FeaturedLiterature

చంద్రమ్మ వ్రాలు

నిశాని సంతకమయ్యింది. వేలి ముద్ర కాస్తా ‘వ్రాలు’ అయ్యింది. జీవితంలో రెండవ సారి పెన్ను పట్టింది చంద్రమ్మ

చిన్న విషయం కాదు. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారినంత పెద్ద విషయం.

అంతకు ముందు ఒక్క కుడిచేతి బొటన వేలు  చాస్తే సరిపోయేది. ఇప్పుడు మూడువేళ్ళతో పని. అయినా అయిదు వేళ్ళూ ముడిచేస్తోంది. కత్తినో, కొడవలినో పడుతున్నానుకుంటోంది. కలం కత్తిలాంటిందంటారు కదా- ఆమె విషయంలో నిజమవుతోంది.

అరవయ్యేళ్ళ వృధ్ధురాలేమో, పండుటాకు మీద ఈనెల్లా, తెల్లని ముంజేతిమీద పైకి తేలిన నీలి నరాలు. రోజూ చేసే పనికి అరిగి, నల్ల బడ్డ వేళ్ళు. కాగితం పైన ఏమి రాసి వుందో తెలియదు. అక్షరాలయితే వున్నాయి. ఒక రోజు సమయమిస్తే, మొత్తం చదివేసేదే. పేజీ కింద మాత్రమే మిగిలిన జాగా. ఆరడుగుల చీరకు అరంగుళం అంచులా. ఆ ఇరుకు జాగానంతా తన సంతకం తో నింపేసింది:

దిద్దే చంద్రమ్మ వ్రాలు.

 ‘దిద్దే’ కాదు. నిజానికామె ‘దిద్దిన’ చంద్రమ్మ. అక్షరాలు దిద్దిన చంద్రమ్మ. చీకటి పడ్డాకనే నల్లటి పలక మీద తెల్లటి ‘అమ్మ’ను బలపంతో దిద్దిన చంద్రమ్మ. జీవితపు మలిసంధ్యలోనే అక్షరాభ్యాసం చేసిన చంద్రమ్మ.

‘శవాన్ని గుర్తించావు, మీ ఆయన బాగయ్యదే కదా?’ కాగితాన్ని వెనక్కి తీసుకుంటూ అడిగాడు తెల్లబట్టల్లో వున్న ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి. అతని ముఖం కూడా తెల్లగానే వుంది. మాస్క్ ధరించివున్నాడు.

‘ఆయ్. నా దేవుడిదేగానిండీ.. ఆణ్ణి శవమనకండయ్యా.. మీకు దండమెడతాను..’ అని పెన్ను టేబుల్ మీద వదిలేసి, అయిదు వేళ్ళతోనూ రాబోతున్న కళ్ళనీళ్ళను అదిమి పెట్టబోయింది. ప్రయత్నం వృధానే. వేళ్ళ మధ్యనుంచి చినుకుల్లా రాలాయి. మొదలును రంపంతో నిశ్శబ్దంగా కోసేశాక- చెట్టుకూలుతుందే- అలా, ఆమె కూలబడిపోతుంటే, ‘సెంద్రి మామ్మా ఏమయిందే!’ అని ఒకరి తర్వాత ఒకరు అంటూ, ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు పట్టుకున్నారు. కాలనీ ఆడవాళ్ళే. అంబేద్కర్ కాలనీ ఆడవాళ్ళే.

xxx                                          xxx                                          xxx

ఇప్పుడంటే కాలనీ అయింది కానీ, ఒకప్పడది మురికి వాడే. కారణం మురిక్కాలువ. మురికంటే మామూలు మురికి కాదు. ముక్కు మూసుకుని కాని పక్కన నడవలేని కాలువ. కానీ, ముక్కు తెరిచే దాని చెంత యావజ్జీవ తపస్సు చెయ్యటానికి తయారయ్యారు దిక్కు లేని వారు. ఒక్కొక్కరుగా గుడిసెలు వేశారు. దిక్కున్న వాళ్ళూరుకుంటారా? మునిసిపాలిటీ వాళ్ళ నెత్తి మీద కూర్చుని, బుల్డోజర్లను పంపేదాకా వూరుకోలేదు. అప్పుడొచ్చింది పచ్చళ్ళ పోశవ్వ, ‘సూత్తారంటే, అడ్డంగా పడుకోండే!’ అని అరుచుకుంటూ. చంద్రమ్మ నడివయసులో వుంది. పోశవ్వ అరిచిన అరుపుకి చంద్రమ్మే కాదు మురిక వాడ ఆడోళ్ళంతా దొరికింది దొరికినట్టు దూకేశారు. అదేంటో కొంపలు కూల్చే బుల్డోజర్లు పొద్దు పొద్దున్నే వచ్చేస్తాయి. మురికి వాడలో మగమనుషులు అప్పటికింకా నిద్రలేవరు. ఎందుకంటే అందరివీ రాత్రి కొలువులే. సినిమా హాళ్ళల్లో మరుగుదొడ్లను కడిగే ఉద్యోగాల దగ్గర్నుంచి, రాత్రిపూట మాత్రమే పట్టణపు రోడ్ల మీద తారు వేసే ఉద్యోగం వరకూ వీళ్ళవే.  దీనికి తోడు, రాత్రీపగలు కళ్ళు తెరుచుకుని వుండే బస్టాపులూ, రైల్వేస్టేషన్లూ కూడా వీళ్ళకు తగ్గ పనుల్ని కల్పించి ఆదుకుంటాయి. కాళ్ళతో తొక్కే రిక్షాల దగ్గర నుంచి, ఆటోలు నడిపే పనులూ, అక్కడి క్యాంటీన్లలో ప్లేట్లు తీసే వృత్తులూ అన్నీ వీళ్ళవే. అందుకే మురికి వాడ లో సగం మంది మగవాళ్ళు అర్థరాత్రి దాటాక గుడిసెలకు చేరుకుంటారు…తుళ్ళుతూ పేలుతూ మాత్రమే కాదు, తూలుతూ ఊగుతూ. ఒళ్ళు నొప్పులు పోవాలంటే, కడుపులో కాసిన్ని సారా నీళ్ళు పడాలి కదా! మరి ఆడాళ్ళకు రాత్రి పనులుండవా- అంటే అవీ వుంటాయి. రోడ్లే కదా, పట్టణపు వాకిళ్ళు. వాటిని రాత్రిళ్ళే తుడవాలి. ఆపని ఈ మురికివాడ ఆడ వాళ్ళే చేస్తారు. రైళ్ళకూ, బస్సులకు మాత్రమే కాదు, రోగాలకు కూడా రాత్రీ పగళ్లు వుండవు. కాబట్టి ఆసుపత్రుల్లో ఆయాలకు రాత్రి పూట కూడా పని వుంటుంది. అయినా ఆడవాళ్ళు తెల్లవారగానే లేవాలి. ఎందుకంటే, వాళ్ళ బిడ్డలూ, బిడ్డల కడుపులోని ఆకళ్ళూ అంతకుముందే లేస్తాయి. కలో, గంజో పొయ్యటానికి అది పల్లె కాదు, పట్టణం. సాయిబుల కుర్రాడు సైకిలు మీద తెచ్చి అమ్మే చల్లారిన ఇడ్లీలో, అప్పాలో కొనిపెట్టాలి.

కానీ, ధామపట్నం మెయిన్ సెంటర్లో వుండే పచ్చళ్ళ పోశవ్వకీ,  మురికి వాడలోని దిద్దే చంద్రమ్మకీ వుండే అనుబంధం వేరు. అది శనివారం అనుబంధం. అవును. ఆ పట్టణానికి శనివారం సంత. వీళ్ళద్దరూ కలిసేది శనివారమే. సంత మార్కెట్టుకు కూడా వాస్తు వుంటుంది. తూర్పున పండ్లూ కూరగాయలూ, పడమర్న కోడి, మేక మాంసాలూ, ఉత్తరాన ఎండుచేపలూ, పచ్చళ్ళూ, దక్షిణాన ఇతర మాంసాలు. అంటే బీఫ్, పోర్క్ లు వగైరాలు (గొడ్డు, పంది మాంసాలని తెలుగులో అంటే ముతక గా వుంటుందని, ఇలా ఇంగ్లీషులోనే నగరం పలుకుతుంటుంది. తినటానికి లేని సిగ్గు అనటానికి వచ్చి, ఇంకొందరయితే టెర్లిన్, సిల్కు అని వస్త్రనామాలతో పలుకుతుంటారు.)

అలాంటి ఒకానొక బీఫ్ షాపు యజమానురాలు దిద్దే చంద్రమ్మకు, పచ్చళ్ళ దుకాణం పెట్టే నిమ్మనేని పోశవ్వకు గట్టి పరిచయమే ఏర్పడింది. వారిద్దరి వ్యాపారాలే కాదు, జీవితాలు కూడా ఉత్తర దక్షిణాలు. పట్టణం ఒక్కటే. ఇద్దరూ రెండు ఊళ్ళ నుంచి వచ్చారు. కాదు, కాదు ఒకరు ఊరునుంచీ, ఇంకొకరు వాడ నుంచీ. నిమ్మనేని పోశవ్వ ఊరు పొలమూరు. చంద్రమ్మ వాడ వీరవాసరం వెలుపలిది. పోశవ్వ భర్త నిమ్మనేని వాసుదేవరావు కమ్యూనిస్టు పార్టీలో తిరిగాడు. ఉన్న పొలాన్ని అమ్మి పార్టీకే ఖర్చుచేశాడు. పోశవ్వే పాలమ్మీ, పచ్చళ్ళమ్మీ కుటుంబాన్ని నిలబెట్టింది. తర్వాత పట్టణం  వచ్చేస్తే, స్వామీజీ టాకీస్ పక్కన చిన్నజాగా దొరికింది. కానీ, కూలి దొరక్క పట్టణం వచ్చిన చంద్రమ్మ కుటుంబాన్ని మాత్రం మురిక్కాలవే ఆదరించింది.  

అక్కడే ముక్కు తెరిచి తపస్సు చేసేందుకు ఒక్కొక్కరుగా గుడిసెలు వేశారు. అలా ఆచోటు ముందు, మురికి వాడ అయ్యింది. బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తుంటే, కార్మిక సంఘ నాయకుడు నిమ్మనేని వాసుదేవరావూ, ఆయన భార్య పోశవ్వలు జనాన్నేసుకుని వచ్చారు ఎర్రజెండాలతో. బుల్డోజర్లు ఆగాయ కానీ, నిమ్మనేని వాసుదేవరావూ, పోచమ్మలు అరెస్టయ్యారు. అయితేనేం? గుడిసెలు నిలిచాయి. అప్పుడు మురికి వాడ కాస్తా లెనిన్ నగర్  అయ్యింది. అప్పట్లో ప్రతీ గుడిసె మీదా ఎర్రజెండా వుండేది.

ఆ తర్వాత ఎలా వెలిసిందో చర్చి వెలిసింది. అప్పుడు వాళ్ళకి విదేశాలనుంచి దుస్తులు వస్తుండేవి. ఆదివారం పూట తిండి కూడా పెట్టేవారు. దాంతో  ఆ మురికి వాడకు రెండు పేర్లు వచ్చాయి. ఒకటి: లెనిన్ నగర్, రెండు: చర్చిపేట. క్రిస్మస్ రోజుల్లో అవే గుడిసెల మీద పగలు ఎర్రజెండా రెపరెప లాడితే , రాత్రిపూట ఎర్ర నక్షత్రం మిలమిల లాడేది. రెండూ ఎరుపే కానీ, ఒక దానికొకటి పడవు. అయినా గుడిసె వాసులు రెంటినీ వదలుకునే వారు కారు. ఈ లోపుగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళలో పది దాకానో, ఇంటర్ దాకానో చదివి, మళ్ళీ వెనక్కి వచ్చి తండ్రుల వృత్తులు కొనసాగిస్తున్న కుర్రాళ్ళు మురికి వాడ ముందు, విరాళాలు పోగుచేసి, ‘వేలెత్తి చూపించే’ అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టేశారు. ఆ తర్వాత, సరిగ్గా మునిసిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయనగా, ఏలిన వారు ఈ వాడకు ‘అంబేద్కర్ కాలనీ’ అని ఖాయం చేశారు. అంతిమంగా ఆపేరే స్థిరపడింది.

xxx                                          xxx                                          xxx

చంద్రమ్మను పడకోకుండా పట్టుకుంది కాలనీ ఆడవాళ్ళే అయినా, ముఖాన నీళ్ళు కొట్టింది మాత్రం ఈ చోద్యాన్ని దగ్గర నుంచి చూస్తున్న నిమ్మనేని అరుణిమ. అవును. పోశవ్వ కూతురే.

కళ్ళు తెరిచిన చంద్రమ్మ, ‘పోశవ్వా! వచ్చేశావా? ఆణ్ణి తాగనీయ్యొద్దే సెందిరీ అనే దానివి.. నా బాగడు యింక తాగలేడ్లే..’  అంది. అరుణిమ ను చూసి పోశవ్వే అనుకుంది. ‘అచ్చు’ తప్పే. ఎందుకంటే అరుణిమ అచ్చుగుద్దినట్లు తల్లి పోశవ్వలాగే వుంటుంది. తెలివిలో వున్నవాళ్ళకే తప్పని పొరపాటిది. చంద్రమ్మ సగం తెలివిలో వుంది.

xxx                                          xxx                                          xxx

అరుణిమకు నలభయేళ్ళుంటాయి. అమ్మ చేసే వ్యాపారమే. పచ్చళ్ళను అమెరికాలో వున్న తెలుగు వాళ్ళకు పంపిస్తుంటుంది. భర్త బ్యాంకులో ఉద్యోగం. పిల్లల్లేరు. తాను చంటి పిల్లగా వున్నప్పుడు మొదట తండ్రి నిమ్మనేని వాసుదేవరావు తో వెళ్ళేది. అరుణిమ అమ్మను ‘అమ్మా’ అని పిలిచేది కానీ, నాన్నను మాత్రం ‘వాసన్నా’ అని పిలిచేది. ఆయనెప్పుడూ కూలీల బస్తీల్లోనూ, కార్మిక వాడల్లోనూ తిరిగేవాడేమో- అందరూ ‘వాసన్నా’ అనటం విని- తానూ అలాగే పిలిచేది.

‘వాసనొస్తోంది వాసన్నా..!’ అని మొదట  అప్పటి లెనిన్ నగర్ కు వెళ్ళినప్పుడు ఫిర్యాదు చేసింది అరుణిమ ముక్కు మూసుకుంటూ. అప్పటికామెకు ఎనిమిదేళ్ళుంటేయేమో.

‘తప్పురా తల్లీ. అలా అనకు. అలవాటు చేసుకో.’ అని తండ్రి తల నిమరటం తనకిప్పటికీ గుర్తే.  ఆ వాడను ఒక్క వాసన తోనే కాదు, అన్ని ఇంద్రియాలతోనూ గుర్తుపెట్టేసుకుంది. అక్కడ మజ్జిగ ఇస్తే నాలుక జివ్వుమన్న పుల్లని రుచీ, తన అరచేతులకు తగిలిన పగిలి ముతక బారిన వృధ్ధ స్త్రీలక కరప్పర్శా, దగ్గరగా వున్నవుళ్ళతో కూడా వినపడదన్నట్లు పెద్ద పెద్ద అరుపులతో చేసే సంభాషణలూ అలా తన మనసులో ముద్రపడిపోయాయి. ఇక దృశ్యమంటారా? ఒకే ఒక్క సన్నివేశం. అప్పటికామె చంద్రమ్మ అని అరుణిమకు తెలియదు.

నోరు మూసుకుని మాట్లాడుతోంది ఆమె. ముందు ఆమె ఒక్కర్తే అలా చేస్తోందనుకుంది అరుణిమ.

చుప్పుచుప్పు మంటూ పీల్చటమే కాదు, గుప్పుగుప్పు మంటూ వదులుతోంది పొగ. నిప్పులేకుండా పొగరాదు. సరే. నిప్పు లోపల; పొగ వెలుపల. అవును ఆమె పొగను కాదు, నిప్పునే నోట పట్టింది.

కాల్చేది చుట్టే. చిత్రం! నిప్పును మింగి, పొగను వదలుతోంది. దాన్నే అడ్డ చుట్ట అంటారు. చుట్టను వెలిగించాక, ఎర్రగా కాలుకుంటూ వెనక్కి వెనక్కి వెళ్తున్న భాగాన్నే నోట పట్టింది చంద్రమ్మ. పైన అంగుటీ, కింద నాలుకా తాక కుండా, అగ్నిరుచిని అనుభవిస్తోంది. అప్పుడు పలకరిస్తేనే చంద్రమ్మ శాంతంగా మాట్లాడుతుందని పాపం అరుణిమకు తెలియదు కదా!

కాక పోతే ఏ మాటనయినా మొత్తం ‘క’ గుణింతంలోకి మార్చుకుంటోంది.

‘కాకన్నా.. కా.. కూకో.’ అంది తన గుడిసె అరుగు మీద కూర్చున్న చంద్రమ్మ .

‘వాసన్నా.. రా.. కూర్చో’ అని వాసుదేవరావే కూతురుకు అనువదిస్తూ, చిన్న రేకు కుర్చీలాక్కొని, అరుణిమను వొళ్ళోకి తీసుకున్నాడు.

‘కీ..కాకు కావా?’ అంది చంద్రమ్మ పరామర్శగా. వెంటనే వాసుదేవరావు అనువాదం: ‘టీ తాగు తావా?’ అని. విన్న అరుణిమ తండ్రి చెవిలో, ‘భలే. ఆ మాటలేంటో.. ఈ సారి నేన్జెబుతా!’ అన్నది.

‘కోకవ్వ కెకా కుంకీ?’ అంది చంద్రమ్మ. పజిల్ విప్పటానికి సిధ్ధంగా వున్న అరుణిమ లోపల లోపల గుణించుకుంటూ, ‘పో.శ.వ్వ యెలా…వుందీ? రైట్?’ అని పైకి అనేసి నాన్న ముఖం వైపు చూసింది అరుణిమ. ‘కరెక్టే చెప్పావు’ అన్నట్టు పెద్దగా నవ్వి కూతురు తల నిమిరాడు వాసుదేవరావు. చంద్రమ్మ కూడా నవ్వాపుకోలేక, చుట్టను బయిటకు తీసింది. వెలుగుతున్న టార్చిలైట్ లాగానే వుంది.

అరుణిమకు అలా అప్పటి లెనిన్ కాలనీ అలవాటు అవుతూ వచ్చింది. అప్పుడు గమనించింది: అక్కడ చంద్రమ్మకే కాదు. ఎక్కువ మందికి  నోళ్ళు ఖాళీ వుండవు. ఈ విషయంలో ఆడా, మగా తేడా వుండదు. పీల్చటానికో, నమలటానికో, చప్పరించటానికో నోళ్ళను ఎక్కువ వాడుతుంటారు. చుట్ట, తంబాకు. గుట్కా ఏదో ఒకదానితో నోళ్ళను నింపే వుంచుకుంటారు. అన్నిటికీ ఒకే ‘క’ గుణింతం రాదు. ఇతర గుణింతాలు కూడా వస్తాయి. వాటినీ అరుణిమ విజయవంతంగా ‘డీకోడ్’ చెయ్యటం నేర్చేసుకుంది. అక్కడి వాళ్ళు అన్నది వినగలుగుతుంది. పెట్టింది తినగలగుతుంది. కలవగలుగుతుంది.

దిద్దే చంద్రమ్మ వ్రాలు.జీవితంలో మూడోసారి సంతకం చేసింది.  మొదటి సారి కూడా ఇలా కాగితాలు తెచ్చి భర్త బాగయ్య చెయ్యమంటే చేసింది. తాను పోతే డబ్బు పొందే వారి పేరు (నామినీ) దగ్గరే అప్పుడూ చేసింది. కానీ ఆ విషయం ఆమెకప్పుడు తెలీదు.ఇప్పుడు చంద్రమ్మకు భర్తా వుండడు, మార్కెట్లో దుకాణమూ వుండదు. అక్కడ అప్పిచ్చినవాడే వచ్చికూర్చుంటాడు.  మూడో సంతకం చేశాక చంద్రమ్మకూడా బాగయ్యలాగా మారిపోయింది. కాకపోతే చంద్రమ్మ బతికున్న దేహం అంతే.

‘తాగేవీ, పీల్చేవీ, నమిలేవీ, చప్పరించేవీ- వాళ్ళతో మాన్పించాలి కానీ, మనం అనుకరించకూడదు’ అని తన కూతురుకి చట్టబధ్ధమైన హెచ్చరిక చేశాడు వాసుదేవరావు.

‘మానమని చెప్పొచ్చు కదా వాసన్నా!’ అది ఒక సారి తండ్రితో అరుణిమ.

‘చెప్పటం వేరు. నచ్చచెప్పటం వేరు తల్లీ! మొదటిది బోధన, రెండవది సంస్కరణ. నేను బోధించగలను కానీ, సంస్కరించలేను.’ అన్న తండ్రి మాట పూర్తి అర్థం ఆయన చనిపోయాక కానీ అరుణిమకు బోధపడలేదు.

బోధించేపని ‘రాత్రి బడి’ ద్వారా పూర్తి చేశాడు వాసన్న. వయోజన విద్య. మొక్క మానయ్యాక వంచే పని. అప్పుడు ఓ పట్టాన చదువు లొంగదు. అయినా రోడ్డు మీదే వీధి దీపం కిందే పాఠశాల తెరిచాడు వాసన్న. కానీ ఈ ‘విద్వద్దీపం’ చుట్టూ ఆడపురుగులే చేరేవి. ఒక్క మగ పురుగు కనిపిస్తే వొట్టు. ఎలాగూ సగం మగమనుషులు అర్ధరాత్రి దాటాక కాని ఇళ్ళకు చేరుకోరు. మిగిలిన వాళ్ళున్నా మత్తులో వుంటారు.

‘అ- అమ్మ’ అని వాసన్న వీధి దీపం కింద నిలబెట్టిన నల్లబల్ల మీద రాసి, అందరిచేతా పలికిస్తుంటే- మత్తులో వున్న మగమనిషి ఒకడు భోరున ఏడ్వటం- నాన్న పక్కనే వున్న అరుణిమ చెవులారా విన్నది. ‘ఏమయిందయ్యా?’ అనడిగితే ‘సచ్చిన నా యమ్మ గేపకమొచ్చింది వోసన్నా!’ అని భుజం మీద వున్న కండువాతో కళ్ళు తుడుచుకుంటూ లేచి తూలబోయాడు. అమ్మ గుర్తుకు రావటానికి- కొట్టిన రమ్మే కారణం కానీ, రాసిన అక్షరం కాదని- తర్వాత వాసన్నఅరుణిమతో చెప్పాడు. ఇప్పుడు చనిపోయి అంబులెన్స్ ఎక్కుతున్న దిద్దే బాగయ్య అతడేనని స్ఫురణకొచ్చి నవ్వుకుంది. ఒక్కొక్కసారి మెదడు కూడా మోసం చేస్తుంది. కళ్ళల్లోకి నీళ్ళు పంపటానికి బదులు, పెదవుల మీదకు నవ్వును పంపుతుంది.

రాత్రిబడిలో మొదటి వరసలో కూర్చునేది మాత్రం భాగయ్య భార్య దిద్దే చంద్రమ్మ. ఆమె వెంట తన చిన్న కూతురు ఫ్లారెన్స్ ను తెచ్చుకునేది. అరుణిమ వయస్సే ఆమెది కూడా. తరగతి కూడా నాలుగే. కానీ చదివే స్కూళ్ళే వేరు. పలక మీద రాసిచ్చిన అక్షరాలను దిద్దుతున్నారో లేదో అని తనిఖీ చేసే పనిని అరుణిమకూ, ఫ్లారెన్స్ కూడా అప్పగించేవాడు వాసన్న. చేతిలోనే బలపమే కాదు, చేతి వేళ్ళే అరిగిపోయేలా దిద్దేసేది దిద్దే చంద్రమ్మ. ‘దిద్దింది చాలే..’ అంటూ వెళ్ళి, పలక తుడిచి, తర్వాత అక్షరాలు రాసి ఇచ్చేది  ఫ్లారెన్స్. ‘ వో లమ్మో.. గుడ్డొచ్చి పిల్లనెక్కరిత్తిందే..’ అని ముసిముసి నవ్వులు నవ్వుకునేది చంద్రమ్మ. ‘కాదెహే.. బిడ్డొచ్చి తల్లినెక్కిరిత్తెందే.. సెంద్రిదానా!’ అనే వాడు, ఆ పక్కనే అరుగుమీద కూర్చుని బీడీ కాలుస్తున్న ఆమె భర్త బాగయ్య.

అలా కలిసిన అరుణిమ, ఫ్లారెన్సులు ఆరో తరగతి నుంచి క్లాస్ మేట్స్ అయిపోయారు. ఒకటే హైస్కూలు. ఒకటే తరగతి. అలో పదోతరగతి వరకూ చదివేశారు. అరుణిమతో కూడా ఫ్లారెన్సు పదో తరగతి పాసయింది. అప్పుడు మళ్లీ కాలేజీలు వేరయిపోయాయి.

ఈ లోగా అరుణిమ తండ్రి వాసన్న చనిపోయాడు. తల్లి పోశవ్వే, తండ్రి స్థానాన్ని పూర్తి చేసింది. పోశవ్వ పేరు పట్టణాల్లో వున్న బస్తీల్లోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళలోకూడా మార్మోగింది. వాసన్న ఆయా చోట్ల ఆడంగులకి అక్షరాలు చెప్పి వదిలేస్తే. పోశవ్వ అంకెల్ని నచ్చ చెప్పింది. అప్పుడు అరుణిమకు తన తండ్రి కన్నా, తన తల్లి ఎలా ఎక్కువో- అర్థమయ్యింది. నాన్న చెప్పిన మాటలే:  చెప్పటం బోధన, నచ్చచెప్పటం సంస్కరణ. అమ్మ సంస్కర్త అయ్యింది. చెప్పటానికి అక్షరాలు. నచ్చచెప్పటానికి అంకెలు:

100+100=200. ఇది కూడిక.

200-80=120.  ఇది తీసివేత.

మొదటిది కూలి లెక్క. రెండవది సారా లెక్క.  మొదటిది ‘రెక్కల’ లాభం. రెండవది ‘చుక్కల’ నష్టం.

ఇంట్లో ఆడా, మగా ఇద్దరి రెక్కల కష్టం రు.200. అందులో మగాడి సారా ఖర్చు రు.80. చుక్కల నష్టాన్ని ఆపేస్తే. బిడ్డల కడుపాకలి తీర్చవచ్చు. అదే తల్లి పోశవ్వ అన్ని చోట్లా చెప్పే పాఠాలు. ఇది పోశవ్వ సొంత పాఠం కూడా కాదు. ఎక్కడో నెల్లూరులో రోశమ్మ రాష్ట్రం మొత్తానికి చెప్పిన పాఠం. దానినే ధామ పట్నం పరిసర గ్రామాల్లో  నిమ్మనేని పోశవ్వ ప్రచారం చేసింది. నచ్చచెప్పింది. అందుకే పోశవ్వను ధామపట్నం రోశమ్మ అనేవారు. లెక్క ఆడవాళ్ళకే ఎక్కింది. మగవాళ్ళకు మాత్రం కిక్కు ఎక్కినంత సులువుగా లెక్క ఎక్కేది కాదు. దాంతో అన్ని చోట్లా సారాదుకాణాల మీద ఆ దాడులు చేశారు. ఒక్క లెనిన్ నగర్ లో తప్ప. అవును. తల్లి పోశవ్వ లెక్క అక్కడే తప్పింది. అక్కడ మాత్రమే సంస్కర్తగా విఫలమయ్యింది.

దిద్దే చంద్రమ్మ కుదరదంటే కుదరదన్నది. అక్షరాలు దిద్దిన చంద్రమ్మే. అంకెలతో పేచీ పడింది. మొదటిది కూడికే కాదన్నది. అందుకు చంద్రమ్మ మినహాయింపులు చంద్రమ్మకున్నాయి:

నడి రోడ్డు మీద మోరీ మూత తెరిచి నిలువునా డ్రెయన్లో దిగే పనివాడికీ,

చచ్చిన గొడ్డును కోసి చర్మం వలిచే కూలివాడికీ ,

సినిమాహాళ్ళల్లోమరుగుదొడ్లను అనునిత్యం శుభ్రం చేసే జీతగాడికీ,

నీళ్ళల్లో ఉబ్బి కుళ్ళిన శవాన్ని వెలికి తీసే గజఈతగాడికీ,

దానిని కాల్చిపెట్టే కాటిదగ్గర కాపలావాడికీ, 

సారా సారా కాదని చంద్రమ్మ నమ్మకం.

ఆమె దృష్టిలో సారా అంటే, పని పూర్తయ్యాక గొంతు తడుపుకునే ద్రవం కాదు, పనిలోకి దించే ఇంధనం. అందరిలాగా కాఫీ తాగో, టీ తాగో, అ పనుల్లోకి దిగలేరు. చుక్క పడాల్సిందే. లేకుంటే చుక్కలు కనపడతాయి.

కాబట్టి వూళ్ళల్లో  ఏది తీసివేతో, మురికి వాడల్లో అదే కూడిక.

‘పోసవ్వా.. ఆ మందే లోపల పడ్లేదనుకో.. సేతిలోకి వందెలా వత్తాదీ?’ పోశవ్వ ఒప్పుకోక పోయినా, ‘లాజిక్కే కదా?’ అనిపించింది అంత చిన్నప్పుడే అరుణిమకు.

నిజానికి సారాకున్న ‘సైడ్ ఎఫెక్టు’ పోశవ్వకన్నా చంద్రమ్మకే బాగా తెలుసు. చంద్రమ్మ భర్త బాగయ్య తన పనిని ‘చుక్క’తో మొదలు పెట్టి, ‘చుక్క’తోనే ముగిస్తాడు. నిలువెత్తు ఎద్దునో, దున్ననో లొంగదీసి, అడ్డంగా నరికే పని కేవలం కత్తులతోనూ, కటారులతోనే కాదు. ‘చుక్క’ తోడుండాల్సిందే. పని ముగించుకుని ఇంటికొచ్చిన బాగయ్య, ప్రతి రాత్రీ ఒకలాగా వుండడు:

ఒక రోజు కళ్ళ నీళ్ళు కార్పించే ప్రేమికుడి లా వుంటాడు. ఇంకోరోజు కళ్ళు తెరిపించే తాత్వికుడిలా వుంటాడు. మరో రోజు ‘భూమి మాత్రమే కాదు, గుడిసె కూడా గుండ్రంగా వుంద’ని నిరూపించే శాస్త్రజ్ఞుడిలా వుంటాడు. అంటే కర్రతీసుకుని, చంద్రమ్మను గుడిసె చుట్టూ తిప్పి కొడుతుంటాడు. ‘సేపలు యిగురెట్టమంటే, యేపుడు సెయ్యమని యెవడు సెప్పాడే.. నీ యవ్వ..!’ అదీ బాగయ్య కోపానికి కారణం. ఈ మాత్రం దానికే భూగోళశాస్త్రం బోధించాలా.. అంటే సమాధానం చంద్రమ్మకే కాదు, చంద్రమ్మ చిన్న కూతురు ఫ్లారెన్స్ కు కూడా తెలీదు.

అయినా సరే, ఆ పేటలో సారా బందు పెట్టటానికి చంద్రమ్మ ఒప్పుకోలేదు. సారా బందయితే పనే బందు. బువ్వే బందు. అలా అనేసుకుంది చంద్రమ్మ.

నిజంగానే సారా నిషేధిస్తూ సర్కారు ఉత్తర్వు తెచ్చినప్పుడు, లెనిన్ నగర్లోని చాలా ఇళ్ళల్లో పొయ్యిలే వెలగలేదు. ఇక బువ్వెక్కడొస్తుందీ? ఈ పస్తులు కొన్నాళ్ళే. ఎందుకంటే మూసిన ప్రతీ బారుకీ పక్కదారి వుంటుంది. కానీ సారా ధరకు రెట్టింపు ధర వుంటుంది దొంగసారాకి. కానీ  తమపనులకి అదే ఇంధనమాయె! గొంతు తడుపుకునే ఇంధనపు ఖర్చు పెరిగిపోతే, చేతిలో పడే ధనం తరిగి పోదూ..?

‘సదుంకుంటే పేట దాటొచ్చు. ఆ దినాలొచ్చేదాకా.. మగోడికి సారా పడాలి. ఆడది తాగొచ్చిన మొగుడి దెబ్బలు పడాలి. పడకుండా ఎదురుతిరిగితే బిడ్డల ఎండు డొక్కల్ని సూడాలి.’ అని చంద్రమ్మ అనుకునేదీ, పైకి అనేది కూడా. అప్పటికే చంద్రమ్మ ముగ్గురి కూతుళ్ళకి ఆ పేటలో కుర్రాళ్ళ కిచ్చి పెళ్ళిచేసింది. వాళ్ళు తన కళ్ళ ముందే తాగొచ్చి,  కూతుళ్ళును కొడుతుంటే, ‘నోరేసుకుని పడేదే’ తప్ప, చేతుల్తో అడ్డుకోలేక పోయేది. బాగయ్యొచ్చి అల్లుళ్ళ మీద తిరగబడేవాడుకానీ, అతడి శక్తి సరిపోయేది కాదు. అప్పుడు బాగయ్యే తీర్మానం చేసుకున్నాడు:  ‘యీ పేటలోని యే నాకొడుక్కీ నా సిన్నకూతుర్నివ్వను.’ అని.

అన్నట్టుగానే ఇంటర్ దాకా చదివిన ఫ్లారెన్స్ కు ఏకంగా బెజవాడ సంబంధమే చూశాడు. ‘బాగా సదుంకున్నోడు. కరెంటాపీసులో ఉజ్జోగం’ అంటే ఘనంగా పెళ్ళిచేశారు. ఫ్లారెన్సును అరుణిమను పెళ్ళినాడే చివరి సారి చూసింది. తర్వాత అడ్రసు తీసుకుని ఉత్తరం రాయాలనుకుంది కానీ, తన పనుల్లో పడి అశ్రధ్ధ చేసేసింది అరుణిమ.

xxx                                          xxx                                          xxx

‘ఇవాళ వస్తుంది ఫ్లారెన్స్. పాపం. దానికి వాళ్ళమ్మంటే ప్రాణం. చనిపోయిన తండ్రినయినా చూడగలదేమోకానీ, విలవిల లాడే తల్లిని మాత్రం చూడలేదు.’ అనుకున్నది అరుణిమ ఆసుపత్రి ముందు. తనకూ అలాగే జరిగింది. నాన్నపోయినప్పుడూ, అమ్మపోయినప్పుడూ- ఇంక ఈ ప్రపంచంతో నాకు పనేమిటి- అనిపించింది. ఎవరు ఎన్నయినా అనుకోవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం:  చూసిన ప్రతిసారీ శుధ్ధమైన ప్రేమను ప్రసరించేవి -రెండు రెళ్ళు- నాలుగు కళ్ళే. అవే అమ్మానాన్నల కళ్ళు. ఫ్లారెన్సుకు కనీసం అమ్మవి రెండయినా మిగిలాయి. తనకవీ లేవుగా. అమ్మకూడా వెళ్ళిపోయిందిగా.  ఫ్లారెన్సు వచ్చాక, తాను ఫ్లారెన్స్ ను కాదు, ఫ్లారెన్సే తనను ఓదారుస్తుందేమో!

చంద్రమ్మను ఆసుపత్రి ముందే బెంచీ మీద కూర్చోబెట్టాక, అరుణిమకు అలా అనిపించింది. కొద్దిసేపటికి చంద్రమ్మను కూడా భర్త బాగయ్య వున్న అంబులెన్స్ ఎక్కించారు ఆ పేట ఆడవాళ్ళు.

అరుణిమకు అక్కడనుంచి వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించలదే. చంద్రమ్మ తనలో తన తల్లి పోశవ్వను చూసినందుకయినా వాళ్ళ కాలనీకు వెళ్ళాల్సిందే అనుకుంది. బ్యాంకులో వున్న తన భర్తకు ఫోన్ చేసి, విషయం చెప్పి, మోపెడ్ మీద బాగయ్య శవం వున్న వాహనాన్ని వెంబడించింది.

మురికంటే మామూలు మురికి కాదు. ముక్కు మూసుకుని కాని పక్కన నడవలేని కాలువ. కానీ, ముక్కు తెరిచే దాని చెంత యావజ్జీవ తపస్సు చెయ్యటానికి తయారయ్యారు దిక్కు లేని వారు. ఒక్కొక్కరుగా గుడిసెలు వేశారు. దిక్కున్న వాళ్ళూరుకుంటారా? మునిసిపాలిటీ వాళ్ళ నెత్తి మీద కూర్చుని, బుల్డోజర్లను పంపేదాకా వూరుకోలేదు.

చాలా కాలమయ్యింది అరుణిమ ఆ కాలనీకి వచ్చి. చంద్రమ్మ మారలేదు కానీ, చంద్రమ్మ గుడిసె మారింది.  కాలానుగుణంగా తన కప్పునూ, నేలనూ మార్చుకుంది. పైన సిమెంటు రేకూ, కింద నాపరాయా వచ్చాయి. ఇంటి ముందు చిన్నవరండా. వరండా దిగితే అదే రోడ్డు. కాకపోతే సిమెంటు రోడ్డు. ఆ వరండామీదే ఫ్రీజర్ లో పెట్టారు బాగయ్య మృతదేహాన్ని. చీల్చి కుట్లు వేశారేమో, ముందే నీళ్ళతో కడిగేసి, ఆ దేహానికి తెల్లని అంగీ తొడిగేశారు.

అక్కడే పెళ్ళాడేసి, ఒక్కొక్కరూ అరడజనుకు తక్కువ కాకుండా పిల్లల్ని కనేసిన కూతుళ్ళు,  బావురుమంటూనే అమ్మ చంద్రమ్మకు సపర్యలు చేశారు. పేట పేటంతా సిమెంటు రోడ్డెక్కేసింది. రోడ్డంటే రోడ్డుకాదు. అది ఆ పేటకు ఉమ్మడి వాకిలి. అటూ,ఇటూ ఇళ్ళే. బంధుత్వంతో పనిలేకుండా, ఆడాళ్ళంతా విడతలుగా ఏడుస్తున్నారు.

‘బాగి మామకు నాను ఆపడితే సాలు- బువ్వ తిన్నావా పిల్లా..?’ అని అడిగేవోడు అని పడుచు పిల్ల  ఏడిస్తే, ‘ముసిల్దాన్లా ఆ సింపిరి జుట్టేంటే..? దువ్వుకోయే రాచ్చసీ..అని ఎకసెక్కాలాడేవోడు బాగి బాయ్య..’  అంటూ మధ్యవయసావిడ లబోదిబో మంది. ‘నాలాగా ఉక్కుమడిసి ఆడు. కట్టమొత్తే జంకడు. ఆడు సచ్చిపోటమేంటే.. నిజం సెప్పండే ముండల్లారా..’ అంటూ ఇంకో వృధ్ధురాలు తూలుతూ కూడా చేతిలో వున్న కర్రను విసిరేసింది.

అరుణిమ వీటన్నింటినీ, చెవుల్తో కదా వినాలీ? కానీ ముక్కుతో విన్నది. వాసన! అది ఘాటెక్కిన దుఃఖం!! అక్కడి ఆడవాళ్ళు కూడా, మగాళ్ళకు ఏమాత్రం తీసిపోకుండా, భయంవేసే పనులూ, వొళ్ళు గగుర్పొడిచే వృత్తులూ చేస్తారు: విసర్జనాలను చేతుల్తో తీసేపనులూ, నెత్తుటి గుడ్డల్నిఉతికి పెట్టేపనులూ గొప్పవేం కావుగా? ఆ పనులకు వెళ్ళేటప్పుడు కూడా సారాకు ఎగబడని ఆడవాళ్ళు, దుఃఖంలో మాత్రం తాగుతున్నారు.

మరణం ఒక అద్దం లా వుంది వాళ్ళకి. చచ్చిన మనిషి జీవితంలో తమ బతుకుల్ని వెతుక్కుని మరీ కుములుతున్నారు. అక్కడి మగాళ్ళలాగా వీళ్ళూ ఇలాగే రోజూ తాగి కష్టాన్ని వదిలించుకోవచ్చు కదా! చంద్రమ్మ వాదనే వాళ్ళది కూడా:  తాము కూడా తాగేస్తే, బిడ్డలేం తినాలి? ఎంతయినా అమ్మలు కదా వాళ్ళు?

దాచుకున్న యేళ్ళ దిగులుని, ఇలా చావుల దగ్గరే దించుకుంటారు కాబోలు. ‘ఏడ్వండమ్మా, ఏడ్వండి. గుండెలు తేలిక పడేలా ఏడ్వండి.’ అనుకుంది అరుణిమ మనసులో. ఎప్పుడూ తాగే మగాళ్ళు మాత్రం  ‘ఆడికి టైమొచ్చింది యెల్లిపోయాడు. మనకెప్పుడొత్తుందో?’ అని నిబ్బరంగా ఊగుతున్నారు తప్ప, ఏడ్వటం లేదు. కాకుంటే తలో కొంతా వేసుకుని, పేట పేటంతటికీ మందూ తిండీ చూస్తున్నారు, పొద్దున్న పూడ్చే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు.

ఫ్లారెన్స్ వచ్చికూడా ఇలా యేడ్చి తేలికపడుతుంది కాబోలు అనుకుంది అరుణిమ. అర్థరాత్రి అయ్యేదాకా అక్కడే వుంది. ఫ్లారెన్స్ రాలేదు. అడిగితే ‘సిన్నదానిక్కూడా కబురెట్టాం. వచ్చేత్తాది’ అని మాత్రమే చెప్పారక్కడ. అరుణిమ పట్నం సెంటర్లోని తమ ఇంటికి వెళ్ళిపోయింది. స్నానం చేసి పడుకుంది. కానీ, పొద్దున్నే లేచి పోయింది. అంతవరకూ నిద్రపోయిందీ, లేనిదీ తనకే తెలీదు. మరపూ, జ్ఞాపకాల మిశ్రమంలాగా సగం మెలకువా, సగం నిద్రా. ఉదయం ఎనిమిది గంటలకెల్లా అంబేద్కర్ కాలనీకి వచ్చేసింది అరుణిమ.

‘బాగ్గాడితో మనమూ పోలేం గా.. సెయ్యాల్సింది సూడండి’ అన్నారు అక్కడి ముసిలాళ్ళు.

‘సిన్నదాన్ని రానియిండ్రా.. మీకు పున్నెముంటాదీ..’ అంది ఏడ్చిఏడ్చి ఎర్రబడ్డ కళ్ళతో చంద్రమ్మ.

‘అదెక్కడొత్తాదే..? దాని మూలంగానే నీ మొగుడికీ గతొచ్చింది.. సదువో సదువని ఓ లచ్చా.. పెల్లోపెల్లని రొండు లచ్చలూ దాని మీదే కదే తగలేసారు..? సిన్నదొత్తాదంటా… సిన్నది..!!’ అని పెద్ద కూతురు ఏడుపాపకుండానే తల్లి చంద్రమ్మ మీద  మూలగాల్సింది మూలిగేసింది.

ఎంత చూసినా ఫ్లారెన్సు రాలేదు కానీ, ఖాకీ దుస్తుల్లో వున్న పోలీసు కానిస్టేబులూ,  సాదా దుస్తుల్లో ఇంకో ఉద్యోగీ వచ్చారు. ఎందుకో వాళ్ళు అటూ ఇటూ చూసి, అరుణిమ దగ్గరకి వచ్చారు.

‘చనిపోయిన దిద్దే బాగయ్యకు మీరేమవుతారు?’ అని అడిగాడు సాదా దుస్తుల్లో వున్న వ్యక్తి, తన్నుతాను పరిచయం చేసుకుంటూ.

‘ఏమీ కాను. వాళ్ళ చిన్నమ్మాయికి ఫ్రెండును. ఏమిటీ? చెప్పండి!’ అంది మనుషులు పెద్దగా లేని వైపుకు వాళ్లను తీసుకు వెళ్తూ.

అప్పుడు కానిస్టేబుల్ అందుకున్నాడు: ‘ఏం లేదు మేడమ్.  మొన్న రాత్రి యాక్సిడెంటెలా జరిగిందో మీకు తెలీదనుకుంటా. బాగయ్య మార్టేరు నుంచి మోపెడ్ మీద వస్తంటే, సరిగ్గా జిన్నూరు దగ్గర కాల్వలో పడిపోయాడు. ముందు ఏ లారీయో కొడితే పడిపోయాడనుకున్నాం. కానీ అతనే మోపెడ్ను రోడ్డనుకుని, కాల్వలోకి పెట్టేసాడు. పొద్దుటేలగ్గాని శవాన్నెవరూ చూడ్లేదు. కేసు కట్టి పోస్ట్ మార్టమ్ కు పంపాం, రిపోర్టొచ్చింది. బాగా తాగి మొపెడ్ నడుపుతున్నాడు. ’ అని.

‘ఇప్పుడేమంటారూ?’ అడిగింది అరుణిమ.

‘ఆయన రెండు లక్షలకి లైఫ్ ఇన్సూరెన్సు తీసుకున్నాడు. ఇప్పుడా ఎమౌంటు రాదు. ఎందుకంటే. హి వజ్ ఇన్ డ్రంకెన్ స్టేట్. కాకపోతే కట్టిన ప్రీమియంల మొత్తం మూడు వేల రూపాయిలూ పోలీసు క్లియరెన్సు ఇచ్చాక పంపుతాం. కాస్త చంద్రమ్మగారిని పిలుస్తారా?’ అన్నాడు సాదా దుస్తుల్లో వున్న ఇన్సూరెన్సు ఉద్యోగి. 

అరుణిమ చొరవ చూపి, చంద్రమ్మకు చెవిలో చెప్పాల్సిందిచెప్పి, కానిస్టేబులూ ఇన్సూరెన్సు ఉద్యోగి వున్న చోటుకు తీసుకొచ్చింది.

‘ఆ ముందు రేత్తిరే.. సెందిరి దానా.. నా కట్టాలు నీ కొద్దే.. సిన్నదాని పెల్లికి నువ్వు మన సాపు మీద రెండు లచ్చలు  తెచ్చవా.. ఆ అప్పు తీరిపోద్దే.. సూత్తావుండు.. రొండు రోజుల్లోనే.. అన్నడియ్యా నా దేవుడు.. ఇదుగో ఇలా దేవుడి కాడికి ఎల్లిపోయాడు.’ అని భోరుమంది కురిసి వెలిసిన వాన, మళ్ళీ కురిసినట్లు.

అప్పుడు ఇన్సూరెన్సు ఉద్యోగి భారంగా నిట్టూర్చి, అరుణిమ వైపు తిరిగి, ‘మేడమ్.. ఇలాగే ఇన్సూరెన్స్ కంపెనీలను చీట్ చెయ్యాలనుకుంటారు. తాను లారీ కింద పడి చనిపోతే, యాక్సిడెంటుగా రాసుకుంటారనుకున్నాడు బాగయ్య. అప్పుడు రెండు లక్షలూ తన భార్యకు వచ్చిపడిపోతాయనుకున్నాడు.’ అన్నాడు.

‘మేమూ ముందు లారీ, మోపెడ్ ను కొట్టిందనే కేసు రాసుకున్నాం. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది, తాగి మోపెడ్ నడిపాడని..,’ అని కానిస్టేబుల్ అంటూనే వున్నాడు. ఈలోపుగానే,

‘నువ్వు సచ్చి, నన్ను బతికిద్దామనుకున్నావా.. బాగయ్యా..’ అంటూ కూలబడిపోయింది చంద్రమ్మ.  అరుణిమ తన కొంగుతోనే  కళ్ళనీళ్ళు తుడిచి, ఆ పూటకోసమే అద్దెకు తెచ్చి రోడ్డు మీద వేసిన ప్లాస్టిక్ కుర్చీల్లో ఒక దాని మీద చంద్రమ్మను కూర్చోబెట్టింది అరుణిమ.

ఇన్సూరెన్సు ఉద్యోగి గట్టి అట్టతో వున్న ఫైలు తెరచి, ఆమె వొళ్ళో పెడుతూ ఆమె చేతికి పెన్ను ఇచ్చాడు. ఎప్పటిలాగే అయిదు వేళ్ళతో కత్తిని పట్టినట్టే కలాన్ని పట్టింది:

దిద్దే చంద్రమ్మ వ్రాలు.

జీవితంలో మూడోసారి సంతకం చేసింది.  మొదటి సారి కూడా ఇలా కాగితాలు తెచ్చి భర్త బాగయ్య చెయ్యమంటే చేసింది. తాను పోతే డబ్బు పొందే వారి పేరు (నామినీ) దగ్గరే అప్పుడూ చేసింది. కానీ ఆ విషయం ఆమెకప్పుడు తెలీదు.

ఇప్పుడు చంద్రమ్మకు భర్తా వుండడు, మార్కెట్లో దుకాణమూ వుండదు. అక్కడ అప్పిచ్చినవాడే వచ్చికూర్చుంటాడు.  మూడో సంతకం చేశాక చంద్రమ్మకూడా బాగయ్యలాగా మారిపోయింది. కాకపోతే చంద్రమ్మ బతికున్న దేహం అంతే.

ఆ తర్వాత అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి. చెక్క సమాధి పెట్టె లో బాగయ్యను పెట్టారు. పాస్టరు వచ్చాడు. మురికి వాడ కోసమే మురికి కాలవకు ఆవలి వైపున వున్న స్మశాన వాటికలో జిల్లేడుచెట్టు పక్కన పాతి పెట్టారు.  మట్టి సమాధి మీద పూల దండ పేర్చారు.

అతి భారంగా పట్నం సెంటర్లోని తన ఇంటికొచ్చేసింది. ఇంకా స్నానం కూడా చెయ్యలేదు. ఈ లోగా మొబైల్ మోగింది. కాల్ లిఫ్ట్ చేసింది. అటు వైపు నుంచి మాట లేదు. కాస్సేపటికి చిన్నగా ఏడుపు.

‘.. నేనే అరూ.. ఫ్లారెన్సుని..!’ అతికష్టం మీద మాట్లాడింది.

‘ఏయ్.. ఫ్లారెన్స్.. ఎక్కడున్నావే?’

‘ఇక్కడే.. మా నాయన దగ్గర..’

ఫ్లారెన్స్ సమాధానానికి అరుణిమకు కాస్సేపు బుర్ర పనిచెయ్యలేదు. పనిచెయ్యటం మొదలు పెట్టాక భయం వేసింది. తండ్రిపోయిన దుఃఖంలో ఏ అఘాయిత్యానికి పాల్పడుతోందనని గాభరా పడింది.

‘ఏయ్…ఏయ్… అంతపని చెయ్యకు. నేనొస్తున్నానుండు. ఎక్కడున్నవావో సరిగా చెప్పు.’

‘.. చెప్పాను కదటే.. నాయన దగ్గరే.. నాయన సమాధి దగ్గరే..’

‘పది… ప..పది నిమిషాల్లో అక్కడుంటాను.’ అంది అరుణిమ.

వాయువేగంతో కాదు, వాక్కు వేగంతో అక్కడికి చేరుకుంది. అక్కడి సన్నివేశం చూసి అవాక్కయింది. బాగయ్య సమాధి కనపడటంలేదు. దాని మీద బోర్లా పడుకుని కమ్మేసి వుంది ఫ్లారెన్సు.

‘ఏయ్ పిచ్చిదానా.. లే!’ అని లేపింది అరుణిమ.

తడిసి కూడా చింత నిప్పుల్లా వున్నాయి ఫ్లారెన్సు కళ్ళు.

‘ఒక్క గంట.. ఒక్క గంట ఆపలేక పోయారే.. బస్సులోంచి ఫోన్లు మీద ఫోన్లు కొడుతూనే వున్నాను…ఒక్కర్తి విన్లేదు.. నా కోసమే సచ్చిపోయాడే మా నాయనా..’  అని అరుణిమను హత్తుకు పోయింది ఫ్లారెన్స్.

‘తెలుసు. నువ్వు సుఖంగా వుండాలనే కదా- మీ నాన్న అంత చేశాడు? లక్షలు ఖర్చయినా గవర్నమెంటు ఉద్యోగికిచ్చి పెళ్ళి చేశాడు?’ అంది అరుణిమ.

‘గవర్నమెంటు ఉద్యాగా? వాడా?’ అంత దుఃఖంలోనూ వెకిలిగా నవ్వింది ఫ్లారెన్సు.

‘ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మంట్ లో జాబంటే  అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కదా?’

‘అరూ.. నేనూ ముందు అలాగే అనుకున్నాను. బెజవాడ కాపురానికి వెళ్ళాకే తెలిసింది. వాడు పనిచేసేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో కాదు, ఎలక్ట్రికల్ క్రెమటోరియంలోనని.’ ఫ్లారెన్సు గుట్టువిప్పింది.

‘అంటే..?’ షాకయ్యింది అరుణిమ.

‘అంటే ఏముందీ? కరెంటు తో శవాల్ని తగలెట్టటం. రామేశ్వరమెళ్ళినా, శనీశ్వరం తప్పలేదంటారే.. అలాగయింది నా బతుకు. ఆ మాత్రం కాటి కాపర్లు మా పేటలో లేరేంటీ? నేను చదువుకుని ఏం లాభం? ’ అని మళ్ళీ కుమిలింది ఫ్లారెన్సు.

భూమే కాదు, భూమ్మీద వున్న చంద్రమ్మ గుడిసే కాదు, అందులో వున్న బతుకులూ గుండ్రమే. బయిలు దేరిన చోటకే తిరిగొస్తుంటాయి.

——————————

One thought on “చంద్రమ్మ వ్రాలు

  • పట్టుపోగుల పవన్ కుమార్ B.tech

    కథ చదువుతుంటే చాలా బాధగా ఉంది సతీష్ సర్, వూరి వెలుపల ఉన్న వాళ్ళ కష్టాల్ని గుర్తు చేశారు,వారే లేకుంటే ప్రజలందరి ఆరోగ్యం చాలా ఘోరంగా ఉండేది.వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం. రోగం వచ్చిన తరువాత వైద్యుడి దగ్గరికి వెళ్తారు. ఆ రోగం రాకుండా మన ఇంటి బయట కాలువలు,రోడ్లు,చెత్త కుండీలు,డ్రైనేజ్ కెనాల్స్ అన్ని వారే శుభ్రం చేస్తారు. అందువల్లే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు.వారిని గౌరవించడం ప్రతిఒక్కరి అదృష్టంగా భావించాలి.వారు లేని ఇన్ని సంవత్సరాల జీవితం ఊహించుకోలేG,వారందరికి నా పాదాభివందనం తెలియచేసుకుంటున్నాను.వూరి వెలుపల వారి బతుకులు బాగుండాలని మీరు పడుతున్న తపన వర్ణించలేను సర్.నేను డా బిఆర్ అంబేద్కర్ గారిని చూడలేదు కానీ, నేను సతీష్ చందర్ గారిని చూస్తున్నాను అని నేను ఎప్పుడూ సంతోషపడతాను సర్, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సతీష్ చందర్ సర్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *