Bathuku (Life)

వీధులే..వారికి వాకిళ్ళు!వీధులే..వారికి వాకిళ్ళు!

ఇంటి వాకిలి చూసి ఇల్లాలి ముఖం చెప్పవచ్చంటారు. వాకిలి అద్దంలా వుంటే, ఇల్లాలు చందమామలా వుంటుంది కాబోలు. వీధి శుభ్రతను చూస్తే, ఎవరి ముఖాన్ని తలవాలో మరి? అక్కడా ఒక స్రీనే తలవాలి. ఊడ్చే పని మొత్తం స్త్రీల కిచ్చే కూర్చుంది సమాజం. అది వేరే విషయం.
వీధుల్నే సొంత ఇళ్ళ వాకిళ్ళగా చూసుకునే తల్లులు వేలకొలది వున్నారు. వాకిళ్ళను తెల్లవారాకే ఊడుస్తారు కానీ, వీధుల్ని తెల్లవారకుండా తుడిచెయ్యాలి. అర్థరాత్రి స్త్రీ ఒంటరిగా వీధిలోకి రాగలిగినప్పుడే ఆమెకు స్వాతంత్య్రం వచ్చినట్టు లెక్క-అన్నాడు గాంధీ. ఆ లెక్కన ఈ ‘పొరకల తల్లుల’కు ఎప్పుడో స్వరాజ్యం వచ్చి వుండాలి. కానీ రాలేదు. అందుకనే ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా ఊడుస్తారు. అప్పుడే కదా, ఆకతాయి ఎదురొస్తే చీపురుకట్టలు తిరగవెయ్యగలిగేది.
హైదరాబాద్‌ పొద్దున్నే అంత తాజాగా వుందంటే, అది ఈ తల్లుల చలువే. చంటిబిడ్డ తల్లులయితే పిల్లల్ని ఇళ్ళల్లోనే నిద్రపుచ్చి వస్తారు. ఒక్క్కొక బృందమూ తుడవాల్సింది రాత్రికి మూడు నుంచి అయిదు కిలోమీటర్ల మురికి రోడ్డు. శీతాకాలమయితే, ముందు దుమ్మును తుడుచుకుంటూ పోతుంటే, వెనుక చలి తరముతూ వుంటుంది. ఊడ్చిన చెత్తనే కొంత తగలేసి, తెల్లవారు ఝామున చలికాచుకుంటారు. ఆ తర్వాత పని మామూలే. వానాకాలమయితే పని రెండింతలు. మునిగి తేలిన రోడ్లమీద కొట్టుకొచ్చిన చెత్త ఎక్కువ. అందులోనూ, రోడ్లనే చెత్తకుండీలు గా భావించే నగరంలో, ఎప్పుడు ఏది పారెయ్యాల్సి వస్తుందో చెప్పలేం. ఈ పనిచేయటం వల్ల వచ్చే డబ్బులు కన్నా, తెచ్చుకునే జబ్బులు పది రెట్లు. జలుబు, దగ్గూ- వీరికి శాశ్వత బంధువులు. పనిలో పదేళ్ళు గడిస్తే, వంగిన నడుము లేవదు. రాత్రి శ్రమకు తగ్గ విశ్రాంతి పగలు తీసుకుందామంటే- ఒళ్ళంతా నొప్పులే. ముక్కుకు మాస్క్‌లూ, చేతికి తొడుగులూ ఎప్పుడో కానీ, సూపర్‌ వైజర్లు తెచ్చి ఇవ్వరు. రాత్రి పూట అదుపు లేని వాహనాలు ఎక్కడ మీద నుంచి ఒక్కటే భయం. గతంలో ఇలా కొందరు చనిపోయారు; ఇంకొందరు అంగవిలుయ్యారు. అందుకే వారి ఒంటికి చీకట్లో ప్రకాశించే ‘రేడియం’ పట్టీ వేసుకుంటారు.
ఆరోగ్య సౌకర్యం సర్కారు కల్పించినా వీరికింకా చేరనే లేదు. ‘ఈఎస్‌ఐ’ వైద్య సేవలా..? అంటే..? అని ఆశ్చర్యపోతున్నారు ‘తెలుగూస్‌ డాట్‌ కామ్‌’ వారిని పలకరించినప్పుడు. కాకుంటే, ఒకప్పుడు రెండు వేలు, అయిదు వేలు ఉండే జీతాలు 14 వేల వరకూ అయ్యాయి. ‘కేసీఆర్‌ సార్‌ వచ్చినాకే పెరిగనయ్‌’ అని మాత్రం చెప్పారు. వీరికి ఎంత ఇస్తే మాత్రం రుణం తీరుతుంది..!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *