రెండు ’తెలుగు‘ లందు ఏ తెలుగు ’లెస్సు’?
మొదటి,రెండు మహాసభల్లో తెలంగాణకు సరైన ఆదరణ లభించలేదు. ఇది నిజమే కావచ్చు. పొరపాటే కావచ్చు. కానీ అది తప్పిదం తెలంగాణ సర్కారు చేస్తుందా? ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో
ఆం ధ్రకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందా ?
ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు మహాసభలపై ఈ ఆరోపణ బలంగా వినిపిస్తుంది. ఇంతవరకూ నాలుగు ప్రపంచ మహాసభలు జరిగినా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగినవి కేవలం రెండు. ఈ రెంటి మీద రాజకీయ నీలి నీడలు తీవ్రంగానే ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు నేతృత్వంలో జరిగిన మహాసభలపై ‘శ్రీకాకుళ నెత్తుటి మరకలు’న్నాయన్న విమర్శలు పూర్తిగా కొట్టిపారేయలేం. అక్కడి నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా, గిరిజనుల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న విమర్శని వెంగళ రావు ఎదుర్కొన్నారా? వాటిని కప్పి పుచ్చుకునేందుకే ఈ సభలు నిర్వహించారని సాక్ష్యాత్తూ మహాకవి శ్రీశ్రీనే ఆరోపించారు.
తెలుగునాట జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రంలో పతాక స్థాయిలో వున్న తెలంగాణ ఉద్యమ తీవ్రతని తగ్గించేందుకే ఈ సభలు నిర్వహించారని విరసం వారి వాదన. ముచ్ఛటగా మూడోసారి కూడా విరసం తెలుగు మహాసభల్ని వ్యతిరేకిస్తుంది. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలని కప్పిపుచ్చుకునేందుకు, కొందరు రచయితల్ని తమ వైపు తిప్పుకునేందుకే ఈ సభల్ని నిర్వహిస్తుందని విరసం ఆరోపించింది.(విరసం నక్సలైట్లకు ఊతం ఇస్తుంది. అది వేరే విషయం) ప్రజలు ఈ మహాసభల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
ఆంధ్ర కవుల విస్మరణ…?
తొలిసారిగా తెలంగాణలో తెలుగు మహాసభలు జరుగుతుండటంతో, తెలంగాణ భాషాసంస్కృతులకు సభల్లో పెద్డపీట వేయనున్నారు. ఇందులో విచారించాల్సిందేమి లేదు. అయితే ఆంధ్ర కవులకు, రచయితలకు ఈ సభల్లో కొంత వివక్ష ఎదురవుతుంది. కలానికి ప్రాంతాన్ని అంటగట్టడం ఎప్పుడూ దురదృష్టకరమే. కేవలం తెలంగాణ భాషాసంస్కృతుల మిదే కాకుండా ఉభయ రాష్ట్రాల్లోని వివిధ భాషాసంస్కృతుల్ని ఆదరించాలి. తెలుగు మీద మమకారంతో ఎక్కడెక్కడి నుంచో (అది పక్క రాష్ట్రం నుంచైనా సరే) వస్తున్న తెలుగు వారికి ప్రాంతీయతను అంటగట్టడం ఏమాత్రం సబబు కాదు. రేపటి నాడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మహాసభలు జరిగితే వారు తెలంగాణ వారిని మరోవిస్మరించ కూడదు. అలాగే జరిగితే భవిష్యత్తులో తెలంగాణ తెలుగు మహాసభలు, ఆంధ్ర తెలుగు మహాసభలని వేరువేరుగా చేసుకోవలసి వస్తుంది. అప్పుడు ‘రెండు తెలుగులందు ఏ తెలుగు లెస్సో’ చెప్పటానికి శ్రీక్రిష్ణ దేవరాయలు దిగిరావాలి.