యాత్రలు పోయె.. దీక్షలు వచ్చె..!
ఐదేళ్ళకోకసారి ఎన్నికలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ ప్రజా సమస్యలు అలానే ఉంటున్నాయి. ఎన్నికల సమయంలో ఏవో వాగ్దానాలు చేసి ప్రజల్లోకి వెళ్ళడం చేసేవారు ఇప్పటి వరకు. ఎప్పుడు అలానే చేయాలనుకున్నరేమో… మన నాయకులు. ఈసారి ప్రతిసారికి భిన్నంగా కనిపిస్తున్నారు మన ప్రజాప్రతినిధులు. ఒకప్పుడు ప్రతిపక్షాలు నిర్వహించే దీక్షలు ప్రస్తుతం అధికార పార్టీ నేతలే చేపట్టడం విశేషం.
ఇప్పటి వరకు ఎన్నికలు వచ్చిన సమయంలోయాత్రలు, సభలు నిర్వహించడం సహజం. ఇవి ఎప్పుడూ మనం చూసినవే. ఎప్పుడు ట్రేండ్‌ను ఫాలో అవడమేంటని అనుకున్నారేమో… అందుకే ఈ సారి…ట్రేండ్‌ను మార్చి దీక్షల రూపంలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకులు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మేల్సీ బిటేక్ రవిలు కడపలో స్టీల్ ప్లాంట్ కొరకు ఉక్కు ధీక్షను ప్రారంబించారు. పట్టుమని పది రోజులు చేసిన పది గ్రాముల బరువు తగ్గనేలేదు. అంతటి ఉక్కు మనిషి సీఎం రమేష్ దీక్ష అందరికి తెలిసిందే..! ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరో దీక్షను ప్రారంభించింది. ఆ పార్టీ ఎంపీలందరు కలిసి విశాఖ రైల్వే జోన్ దీక్షలను మొదలుపెట్టారు. ఈ దీక్షలను చూస్తే సగటు సామాన్యునికి ఏం అర్థంకాని పరిస్థతి.
ఈ దీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తేమి కాదు. ముందుగా ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా గురించి దీక్షలను ప్రారంభం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు నిరసనగా వంచన దీక్షలను చేస్తున్నారు. ఇదిలా వుండగా జనసేనని ట్రెండ్ ను ఫాలో అవ్వను, సెట్ చేస్తా అంటూ పవన్ దీక్షలలో ట్రేండ్ చూపారు. సరికొత్తగా ఉద్ధానం కీడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికై రిసార్ట్‌లో చేసిన దీక్ష అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఈ దీక్షలన్నీ ప్రజా సమస్యల పరిష్కారానికేనా..? లేదా ఎన్నికల కోసమే చేస్తున్న వ్యూహంలో భాగంగానేనా..? అనేది తెలియలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.
-అమర్ నాథ్
తెలగూస్ సెంట్రల్ డెస్క్