’గురి‘ చూపి ’ఉరి‘ ఎక్కిస్తున్న కార్పోరేట్ విద్య..!
కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. తిరుపతి గ్రామీణ మండలం యం.ఆర్ పల్లిలోని నారాయణ కళాశాలలో బై.పి.సీ రెండవ సంవత్సరం విద్యార్థి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన మంది శ్రీధర్, కళ దంపతుల కుమారుడు శ్రీహర్ష(17) మంగళవారం మధ్యాహ్నం ఇంటి దగ్గరనుండి కళాశాల వసతిగృహానికి చేరుకున్నాడు. ‘అలసటగా ఉంది కళాశాలకు రాలేను గదిలోనే ఉంటాన’ని చెప్పాడు. సాయంత్రం కళాశాల నుండి వసతిగృహానికి వచ్చిన స్నేహితులకు గదిలో శ్రీహర్ష ఫ్యాన్ కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. కళాశాల నిర్వాహకులు రుయా ఆసుపత్రి కి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు కుమారుడు మరణంతో ఆందోళన చెందారు. కళాశాలలో వేధింపుల వలనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. కార్పొరేట్ కళాశాల,పాఠశాలలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం కడప జిల్లా మాంట్ ఫోర్డ్ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చరణ్ రెడ్డి టై తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదేవిధంగా ఈ సంవత్సరంలో ఇప్పటికి ఒత్తిడి, వేధింపులు, ప్రేమ, ర్యాగింగ్ వలన సుమారు 100 మంది విద్యార్థులకు పైనే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క అక్టోబరు నెలలో రెండు రాష్ట్రాలో 50 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరికొందరు అదృశ్యమయ్యారు. “వీరిలో 40 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందినవారని, 158 వసతిగృహాలు ప్రభుత్వం అంగీకారం లేకుండా నడిపిస్తున్నారు అని ప్రత్యక్షంగా విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారని, ఇదంతా తెలిసికూడా ప్రభుత్వం గాడిదలు కాస్తున్నారా…” అని, కార్పొరేట్ సంస్థల నుండి ఎన్ని వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని నగరి ఎమ్మెల్యే రోజా పరుషంగానే ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తల్లిదండ్రులకు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. విమర్శించటం సులభమే. వైయస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఈ ఆత్మహత్యలు జరిగాయి. కాకుంటే ఇప్పుడు సర్కారులో భాగంగా వున్న ఒకానొక మంత్రి నిర్వహిస్తున్న కార్పోరేట్ కళాశాలల్లోనే ఎక్కువగా జరిగాయి. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వుంటోంది… అంటే ఉండదూ మరి..?