AndhraFeatured

తీరం దాటిన ‘హరి’కేన్

పేరుకు తండ్రీ కొడుకులే. ఒకరు రథి; ఇంకొకరు సారథి. చైతన్యరథానికి ఎన్టీఆర్‌ రథి అయితే, ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ సారథి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచీ నాన్నను వెన్నంటి వున్న తనయుడాయన. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి కాక ముందూ, అయ్యాక కూడా ఎన్టీఆర్‌ ‘చైతన్య రథం’ కదలాలంటే, స్టీరింగ్‌ ముందు హరికృష్ణ వుండాల్సిందే. రథం( ప్రత్యేకంగా చేయించిన వ్యాన్‌)పైన ఎన్టీఆర్‌  కూర్చుని రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనానికి అభివాదం చేసుకుంటూ వెళ్తుంటే, ఆయన కొంచెం కూడా తొణక్కుండా అతి నెమ్మదిగా లాఘవంగా నడిపేవారు హరికృష్ణ. కానీ అదే హరికృష్ణ తన స్వంత వాహనాన్ని అతి (గంటకు 160 కిలోమీటర్ల) వేగంగా నడుపుతూ ప్రాణాలే వదిలేశారు. కేవలం 61 యేళ్ళకే ఆయన బుధవారం(29 ఆగస్టు 2018న) తన చైతన్య యాత్రను ముగించేశారు.
ఆయన నందమూరి తారకరామారావుకు నాలుగో కుమారుడు. ఎక్కువగా పెరిగింది స్వగ్రామమైన నిమ్మకూరు(కృష్ణాజిల్లా)లోని తాతగారి దగ్గర. అందుకే ఆయనకు తండ్రికి లాగానే పల్లెవాసనలు ఎక్కువ. జనసామాన్యంలో సులభంగా కలసిపోగలరు.

సినీమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తండ్రినే అనుసరించారు. బాల నటుడిగానే ‘శ్రీకృష్ణావతారం’లోనూ, ‘తల్లా?పెళ్ళామా?’ తెలుగు వారికి ‘తెర’ పరచితులయ్యారు. పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్‌ తన విరాట్‌ స్వరూపాన్ని ప్రదర్శించిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’లో అర్జునుడి పాత్ర పోషించారు.  అందులో ఎన్టీఆర్‌ బహుపాత్రాభినయం చేస్తారు. ఏకకాలంలో కృష్ణుడి సాయం కోరి,సుయోధనుడూ, అర్జునుడూ వచ్చినసన్ని వేశంలో, కృష్ణుడు,సుయోధనుడి పాత్రల్లో ఎన్టీఆర్‌, అర్జునుడి పాత్రలో హరికృష్ణ నటనా చూడ ముచ్చటగా వుంటుంది. అంతవరకూ విరాటమహరాజు కొలువులో బృహన్నల పాత్రలో వుండి అప్పుడే అజ్ఞాతం వీడి వచ్చిన అర్జునుణ్ణి(హరికృష్ణ)  ఉద్దేశించి సుయోధనుడు(ఎన్టీఆర్‌) ‘ఆడుతనం పోయిననూ పేడుతనము పోలేదు’ అని వ్యంగ్యోక్తి విసురుతున్నప్పుడు అర్జునుడు (హరికృష్ణ) నడుచుకుంటూ వెళ్ళిన తీరు మళ్లీ ఎన్టీఆర్‌నే స్ఫురింప చేస్తుంది.

సీతయ్య- ఎవరి మాటా వినడు

అయితే ఆయన ఎన్ని చిత్రాల్లో ఎన్ని పాత్రలు పోషించినా, ‘సీతయ్య’ చిత్రంలో ‘సీతయ్య’ పాత్ర ఆయన స్వభావానికి సరిపోయేదిగా వుండి, నిలిచిపోయంది. పైపెచ్చు, ‘సీతయ్య’ అనగానే వెంటనే ‘ఎవరీ మాటా వినడు’ అనే ట్యాగ్‌ లైన్‌ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆయన నిజజీవితంలోనే అంతే. కాకుంటే ఆయనకు నంది బహుమతి తెచ్చిపెట్టింది ‘లాహిరి లాహిరి లాహరిలో’ లోని కృష్ణమనాయుడి పాత్ర.
రాజకీయాల్లో తండ్రి వెంటే వున్నా,పదవులను స్వీకరించటంలో పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, ఎన్టీఆర్‌ సతీమణిని కోల్పోయిన చాలా కాలం తర్వాత లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1994 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1995 ఆగస్టులో శాసనసభ్యుల్లో అధిక  భాగం ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబు వైపు వచ్చినప్పుడు, హరికృష్ణ చంద్రబాబు వైపు వచ్చారు. ఆ తర్వాత   హరికృష్ణ ఆరు నెలల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన శాసనసభ (అప్పటికి మండలి లేదు) నుంచి ఎన్నికకాక పోవటంతో, మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని నెలలకే ఎన్టీఆర్‌ చనిపోయారు. అప్పుడు, దుఃఖంలో వున్న కుటుంబ సభ్యులనందరికీ పెద్ద దిక్కుగా వున్నారు. అశేష జనవాహిని ఎన్టీఆర్‌ ను చూడటానికి వచ్చినప్పుడు, ఎన్టీఆర్‌ అంతిమ యాత్రనంతటినీ హరికృష్ణే తన నుస్నల్లో నడిపించారు.
ఎన్టీఆర్‌ మరణానంతరం, చంద్రబాబు తో విడివడి ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. అప్పుడు (1996లో)  పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్‌లో విజయకేతనాన్ని ఎగురవేసిన బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత హరికృష్ణ పార్టీతో పొత్తు కూడా పెట్టుకన్నారు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి.
కొన్నాళ్ళకు మళ్ళీ హరికృష్ణ  ‘తెలుగుదేశం’ పార్టీలో చేరారు.అప్పటినుంచీ అదే పార్టీలో కొనసాగుతూ  వచ్చారు. పార్టీ కార్యకర్తలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వుండేవి. అందుకే ఆయన పార్టీ పదవుల్లో వుంటూ వచ్చారు. మరణించేనాటికి ఆయన పార్టీ పాలిట్‌ బ్యూరో సభ్యులు.

విశ్రమించిన చైతన్యరథ సారథి 

ఆయన తెల్లవారు ఝామున లేచి నెల్లూరు వెళ్ళటానికి కారణం కూడా ఆయనకు తన అభిమానులపై వుండే మమకారమే.
ఆయన ముగ్గురు తనయుల్లో ఒకరు (జానకీ రామ్‌) ఇలాగే 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇద్దరిలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అగ్రశ్రేణి హీరో. మరో తనయుడు కళ్యాణ్‌ రామ్‌ కూడా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
హరికృష్ణ అనగానే  రెండు అంశాలు గుర్తుకు వస్తాయి. ఒకటి: ముక్కుసూటి తనం. రెండు: వెనక్కితగ్గని తనం. అందుకే సినిమాల్లోనే కాదు,  జీవితంలో కూడా రౌద్రానికి  ప్రతిరూపంగా ాయన వుంటారు. అయన  ఎక్కడున్నా ఒక తుపాను. ఒక ఉప్పెన. ఒక హరికేన్.

-సర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *