Literature

మా తెలుగు తల్లికి ‘ముళ్ళపూడి’ దండ

హాస్యమందున అఋణ
అందెవేసిన కరుణ
“బుడుగు” వెంకటరమణ
ఓ కూనలమ్మ…….
– ఆరుద్ర.
ముళ్లపూడి వెంకట రమణ గారి గురించి ఏమని చెప్పాలి? జర్నలిస్టనా,కథకుడనా?
అనువాదకుడనా,సినిమా రచయితనా?
ఇందులో ఏ రంగం గురించి చెప్పినా ఇంకో రంగం చిన్నబోతుంది.ఆయన గురించి చెప్పటానికి ఈ వ్యాసం ఏ మాత్రం సరిపోదు.అయినా..,నాకు తెలిసిన,నేను చదివిన ముళ్లపూడి గురించి పాఠకులకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
……….బాల్యం…….
రమణ గారు 1931 లో తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం లో జన్మించారు.తొమ్మిదేళ్లకే తండ్రి మరణించడంతో చెన్నై వలస పట్టారు.చెన్నైలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులుపడ్డారు.అక్కడే రమణ గారికి బాపు పరిచయమయ్యారు.ఆ పరిచయం సుమారు అరవై ఏళ్లు కొనసాగింది.

………సాహిత్య సేవ…….
ఆధునిక తెలుగు హాస్యరచనలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ముళ్లపూడి వెంకట రమణ.తెలుగులో హాస్య రచనను ప్రేమించే ప్రతీవారికి రమణ గారు సుపరిచితమే.
రమణ గారికి బాల్యం నుంచి సాహిత్యమంటే మక్కువ ఎక్కువ.ఫ్రీ లాన్సరుగా జీవితం మొదలు పెట్టి సినిమా రచయితగా ఎదిగారు.అక్కినేని గారి జీవిత చరిత్రను రాసారు.
తెలుగు వారికి బుడుగును,అప్పారావును(ఋణానంద లహరి) పరిచయం చేసింది రమణ గారే.గురజాడ వారి గిరీషంతో కబుర్లు చెప్పించాలన్నా ఈయనకే చెల్లింది(గిరీషం కబుర్లు).అనువాదం ఎంత అందంగా చెయ్యొచ్చొ రమణ గారి”ఎన‌‌‌‌‍‌‌‌బై రోజుల్లో భూప్రదక్షిణం” చదివితే తెలుస్తుంది.
మామూలుగా ఆత్మకథలంత రసవత్తంగా వుండవు.ఎందుకంటే జీవితం సినిమా అంత నాటకీయంగా వుండదు కాబట్టి.కాని రమణ గారి(ఆత్మ) కథ అలా కాదు.ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదివించేలా చేయడం ఆయన ఆత్మకథ (కోతి కొమ్మచ్చి ట్రయాలజి)ప్రత్యేకం.
………బాపూరమణీయం……….
రమణ గారిది తూర్పు గోదావరి
బాపు గారిది పశ్చిమ గోదావరి
ఈ ఉభయ గోదార్లూ కలిసి తెలుగు వాడికి సముద్రమంత సాహిత్యాన్నందించాయి.
రమణ రచనకో రూపముంటుంది.బాపు బొమ్మ దానికి ప్రాణం పోస్తుంది.అరవైల నాటి “సాక్షి” నుండి మొన్నటి “భాగవతం” వరకూ వీరు దాటిన మైలు రాళ్లెన్నో.
లవకుశ సినిమా తరువాత “రాముడంటే ఎన్.టి.రామారావే అన్నారు తెలుగువారంతా”.కానీ బాపు రమణలు సాహసం చేసి శోభన్ బాబుతో ‘సంపూర్ణ రామాయణం’ తీసారు.సినిమా మొదట మొండికేసినా తరువాత ప్రేక్షకుల అపూర్వ అభిమానాన్ని పొందింది.ఎన్నో దేశాల ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎంపికైంది.రామాయణాన్ని అంత రమణీయంగా మలచిన వారెవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో!
ఋద్ధిమంతుడు,ముత్యాలముగ్గు,పెళ్లి పుస్తకం,మిస్టర్ పెళ్లాం వంటివి ఈ ద్వయం స్రృష్టించిన అద్భుతాల్లో మచ్ఛుకు కొన్ని.
……………..పురస్కారాలు..……….
*రఘుపతి వెంకయ్య అవార్డు (1986)-ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి.

*రాజలక్ష్మి సాహిత్య పురస్కారం(1995)-శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్,చెన్నై.

*గౌరవ డాక్టరేట్-శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం,తిరుపతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *