తెలంగాణ ’సైకిలు’కు గాలి పోయినట్లేనా..?
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష టీడీపీ, బీజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతల వలసలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కుర్చీల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. దాదాపుగా టీఆర్ఎస్ లోకి అధికంగా తెలుగుదేశం పార్టీ నాయకులే వలస వచ్చారు. ఇప్పుడు జరిగిన తాజా వలసలతోతెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా తయారయింది. తెలుగుదేశం పార్టీలో ఎంతో పట్టు ఉన్న నాయకురాలు తెలుగుదేశం పార్టీ మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి ఇపుడు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌కి వచ్చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ నుంచి నల్గొండ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి గత నెలలో( నవంబర్ 6 న) టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు , రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ వలస వచ్చారు.ఉట్నూరు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సరేసరి. ఇదిలా ఉండగా రంగారెడ్డి ఎమ్మెల్యే ఎరకపూడి గాంధీ, జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, సత్తుపల్లి ఎమ్మెల్యే సుందర వెంకట వీరయ్య ఇండిపెడెంట్ గా అయితే ఎల్.బి నగర్ ఆర్.కృష్ణయ్య ఈ విధంగా వరుసగా తెలుగు దేశం పార్టీ నాయకులు ఇటీవల టీఆర్ఎస్ లోకి వలస వచ్చారు.
తెలుగుదేశం నుంచే కాదు, కాంగ్రెస్ నుంచి భారీ వలసలు జరిగాయి.
కానీ ఇందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టిలో ఉన్న రెవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటంతో, తెలంగాణ లో ‘తెలుగు’ తమ్ముళ్ళు గులాబీ కండువాల కోసం క్యూలు కడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. రమణ, మోత్కుపల్లి నరసింహులు వంటి ఒకరిద్దరు మినహా ఇక ‘సైకిలు’ దిగటానికి పెద్దగా వుండక పోవచ్చు. 2019 ఎన్నికలకు తెలుగు దేశం నుంచి తెలంగాణ లో పోటీ చెయ్యటానికి అన్ని స్థానాల్లో గట్టి అభ్యర్థులు దొరుకుతారా.. అంటే అనుమానమే అంటున్నారు విశ్లేషకులు.