ఓడి దిగనన్న దీదీ! గెలిచి పోరాడిన దళపతి!
బెంగాల్ కు భంగపాటు : తమిళనాడుకు తడబాటు
ఓడిన వారు గద్దె దిగటంలేదు. గెలిచిన వారు గద్దె ఎక్కటం లేదు. ఇది వింత భారతం. అయిదు రాష్ట్రాల ఎన్నికల భారతం. ఎన్నికలు (2026) జరిగింది అయిదు రాష్ట్రాల్లో అయినా, ఫలితాల వచ్చాక కూడా ఉత్కంఠ వీడనిది రెండు రాష్ట్రాలలో. ఒకటి: పశ్చిమ బెంగాల్. రెండు: తమిళ నాడు. మొదటిది వోట్ల రగడ. రెండవది సీట్ల వివాదం. గద్దె దిగకుండా వున్నది మమతా బెనర్జీ. గద్దె ఎక్కకుండా వున్నది జోసప్ విజయ్ చంద్రశేఖర్ ఉరఫ్ విజయ దళపతి. ఈ ఉత్కంఠ వారం నడిచింది. రెండు ముఖ్యమంత్రి పీఠాలే. అంతిమంగా మమత దిగటం తప్పలేదు. విజయ్ అధిరోహించటమూ తప్పటం లేదు.
అసోంలో మూడో సారి బీజేపీ యే గెలవటమూ, పాండిచేరిలో బీజేపీ చిరు భాగస్వామ్య పక్షం వున్న ఎన్డీయే గెలవమూ, కేరళలో ఎల్.డి.ఎఫ్ పోయి యూడీఎఫ్ రావటమూ పరిశీలకుల్నెవర్నీ పెద్ద ఆశ్చర్యానికి గురి చెయ్యలేదు. ఎటొచ్చీ ఈ రెండు (పశ్చిమ బెంగాల్, తమిళనాడులే) రాష్ట్రాలే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఉత్కంఠను రేపాయి. ఫలితాలొచ్చేవరకూ ‘అంపైర్లు’ గా ఎన్నికల అధికారులు వుంటారు. వచ్చాక ‘అంపైర్లు’ గా గవర్నర్లు వుంటారు.

బీజేపీకి 207 సీట్లు వస్తే, టీఎంసీకి 80 సీట్లు వచ్చాయి. అంతిమ విజయం బీజేపీదే. కానీ జయాపజయాలను నిర్ణయించాల్సింది పోలయిన వోట్లు కానీ, తొలగించబడిన వోట్లు కదా? ఇదీ మమత లాజిక్కు. దీనిని నిరూపించటం కోసం ఆమె రాజీనామా చెయ్యకుండా వున్నారు. కడకు గవర్నర్ రవి కలుగు చేసుకుని, ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఇదీ బెంగాల్ వోట్ల రభస.
అసెంబ్లీ ఎన్నికలలో అధికార పక్షం వోటమి పాలయితే, ముఖ్యమంత్రి పీఠంలో వున్నవారు గవర్నర్ కు రాజీనామాను సమర్పించాలి. కానీ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ వోటమి పాలయినా, ముఖ్యమంత్రిగా వున్న మమతా బెనర్జీ రాజీనామా చెయ్యనన్నారు. అందుకు ఆమె ‘లెక్క’ ఆమెకు వున్నది. ఎన్నికలు మొదలు కాకముందే, తొలివిడత ‘అంపయిర్ల’ (ఎన్నికల కమిషనర్ల) నేతృత్వంలో జరిగిన ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫలితంగా 90 లక్షల వరకూ వోట్లు తొలగింపునకు గురయ్యాయి. ఈ తొలగింపునకు గురయిన వారిలో వోటు హక్కుకు అర్హులయిన వారే అధికులు వున్నారన్నది ఆమె వాదన. ఆ అధికుల్లో అత్యధికులు సంప్రదాయకంగా తృణమూల్ కాంగ్రెస్ కు వేస్తున్నవారే. ఈమె వాదనకు వత్తాసు పలుకుతూ, రాహుల్ గాంధీ కూడా 50కు పైగా నియోజకవర్గాలలో రీపోలింగ్ కు ఆదేశించాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు. కారణం ఆ నియోజకవర్గాలలో గెలిచిన (బీజే) అభ్యర్థుల ఆధిక్యాలు, తొలగించిన వోట్ల కన్నా తక్కువ వున్నాయి. ఆయన అంచనాలు ఎలా వున్నా ఎన్నికల అనంతరం వచ్చిన గణాంకాలు కూడా అలాగే వున్నాయి. ఒక (జాతీయ దినపత్రిక) అంచనా ప్రకారం, తొలగించ పడ్డ (79 లక్షల) ప్రభావాన్ని లెక్క కడితే, అధికంగా (12 శాతం పైగా) తొ తొలగింపునకు గురయిన నియోజక వర్గాలలో తృణమూల్ కాంగ్రెస్ వోట్ల శాతంలో 8.6 కోత పడగా, బీజేపీకి అదనంగా 9.9 శాతం వోట్లు పడ్డాయి. ఫలితాలు తలకిందులు కావటానికి ఈ వ్యత్యాసం సరిపోతుంది. అది వేరే విషయం. అయినా కూడా రెండు పార్టీల మధ్యవోట్ల వ్యత్యాసం 5 శాతానికి మించి లేదు. కానీ సీట్ల వ్యత్యాసం వచ్చేసరికి పెద్దగా కనిపిస్తుంది. బీజేపీకి 207 సీట్లు వస్తే, టీఎంసీకి 80 సీట్లు వచ్చాయి. అంతిమ విజయం బీజేపీదే. కానీ జయాపజయాలను నిర్ణయించాల్సింది పోలయిన వోట్లు కానీ, తొలగించబడిన వోట్లు కదా? ఇదీ మమత లాజిక్కు. దీనిని నిరూపించటం కోసం ఆమె రాజీనామా చెయ్యకుండా వున్నారు. కడకు గవర్నర్ రవి కలుగు చేసుకుని, ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఇదీ బెంగాల్ వోట్ల రభస.
పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక పోతే, ఉన్నవాటిల్లో అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీ శాసన సభా పక్ష నేతను ఆహ్వానించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యమని, బలనిరూపణకు గడువు ఇవ్వాలి. కానీ తమిళనాడు గవర్నర్ గా వున్న రాజేంద్ర పర్లేకర్ ఆ పని చెయ్యక పోగా, గెలిచిన పక్ష నేతను, తగిన మెజారిటీ లేదని రెండు సార్లు తిప్పిపంపారు.

ఇక తమిళనాట సీట్ల వివాదం. ఎన్నికలు జరిగిన మొత్తం సీట్లు 234. అందులో జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని టీవీకే పార్టీ గెలుచుకున్నవి 108 స్థానాలు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య(మేజికల్ ఫిగర్) 118. విజయ్ రెండు స్థానాల్లో గెలుపొందటం వల్ల, ఒకటి వదలు కోవాలి. అప్పుడు టీవీకే కు వున్నవి 107 మాత్రమే. ఇంకా 11 సీట్లు కావాలి. అది వేరే విషయం. కానీ గతంలోని రాష్ట్రపతిగా వున్నవారూ, గవర్నర్లూ అనుసరిస్తున్న సంప్రదాయం ఒకటి వుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక పోతే, ఉన్నవాటిల్లో అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీ శాసన సభా పక్ష నేతను ఆహ్వానించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యమని, బలనిరూపణకు గడువు ఇవ్వాలి. కానీ తమిళనాడు గవర్నర్ గా వున్న రాజేంద్ర పర్లేకర్ ఆ పని చెయ్యక పోగా, గెలిచిన పక్ష నేతగా విజయ్ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటే, తగిన మెజారిటీ లేదని రెండు సార్లు తిప్పిపంపారు. ఈ లోగా ఎవరి పావులు వారు కదిపారు. బీజేపీతో పొత్తున్న ఎఐఏడిఎంకే అధినేత పళని స్వామి తనకున్న 47 ఎమ్మెల్యేల సంఖ్యతో, టీవీకేకు మద్దతు నివ్వటానికి ముందు కొచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే విజయ్ నిరాకరించారు. ఆ తర్వాత అదే పళని స్వామి, తమ పార్టీతో దశాబ్దాల వైరం వున్న డిఎంకె తో ప్రభుత్వం ఏర్పాటు కు సిధ్ధపడ్డారు. ఆ మేరకు తన వద్ద వున్న(59 సభ్యుల) సంఖ్యతో డిఎంకె అధినేత స్టాలిన్ కాస్త ఊగారు కూడా. అయితే అప్పటికే కాంగ్రెస్ తన వద్ద వున్న అయిదుగురి సభ్యుల మద్దతు టీవీకే కు ప్రకటించింది. ఆ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ షరతు కూడా విధించారు. మతతత్వశక్తుల సొంటు లేకుండా సర్కారు ఏర్పాటు చేస్తానంటేనే ఈ మద్దతు అని తెగేసి చెప్పేశారు. దాంతో విజయ్ ఇతర సెక్యులర్ పార్టీల వైపు చూశారు. అంతిమంగా విసికె. కమ్యూనిస్టులు ముందు కొచ్చాయి. అనూహ్యంగా చివర్లో ఐయూఎంల్ కూడా కలిసొచ్చింది. ఫలితంగా టీవీకేకు 118 దాటి 120 వచ్చాయి. అప్పడు మూడోసారి కలిశారు. ఇప్పుడు గవర్నర్ కు విజయ్ ని పిలవటం మినహా మరో మార్గం లేదు. అయితే ఇలా అన్నీ విజయ్ కు అనుకూలంగా జరిగిపోవటానికి ఇంకో కారణం వుంది. మధ్యలో విజయ్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటానికి సిధ్ధమయ్యారు. అదే మొత్తం ఎన్నికయిన 107 టీవీకే శాసన సభ్యుల రాజీనామా. అలా జరిగితే ఒక్క టీవీకేకు తప్ప, అందరికీ నష్టమే. భారీ ఉపఎన్నికలకో, లేదా మొత్తం అసెంబ్లీ ఎన్నికలకో దారితీసే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. ఏమయితేనేం? విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యటం మార్గం సుగమం కావటమే కాక, కేవలం ‘సెక్యులర్’ శక్తులతో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగలిగే అవకాశం ఆయనకు కలిగింది.
దీంతో ఎన్నికల కమిషన్ తో పాటు, గవర్నర్ల వ్యవస్థ మీద కూడా ఇప్పటికే వున్న అనుమానాలు మరింత బలపడ్డాయి. కథ రెండు చోట్లా తాత్కాలికంగా సుఖాంతమే అయినా, రెండు సరికొత్త రాజనీతిని లోకానికి అందించాయి. క్రీడాకారుడు ఆట గెలవాలంటే, పోటీ లో వున్న క్రీడాకారుడితోనే కాదు, అంపయిర్ తో కూడా ఆడాలి. ఆ అంపయిర్ ఎన్నికల కమిషనర్ కావచ్చు. లేదా గవర్నర్ కావచ్చు.
సతీష్ చందర్
8 మే 2026
