కాంగ్రెస్-దేశంల వ్యూహం: ‘దళిత ముఖ్యమంత్రి’
ఇలా రద్దు కాగానే, అలా పొత్తు కు సిధ్దమయిపోతున్నాయి. అవును ఆ రెండే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు. రెండూ ఆగర్భశత్రుపక్షాలు. ‘దుష్ట కాంగీ’ అంటూ వ్యాన్ టాపెక్కి తిట్టిన ఎన్టీఆర్ తిట్లను పక్కన పెట్టేస్తోంది తెలుగుదేశం. తెలంగాణలో ‘గులాబీ’ పార్టీకి వ్యతిరేకంగా ఈ రెండు జట్టుట్టటానికి ఉబలాట పడిపోతున్నాయి. (ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ పొత్తువుంటుందా? లేదా? అన్నది తర్వాత విషయం.) గులాబీ పార్టీకి బలమైనా, బలహీనతయినా ఒక్కడే: కేసీఆర్. అలాంటి నేతను తెలంగాణలో ఎవరిని చూపిస్తారు? రెండు పార్టీలూ కలసి కనీసం ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిని చూపగలుగుతాయా? రమణ అంటే కాంగ్రెస్ ఒప్పుకోదు. ఉత్తమ్ అంటే తెలుగుదేశం కుదరదంటుంది.
అలాంటప్పుడు ఎవరిని ప్రత్యామ్నాయంగా చూపిస్తారు? ఈ రెండు పక్షాలకూ టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలంటే ఒకటే మార్గం: రెండు పార్టీల నుంచీ ఉమ్మడి అభ్యర్థిగా దళితుణ్ణి నిలబెట్టటం. రెండు పక్షాలలో బలమున్నది కాంగ్రెస్‌కే కాబట్టి, ఈ అభ్యర్థి కాంగ్రెస్ నుంచే తీసుకోవచ్చు. ఇలా చెయ్యటం వల్ల కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటుకాక ముందు దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తానన్న హామీని ఎత్తి పొడుస్తూ, ఆ వర్గాల వోట్లను కొల్లగొట్టవచ్చు. అలాంటప్పుడు ముందుకు వచ్చే పేర్లు గీతారెడ్డి, రాజనరసింహ తదితరులు. ఈ ఉభయ పక్షాలు ఈ దిశగా వెళ్ళే అవకాశం వుందన్న ఊహగానాలు ఇప్పుడిప్పుడే ఊపందుకన్నాయి. ఇద్దరిలోనూ గీతారెడ్డికి ఎక్కువ అవకాశాలు వుండవచ్చు. అందుకు కూడా కారణం కేసీఆరే. అసెంబ్లీ రద్దయ్యేంతవరకూ కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేరు. అందు చేత మహిళల వోట్లను ప్రభావితం చెయ్యటానికి దళిత మహిళను ముందుకు తెచ్చే అవకాశం వుంది.