,692 మంది వున్నారు.

వోటరు కార్డుల్లో గుర్తు తెలియని లేదా గుర్తు పట్టలేని ఫోటోలు వుండటం. ఫోటో స్థానంలో ఏవేవో చిత్రాలు కానీ, పోలికకు అందని సూక్ష్మ చిత్రాలు కానీ వుండటం. ఈ వోటర్లు 4,132 మంది వున్నారు. 

మొదటి సారి వోటరును నమోదు చెయ్యటానికి ఈ పత్రాన్ని వాడతారు. కానీ దీని కింద 18-23 యేళ్ళ మధ్య నున్న వారు కదా వుండాల్సింది? కానీ ఏకంగా డెభ్భయి పైబడిన వాళ్ళు వున్నారు. శకున్ రాణి అనే 70 యేళ్ళ వోటరు. ఈమె కొత్త వోటరుగా నమోదు అయ్యింది. ఇలాంటి వృధ్ధులైన ’యువ వోటర్లు’ 33,692 మంది వున్నారు.

ఈ పరిశోధన చెయ్యటానికి ఆరు నెలల సమయం పట్టందని చెబుతూ, కమిషన్ కనుక డిజిటల్ వోటర్ రోల్స్ చూసే సౌకర్యం కల్పిస్తే 30 సెకండ్లు పట్టేదని చెప్పారు.

ఒక్క నియోజకవర్గాన్నే నమూనాగా చూపిస్తున్నాననీ, ఇలా నరేంద్ర మోడీ, ఈసిఐ కలిసి 25 పార్లమెంటు నియోజక వర్గాలలో చేశారనీ. వాటన్నింటిలోనూ తేడా 33 వేల వోట్లలోపే ననీ అంతిమంగా రాహుల్ గాంధీ తేల్చారు. అయితే ఇందుకు ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ప్రమాణ పత్రం మీద సంతకం చేసి అక్రమంగా వోటర్ల తొలగింపు, చేర్పులకు సంబంధించిన ఆధారాలిస్తే విచారిస్తామనీ, అలా చెయ్యని పక్షంలో రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని కమిషన్ కస్సుమంది. ఇది రాజ్యాంగ లాంఛనం. రాహుల్ గాంధీ దాన్ని పాటించటంలో తప్పులేదు. కానీ కమిషన్నే తప్పు పడుతున్న రాహుల్ అది కమిషన్ ను విచారించమని ఎలా కోరతారు? లాజిక్కే కదా! అందుకేనేమో, రాహుల్ ఆందోళన బాట పట్టారు.

8 ఆగస్టు 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *