ముఖ్యమంత్రి పార్టీ వేరా? 30 రోజుల్లో దించెయ్యవచ్చు!
మూడుబిల్లులు తెచ్చింది అందుకేనా?
బిల్లులు కావవి. బేడిలే. అవును. మూడంటే మూడే బిల్లుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ ష్ (20 ఆగస్టు 2025న) పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రులయినా, మంత్రులయినా అరెస్టయి, బెయిలు రాకుండా, జైలులో 30 రోజులు దాటి జైల్లో వున్నారనుకోండి. వాళ్ళు పదవులు కోల్పోవలసిందే. చూడటానికి ’నేర చరితుల్ని’ పదవుల్లో వుండకుండా చూడటానికి అన్నట్టు లేదూ? చూడటానికే అలా వుంటుంది. వాడటానికి కాదు.
వారి వాడకాన్ని ముందు ముందు చూస్తారు?
ఎవరు వాడతారు? ఇంకెవరు? కేంద్రంలో అధికారంలో వున్నవారు. అరెస్టులు ఎవరు చేస్తారు? దర్యాప్తు సంస్థలు చేస్తాయి. సీబీఐ, ఈడీ, ఎన్ఐయే ఇంకా ఏమైనా. ఎన్నికల షెడ్యూలు అమలులో వున్నప్పుడు ఎన్నికల సంఘం కూడా జూలు విదలించవచ్చు. నేతల మీద కేసులు పెట్టి అరెస్టు చెయ్యించవచ్చు. ఇప్పటికే ఈ సంస్థల ’స్వతంత్రత’ మీద విమర్శలున్నాయి. అప్పుడప్పుడూ ఈ విషయంలో ఈ సంస్థలు కోర్టు చేత అక్షింతలు వేయించుకుంటూనే వుంటాయి. అలాంటప్పుడు, కేంద్రం లో అధికారంలో వున్న రాజకీయ పక్షానికి, రాష్ట్రంలో వేరే పక్షం అధికారంలో వుంటే నచ్చక పోవచ్చు. అప్పుడు ఈ దర్యాప్తు సంస్థల మీద వత్తిడి తెచ్చి, అక్కడి ముఖ్యమంత్రినో, మంత్రినో ఏదో ఒక అభియోగం కింద అరెస్టు చేయించవచ్చు. అది ‘అభియోగం’ మాత్రమే. ’నేరారోపణ’ న్యాయస్థానంలో నిర్ధారణ అయ్యే వరకూ ’నేరం‘ కాదు. అంతవరకూ ’ఆరోపితుడు’ (accused) నిరపరాధే (innocent). ఈలోగా అతనికి ‘పదవిని తీసే‘ శిక్షను వేస్తాననటం న్యాయశాస్త్రం మూల సూత్రానికే విరుధ్ధం. ఆ శిక్ష కూడా ఎవరూ వేస్తారు? కేంద్రంలో అధికారంలో వున్న వారే. అంటే ప్రధాని, ఆయన మంత్రివర్గమే. అందుకే ఇలా ప్రవేశపెట్టగానే, ప్రతి పక్షాలు అలా కస్సున లేచాయి.

‘ఈ బిల్లును ఆమోదిస్తే ప్రధాని మధ్యయుగాల నాటి రాజుగా మారతారు. తనకు నచ్చని వారిని తక్షణం తొలగిస్తాడు. ఎందుకంటే రాజు ప్రజలు ఎన్నుకున్నవాడు కాడు.’ అన్నారు లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.
‘ఈ బిల్లును ఆమోదిస్తే ప్రధాని మధ్యయుగాల నాటి రాజుగా మారతారు. తనకు నచ్చని వారిని తక్షణం తొలగిస్తాడు. ఎందుకంటే రాజు ప్రజలు ఎన్నుకున్నవాడు కాడు.’ అన్నారు లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ బిల్లులు ఆమోదం పొందితే, ప్రజాస్వామ్యం పోయి రాచరికం వస్తుందన్నది ఆయన భావన. ఈ బిల్లు అమలయితే ఉత్త ఎమర్జన్సీ కాదు, ’సూపర్ ఎమర్జన్సీ’ వచ్చినట్టు లెక్క అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్లు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంతకీ ఆ మూడు బిల్లులూ ఏమిటి? ఒకటి: రాజ్యాంగ (130 వ) సవరణ బిల్లు రెండు: కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు. మూడు: జమ్ము, కాశ్మీరు పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు.
మెదటి బిల్లు చేసి సరిపుచ్చుకుంటే, అవి రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. అలా కాకుండా, కేంద్ర పాలిత ప్రాంతాలన్నిటకీ వర్తింప చెయ్యాలంటే, మిగిలిన రెంటినీ తప్పని సరిగా భావించారు. అయిదేళ్ళు జైలు శిక్షగల నేరారోపణల మీద ఆరెస్టయి, ’న్యాయ నిర్బంధం’ లోకి వెళ్ళి న మంత్రులు, ముఖ్యమంత్రుల తో పాటు ప్రధానిమంత్రికి కూడా వర్తిస్తుందని మొదటి బిల్లు చెబుతోంది. ముఖ్యమంత్రుల్నీ, రాష్ట్ర మంత్రుల్ని గవర్నర్ ల ద్వారానూ, (కేంద్రపాలిత ప్రాంతాల్లో మంత్రుల్ని లెఫ్ట నెంట్ గవర్నర్ ద్వారానూ) ప్రధాని, కేంద్రమంత్రుల్ని రాష్ట్రపతి ద్వారా తొలగిస్తారు. ఇదీ సంక్షిప్తంగా బిల్లుల సారాంశం.
ఆ ఇద్దరు సీఎంలూ నేతలూ వైరి పక్షాలవారే
గత అయిదేళ్లలో ఇలా మహరాష్ట్రలో ఎన్సీపీ, ఢిల్లీలో ఆప్, పశ్చిమ బెంగాల్ లో, తమిళనాడులో డిఎంకె మంత్రులు ’మనీ లాండరింగ్, ఉద్యోగ నియామకాల స్కాం, ల్యాండ్ స్కామ్’ లాంటి అభియోగాల మీద అరెస్టయి జైలు లో వున్నారు. చిత్రం కాదు. వాస్తవం. అందరూ బీజేపీయేతర పక్షాలకు సంబంధించిన వారు.
ఈ బిల్లుల అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చినట్లూ? కేవలం కేంద్రంలోనే కాక, అన్ని రాష్ట్రాల్లోనూ ’బీజేపీ’ యే సర్కారు వుండాలన్న యోచనకు ఇప్పటికే ’జమిలి ఎన్నికలు’ (One Nation One Poll) మీద కసరత్తు చేస్తున్నది అందుకే. అలా ఎన్నికలు నిర్వహించినా, రాష్ట్రాలలో బీజేపీయేతర పక్షాలు అధికారంలో వుంటున్నాయి. ఇప్పుడంటే ఢిల్లీ లో బీజేపీ ముఖ్యమంత్రి వచ్చారు కానీ, చాలా కాలం వరకూ ’ఆప్’ సర్కారే వుంటూ వచ్చింది. చిత్రంగా, ఆయనే ’’మద్యం స్కాం’ లో ముఖ్యమంత్రిగా వుండి అరెస్టయ్యారు. అంతే కాదు, ముఖ్యమంత్రిగా వుంటూనే ’జ్యూడిషియల్ కస్టడీ’ పేరు మీద ఆరు నెలలు జైలులోపలే వుండిపోయారు. హేమత్ సోరెన్ కూడా అంతే. దాదాపు అయిదు నెలలు జైలులో వున్నారు. అయితే, రాజీనామా చేసి, తన స్థానంలో మరొకర్ని పెట్టి, తిరిగి బెయిలు మీద వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.

అంటే అర్థమవుతుంది కదా! కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎవరిని గురిపెడుతుందో? వీళ్ళందరనీ అరెస్టు చేయించినా, మంత్రి పదవులనుంచీ, ముఖ్యమంత్రి పదవుల నుంచీ తొలగించలేక పోయామే- అన్న ’గుర్రు’ ఎక్కడో వుండి పోయినట్టుంది.

నాడు ఎమర్జన్సీ- నేడు ‘సూపర్ ఎమర్జన్సీ’
కానీ ఇష్టంలేని సర్కారును ఇలా కూల్చటానికి పూర్వం 356 వ అధికరణాన్ని విచ్చలవిడిగా వాడేవారు. ఈ పని అప్పట్లో కేంద్రంలో వున్న కాంగ్రెస్ కూడా వాడింది. కానీ ఎస్సార్ బొమ్మయ్ కేసులో సుప్రీం తీర్పు తర్వాత, ఎలా బడితే అలా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను విధించటానికి లేక పోయింది. ఇప్పుడు అదే పనిని ఈ బిల్లుల ద్వారా చెయ్యాలని ఇప్పటి బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ బిల్లుల్ని అడ్డుకోవటానికి ప్రయత్నించగానే, దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ, ’మూజువాణి’ వోటుతో తీర్మానాన్ని లోక్ సభలో ఆమోదింప చేశారు. పార్లమెంటరీ కమిటీ ఎలాగయినా నిర్ణయించవచ్చు. ‘నేరారోపణ’కీ ’నేర నిర్ధారణ’కీ వున్న వ్యత్యాసాన్ని ఈ కమిటీ తప్పని సరిగా గణించాలి. అలా అక్కడ ఆగకుంటే, పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం కావాలి. అయితే రాజ్యాంగ సవరణకు మూడింటా రెండొంతుల మెజారిటీ అవసరం. ఇప్పట్లో అంత మెజారిటీని కూడ గట్టటం కష్టమే. కావచ్చు. అసలీ ఫెడరిలిజానికి గొడ్డలి పెట్టు.
సతీష్ చందర్
21 ఆగస్టు 2025
If this bill will pass in parliament Nobody will escape from it indirectly state power will undertake by central government by using this.sir you explained clearly this bill is for revenge politics yes 100 percent true sir.
ఒక దొంగ ఇంకో దొంగని దొంగా దొంగా అన్నట్లుంది !!
(వారు కూడా ఒకప్పుడు నేరస్థులే మరి చట్టసభల్లో వారి పార్టీ అవసరం కోరకు ఇతరుల నిర్ణయం తీసుకోకుండానే స్వతహాగానే బిల్లు పెట్టవచ్చా!!)
కాని -ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి బ్రేకులు పడతాయి..
-అప్పుడు యువ నాయకత్వం పుంజుకుంటుంది..
– పేద మధ్యతరగతి ప్రజలకు కూడా మేలు చేస్తుంది.
ఇప్పటి వరకు వీళ్ళకి బాగానే ఉంటుంది,కానీ పొరపాటున భవిష్యత్తు లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే..
ఇదే చట్టం బీజేపీ కీ భస్మాసుర హస్తంలా మారుతుంది కదా!!
ఎందుకు అంటే గతం లో కాంగ్రెస్ చేసిన చట్టాలనే నేడు బీజేపీ కాంగ్రెస్ మీద ప్రయోగించినట్లు 🤣🤣🤣
మొదట్లో ఈ బిల్లును గురించి విన్నప్పుడు ప్రజా ప్రతినిధులు అయినటువంటి మంత్రులు ,ప్రధానం మంత్రులు ముఖ్యమంత్రులు నేరాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతంగా నడుచుకుంటారని ఊహించాను కానీ ఈ ఆర్టికల్ చదివినాక నాకు అర్థమైంది ఏమిటంటే అధికారం లో ఉండే ఏ ప్రభుత్వమైనా ప్రవేశపెట్టే బిల్లులో ఉండే అంతరార్థాన్ని లోతుగా పరిశీలించాలి.
ఈ బిల్లులు ఒక విధంగా ప్రాంతీయ పార్టీలకు చరమగితం పాడటానికి మాత్రం బాగా ఉపయుక్తం, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు, ఎలాగైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కమలం వికసించాలని అది ఇలాగైతే మరింత తొందరగా అధికారంలోకి రావచ్చని అమితమైన షా గారి దుర్మార్గపు ఆలోచన.
బాబా సాహెబ్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని దొడ్డి దారిలో ఇలా చట్టాల రూపంలో రూపు రేఖలను మారుస్తూ పోతే, అది మొదటికే మోసం అని కాషాయ దళం గుర్తించాలి.