ఏపీలో మోడీ ’వోట్ల‘ మార్పిడీ?
నోట్ల మార్పిడీ వున్నట్లే, ‘వోట్ల’ మార్పిడీ కూడా వుంటుంది. నోట్లు రకరకాలుగా మార్చుకుంటాం. రద్దయిన నోట్లిచ్చి, కొత్త నోట్లు మార్చుకుంటాం. ఇది ‘మోడీ మార్కు’ నోట్ల మార్పిడీ. దీనినే ‘డీమో’..నటైజేషన్ అన్నారు. (మోడీ ని తిరగేస్తే ‘డీమో’ అవుతుంది లెండి.) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మోడీ మార్కు ‘వోట్ల’ మార్పిడీ జరగబోతోందా..?
నోట్లకు బ్యాంకులున్నట్లే, వోట్లకూ బ్యాంకులుంటాయి. రాష్ట్రంలో వై.యస్.జగన్మోహన రెడ్డికో వోటు బ్యాంకు వుంది. ఈ బ్యాంకుల్లో కొన్ని సమూహాలుంటాయి: రెడ్లూ, దళిత క్రైస్తవువలూ, దళితులూ, ముస్లింలూ, (ముద్రగడ సహకరిస్తే) కాపులూనూ. మోడీకీ ఒక వోటు బ్యాంకు వుంటుంది: బ్రాహ్మణులూ, క్షత్రియులూ వంటి సాంద్రాయక అగ్రవర్ణ హిందువులూ, ఐటీ ఉద్యోగులూ, అడపాదడపా నగరవాసులూ. ఈ బ్యాంకులో నోట్లు ఆ బ్యాంకులో చెల్లుతాయా?
ఈప్రశ్న ఎందుకు వచ్చిందంటే, బీజేపీ, తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చెయ్యాలనుకుంటోంది. అలా చేస్తే టీడీపీ వ్యతిరేక వోట్లను చీలిపోకుండా చూసుకోవాలి. అంటే జగన్, పవన్‌లతో చేతులు కలపాలి. పవన్ సరే, జగన్ వోటు బ్యాంకుకీ, బీజేపీ వోటు బ్యాంకుకీ చుక్కెదురు. అలాంటప్పుడు రెండు జతగడితే.. ఉన్న వోట్లు పోయే అవకాశం వుంది. ఇందుకు మధ్యే మార్గం వుంది. దాని పేరే ‘అవగాహన’. బీజేపీ బలంగా వున్న చోట జగన్ బలహీన అభ్యర్థిని పెట్టటం, జగన్ పార్టీ బలహీనంగా వున్న చోట, బీజేపీ బలహీన అభ్యర్థిని పెట్టటం. కాబట్టి ‘పొత్తు’ వుండదంటే కత్తులు దూసుకుంటారని మాత్రం కాదన్నమాట!?