సినిమా ‘పంతమే’! కథే ‘శ్రీమంతం’!
రేటింగ్:2.5/5
క్విక్ లుక్:
ఫస్ట్ ఇంప్రెషన్: గోపీచంద్ అభిమానులను మాత్రమే అలరించగల సినిమా. ‘ఈ మాత్రం శ్రీమంతుడు సినిమాలో చూసేశాం’ కదా అని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
-ఆద్యంతం గోపీ చంద్ పెర్ఫార్మెన్స్.
– సైడ్ కిక్‌గా శ్రీనివాసరెడ్డి కొత్త రిలీఫ్ ఇవ్వగలుగుతాడు.
– పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డిల కామెడీ కొంత రిలీఫ్ ఇస్తుంది.
– స్క్రీన్ ప్లే బిగువు ఆసక్తి పోకుండా చూస్తుంది.
-హంస నందిని హొయలు (కొద్ది సేపే)
మైనస్ పాయింట్స్:
-కమెడియన్లు ఎక్కువ కామెడీ తక్కువ
– మెహ్రిన్ వున్నది మెరుపులకే, నటనకు కాదు
– ట్రాజెడీ సన్నివేశాలు ఎక్కువ, గుండెకు పట్టేవి తక్కువ
– కథే కాదు, కథలో మలుపులూ ఎరిగినవే
– సంభాషణల్లో లెక్చరింగ్ ధోరణి
చిత్రం: పంతం
నిర్మాణ సంస్థ: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నటీనట వర్గం: తొట్టెంపూడి గోపీచంద్, మెహ్రీన్ పిర్జాదా, పృథ్వీరాజ్, జయప్రకాశ్ రెడ్డి, హంస నందిని, సంపత్ రాజ్, సాయిజీ షిండే, పవిత్ర లోకేష్, శ్రీనివాస రెడ్డి, అజయ్, పృథ్వీరాజ్,ముఖేష్ ఋషి. అశీష్ విద్యార్థి.
దర్శకత్వం: కె. చక్రవర్తి రెడ్డి
నిర్మాత:కె.కె, రాధామోహన్
కథ :కె. చక్రవర్తి రెడ్డి
సంభాషణలు: రమేష్ రెడ్డి
పాటలు: రవికుమార్ భాస్కరభట్ల
స్క్రీన్ ప్లే: బాబీ కొల్లి
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ళ
కళ: ఎ.స్ ప్రకాశ్
ఎడిటింగ్: పూడి ప్రవీణ్
సంగీతం: గోపీ సుందర్
విడుదల తేదీ:5 జులై 2018
కథాంశం: మెదడే పెరిగి, హృదయం తరిగి
వ్యాపారానికి మెదడుంటే చాలు, సేవకు మాత్రం అదనంగా హృదయం వుండాలి. చాలా సార్లు విన్నట్టుంది కదూ! కానీ ఏం చేస్తాం? ఈ సినిమాలో ఇదే కథాంశం. సేవకూ వ్యాపారానికీ పోటీ పెట్టాశాక, సేవే గొప్పదని తేల్చేయ్యాలి. అదే పనిని ఈ సినిమాలోనూ చేశారు.
కథ: దోచేవాణ్ణి దోచెయ్యటం
చంపేవాణ్ణి చంపెయ్యటమూ, దోచేవాణ్ణి దోచెయ్యటమూ, మోసగాడికి టోకరా వెయ్యటమూ- సగం పైన సినిమా కథలు ఇలాగే నడుస్తూ వుండేటప్పుడు, ఈ కథమాత్రం ఎందుకు భిన్నంగా వుండాలి? దోచుకోవటానికి ఓ రంగం కావాలి. ప్రమాదాలూ, ఎక్స్గ్రేషియాలూ, చికిత్సలూ- వీటిచుట్టూ తిరిగే డబ్బును చాలా మంది దోచుకుంటుంటారు. అందులో హోెమ్ మినిస్టర్ (సంపత్ రాజ్) ఒకడు. అతడి డబ్బును అతడికి తెలియకుండా మాయం చేస్తుంటాడు హీరో(గోపీ చంద్) . ఆ డబ్బుతోనే బాంబు ప్రేలుళ్ళలో క్షతగాత్రులయిన వాళ్ళకి సాయాన్ని అందచేస్తుంటాడు. ఈ దొంగను పట్టుకోవటానికి హెెల్త్ మినిస్టర్ శత విధాలా ప్రయత్నం చేస్తాడు.. క్లయిమాక్సు కోర్టుకు చేరుతుంది.
ట్రీట్మెంట్: రైతులు బదులు క్షతగాత్రులు
కోర్టుకు మంత్రులూ, మహామహులూ వస్తుంటారు. ఇంత మందిని కోర్టుకు వీడ్చిన వాడి కథ ఏమిటి? ఇలా మొదలవుతుంది కథ. ఇందులో భాగంగానే రైల్ రాబరీ, హార్స్ రేస్ సన్నివేశాలు జరగుతుంటాయి. కడకు హోమ్ మినిస్టర్ ను పట్టుకోవటానికి దొంగనే నియమించటం బాగుంటుంది. ‘శ్రీమంతుడు’ సినిమాకూ, ఈ సినిమాకూ పోలికలతో పాటు తేడాలూ వున్నాయి. ఇక్కడా హీరో తండ్రి శ్రీమంతుడే. ఇక్కడా హీరో జనం జనం అంటూ వుంటాడు. అయితే హీరో ఉధ్ధరించటానికి అక్కడ రైతులు వుంటే, ఇక్కడ బాంబు ప్రమాదాల్లోని క్షత గాత్రులూ, వారి కుటుంబాలూ వుంటాయి. ఈ ఒక్కటే ‘శ్రీమంతుడి’కీ, ‘పంతం’ కూ వ్యత్యాసం.
స్క్రీన్ ప్లే: తెలిసిపోయే కథలో తెలియని ‘ట్విస్టు’లు
జరగబోయే కథను మరుగుపరచి, కొంచెం కొంచెం విప్పుకుంటూ వెళ్తుంటే ఆసక్తిగానే వుంటుంది. కానీ ‘పంతం’ కథ దాదాపు పాతది. అందుకని, కథకు కాకుండా సన్నివేశాలే ట్విస్టులు వుంటాయి. ట్రైన్ రాబరీ ప్లాన్, రేస్ లో జాకీగా హీరో రావటమూ వంటి దృశ్యాల క్రమం ఆసక్తిని పెంచుతూ వస్తుంది. అలాగే కోర్టులో సాక్ష్యాలను ప్రవేశ పెట్టేటప్పుడు గుట్టు విప్పే తీరూ ఆకట్టుకుంటుంది.
హీరో: త్రీ ఇన్ వన్
లవర్ బోయ్‌గా, దొంగగా, శ్రీమంతుడుగా.. ఒకే పాత్రలో పలు షేడ్స్ వుండటం వల్ల గోపీచంద్ తన ఇతర సినిమాల్లో కన్నా స్టయిలిష్ గా కనిపిస్తాడు. కాకపోతే ఫైట్స్ రొటీన్ గా వున్నాయి.
ఇతర నటీనటులు: పృథ్వీరాజ్, శ్రీనివాస రెడ్డిల పెర్ఫార్మెన్స్
గోపీచంద్ తర్వాత, సైడ్ కిక్‌గా శ్రీనివాస రెడ్డి, ‘వాడకం వాలేశ్వరరావు’ పాత్రలో పృథ్వీరాజ్ లు చాలా వరకూ హాస్యాన్ని పండిస్తారు. హెల్త్ మినిస్టర్‌గా జయప్రకాశ్ రెడ్డి కొత్తగా చెయ్యటానికి ఏమీ లేదు. ఇతర సినిమాల్లో ఆయన పాలిటిష్యన్గా వున్నప్పుడు ఎలా కనిపిస్తాడో, ఇందులోనూ అలాగే కనిపిస్తాడు. ఆ తర్వాత కాస్తో కూస్తో రిలీఫ్ ఇచ్చిన వారు లాయర్ పాత్రలో అశీష్ విద్యార్థి, వినికిడి కోల్పోయిన సీబీఐ అధికారిగా షాయిజీ షిండేలు మాత్రం బాగా నటించారు. ఇంకా లెక్కకు మించి కమెడియన్లు వున్నారు కానీ, వారు చేసింది తక్కువ.
హీరోయిన్ గా మెహ్రిన్ పూర్తిగా గ్లామర్ డాల్ గానే వుంది. అయితే కొద్ది నిమిషాలు మాత్రమే తళుక్కుమన్న హంస నందిని, గ్లామర్ విషయంలో మెహ్రిన్ ను మింగేసింది.
సినిమాటోగ్రఫీ: కెమెరా ఆన్ ట్రాక్స్
ట్రెయన్ రాబరీ, రేస్ కోర్సు దృశ్యాలను గుర్తుండి పోయేటట్లు చిత్రించారు. అలాగే, గోపీ చంద్ ఈ చిత్రంలా చాలా యంగ్ గా కనిపిస్తాడు.
పాటలు: గీతాలు జోరు- సంగీతం బోరు
‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుజులోయ్’ అనే గురజాడ గీతాన్ని స్ఫురణకు తెచ్చేగీతం తో పాటు డ్యూయెట్ సాంగ్స్ కూడా గుర్తుండేటట్లు వున్నాయి. కానీ, ట్యూన్లు పాతవిగా వినిపించటం వల్ల, ఎంత గొప్పగా చిత్రీకరించినా సినిమాలో మూడ్స్ ను ఉన్నతీకరించటానికి ఉపకరించలేదు.
కొసమెరుపు: తీసుకున్న ‘కాజ్’ (సమస్య) కొత్తగా వున్నా, కథతో పాటు మిగిలినవన్నీ పాత మూసలోనే వున్నాయి. ఒక్క గోపీచంద్ కోసం మాత్రమే సినిమ చూసేవాళ్ళు నిరుత్సాహపడరు.
-సతీష్ చందర్
(ఈ రచయిత ిిఇతర రచనలను https://www.satishchandar.com చదవవవచ్చు)