పాత ‘జంబ’లో పేలని ‘పంబ’!
రేటింగ్:2.25
క్విక్ లుక్:
ఫస్ట్ ఇంప్రెషన్: పేరే కాదు, కథా పాతదే. డైలాగులూ పాతవే. కానీ పాత ‘జంబలకిడి పంబ’లో వున్న జోష్ లో పదోవంతు కూడా లేదు.
ప్లస్ పాయింట్స్: బాగా నలిగిపోయిన పేరు.(సాధారణంగా పాత సినిమాల పేర్ల తో కొత్త సీరియల్స్ తీస్తుంటారు. అప్పుడప్పుడూ సినిమాలు కూడా తీస్తుంటారు. ఆ లెక్కన ఇది అరుదయిన చిత్రం.)
– హీరోయిన్ చలాకీగా, ఎంతో కొంత అందంగా కనిపిస్తుంది.
– పోసాని, వెన్నెలకంటిలు రిలీఫ్ ఇస్తారు.( దాదాపు ఇచ్చిన రిలీఫ్ అంతా ఈ ఇద్దరిదే.)
– శ్రీనివాస రెడ్డి తాను హీరోనన్న స్పృహ లేని కొన్ని చోట్ల బాగా చేస్తాడు.. కామెడీగా.
మైనస్ పాయింట్స్:
-కమెడియన్ కే కాస్త తక్కువనుకున్న నటుణ్ణి హీరో చేసేస్తే ఏం కావాలో అదే అయ్యింది.
– హీరోయిన్ అందగా వున్నా, ఒకే ఫీలింగ్‌ను సినిమా అయ్యేవరకూ మెయింటెయిన్ చేసింది.
-సినిమా కు కావాలసిన పోపు సరుకులు సమకూర్చుకున్నారు కానీ, వండటం మరచిపోయారు.
-ఇదేమీ సినిమా అబ్బా- అనుకునేలోగా ఫస్ట్ హాప్ అయిపోయింది. ఇదా సినిమా- అనుకున్నాక చూడటం కష్టమయ్యింది.
-పాటలు వున్నాయి. కానీ రిజిస్టర్ కావు.
-డైలాగులు..ఆరబెట్టి తెచ్చిన తడి పటాసుల్లా .. అక్కడక్కడా పేలాయి. హాస్య చిత్రమని అనుమానంతో వచ్చిన వారు అలాంటి చోట్ల బాగుండదని బాగానే నవ్విపెట్టారు.
-కొరియో గ్రఫీ అంటారా.. హీరో, హీరోయిన్ల డాన్సు కన్నా రఘుబాబు ఆఫీసులో చేసిన డ్యాన్సే బాగుంది.
ఎవరెవరు?
చిత్రం: జంబలకిడి పంబ
జోనర్: కామెడీ
నటీనట వర్గం:శ్రీనివాస రెడ్డి, సిధ్ధి ఇద్నాని, వెన్నెల కిషోర్,పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, సత్యం రాజేష్, ధనరాజ్, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి, శకలక శంకర్, హరితేజ, సుధ
దర్శకత్వం: జె.బి. మురళీ కృష్ణ (మను)
నిర్మాతలు: జోజో జోస్, రవి, ఎన్. శ్రీనివాస రెడ్డి, బి. సురేష్ రెడ్డి
రచన :జె.బి.మురళీ కృష్ణ, శ్రీనివాస్ అంకాలపు
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
సంగీతం: గోపీ సుందర్
విడుదల తేదీ:22 జూన్ 2018
కథాంశం: పాత సీసాలో మహా పాత సారాయి
పాతదే. వారు వీరవ్వటం. ఆడ మగవ్వటం. ఆడ కష్టాలు మగవాళ్ళకు తెలీటం. ఆ పాయింటు చిన్నదే. ఆ పేరు మీద మగవాళ్ల చేత ఆడచేష్టల్నీ, ఆడవాళ్ల చేత మగచేష్టల్నీ చేయించటం. అందులోంచి హాస్యాన్ని ఆశించటం. పాత ‘జంబలకిడి పంబ’లోనూ ఇదే. కాకుంటే పాత చిత్రంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం. కానీ ఈచిత్రం కడుపులో ‘కోక్’ కదలకుండా నవ్వేప్రయత్నం చెయ్యవచ్చు.
కథ: అతడూ, ఆమె, ఒక దయ్యమూ
వరుణ్( శ్రీనివాస రెడ్డి), పల్లవి(సిధ్ధి ఇద్నాని) ప్రేమించేసుకుని, పెళ్ళి కూడా చేసేసుకుని, కాపురం పెట్టేసుకుని, ఛీ.ఛీ ఇదా కాపురం అనేసుకుని, విడాకులు తీసేసుకుందామనుకుంటారు. అనుకోవటం పాపం లాయర్( పోసాని) దగ్గర కొచ్చి ఆయన అసిస్టెంటు( వెన్నెల కిషోర్) సమక్షంలో తమకు తెగతెంపులు చేసేయమంటారు. అప్పటికి 99 డైవర్స్‌లు ఇప్పించిన, సెంచరీ కొట్టే ఉత్సాహంలో ఒప్పేసుకుని, గోవా సతీసమేతంగా వెళ్తాడు. అంతే అక్కడో యాక్సిడెంటవ్వటమూ, లాయరు అమరుడవ్వటం, అతడే దయ్యమయి, విడాకులడిగిన దంపతులకు దగ్గరకు రావటమూ జరిగిపోతాయి. లాయరు దయ్యానికి వారిని కలపటం అత్యవసరం అయి కూర్చుంటుంది. వారిని కలిపే ప్రయత్నంలో వరుణ్‌నీ పల్లవీ గానూ, పల్లవినీ వరుణ్ గానూ మార్చేస్తాడు. ఆ తర్వాత ఏంజరిగిందీ… ? ఈ సినిమాలో ఏదో వుందన్న అనుమానంతో వెళ్ళే వాళ్ళకి ఆ మాత్రం మిగల్చాలి కదా!
ట్రీట్‌మెంట్: అటుదిటూ, ఇటుదటూ
వేధించే దయ్యం వేధింపులకు గురవుతుంటేనూ, ఆడా, మగల తారుమారులో ఒకరి పని ఒకరు చేస్తుంటేనూ నిజంగానే హాస్యం పండాలి. కానీ హాస్యమే కదా- అని రాసి పారేసినట్టున్నారు. అందుకే ట్రీట్‌మెంట్ కు రావాల్సిన ఫలితం రాలేదు.
స్క్రీన్ ప్లే: ప్రేక్షకుడి ఊహ పరిధిలోనే.
మొదట్లో ఫ్లాష్ బ్యాక్‌లు చెప్పే సీను తప్ప, అన్నీ సీన్లూ ప్రేక్షకుడు ఊహించినట్లుగా వచ్చేస్తుంటాయి. అందుకే ఎప్పుడో చూసిన సినిమా, మళ్లీ టీవీలో వస్తే ఎలా చూస్తారు? అలా చూడాల్సి వచ్చింది. కాకుంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు మాత్రం. గతంలోని పాత్రల్ని పేరు పెట్టి పిలిచి మరీ చెప్పించుకుంటారు. ఈ దృశ్యం బాగుంది.
హీరో: నటనే బంగారమాయేనా..?
దర్శకుడు తర్వాత, ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింటు హీరోయే. వయసుకు తగ్గ పాత్రా కాదు, పాత్రకు తగ్గట్టుగా వయసును దాచుకోనూ లేదు. మగ ఆడయ్యాక చేసే హావ భావాలు (బహువచనం వాడేసినట్టున్నాను.)… భావమే లెండి… సరిగా పలక లేదు. లిప్ స్టిక్ పెట్టుకుంటూ, కొంచెంగా తిప్పుకుంటే హాస్యం తన్నుకుంటూ వచ్చేస్తుందని, హీరోయే అనుకున్నారో లేక దర్శకుడే అనుకున్నారో తెలీదు కానీ, అక్కడితో ఆగిపోయి, ప్రేక్షకుల నవ్వుల్ని కూడా అక్కడే ఆపేశారు.
ఇతర నటీనటులు: పోసానే పెద్ద రిలీఫ్
పోసాని కృష్ణ మురళి పెద్ద రిలీఫ్. ఆయనే లేకుంటే సినిమాయే లేదు. ఆయన కనిపిస్తున్నాడంటేనే కొంత ఉత్సాహం వస్తుంటుంది. అలాగే వెన్నెల కిషోర్ కూడా ఉన్నంతలో బాగా చేశారు. తనికెళ్ల భరణి వున్నారు కానీ, ఆయనకు చెయ్యటానికి ఏమీలేదు.
హీరోయిన్: ఏక ‘ఫీలింగ్’ వ్రతం
కనుముక్కు తీరు బాగుండటం వల్లా, చురుకుగా వుండటం వల్లా ఎక్కడా ఎబ్బెట్టుగా కనిపించలేదు కానీ, సినిమా మొత్తం ఒకేరకం ‘ఎక్స్‌ప్రెషన్’తో లాగించేశారు.
సంభాషణలు: మాటలు ఎక్కువ, చమత్కారాలు తక్కువ.
హాస్య చిత్రానికి ఏ సంభాషణలు ముఖ్యమో, అవే ఇందులో కరవయ్యాయి. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ఒకరిలా మరొకరు మారాక రావాల్సిన చమత్కారాలేవీ రాల్లేదు. ‘ఈ మాత్రం నవ్వించ లేమా?’ అన్న ధీమాతో రాసినట్లున్నారు. పేలిన అతి కొన్ని సంభాషణలు కూడా గతంలో వచ్చిన సినిమా డైలాగుల్లాగానే వుంటాయి.
కొరియోగ్రఫీ:వేసిన స్టెప్పే వేస్తూ.
వామ్మో! కడకు ఐటెమ్ సాంగ్‌కు కూడా పాత స్టెప్పులే. ఇక హీరో హీరోయిన్ల డ్యాన్సులు ఎక్కడా కొత్తగా కనిపించలేదు. అయినప్పటికీ ఎలాగా షూట్ చేసేశాం కదా- వృధా ఎందుకు చెయ్యాలన్న యోచనతో కాబోలు, శుభం కార్డు వేసేస్తూ వదిలేశారు. ప్రేక్షకులు కూడా దాన్ని అలాగే వదలి వచ్చేశారు.
కొసమెరుపు: జంబలకిడి పంబా .. పంబలకిడి జంబా.. హాస్యమే హాస్యం.. అని అనుకుని వెళ్లకుండా.. ఒకానొక సినిమాను చూసి వద్దాం అని వెళ్ళితే నిరుత్సాహం తక్కువగా వుంటుంది.