సీఎం కుర్చీకి తెలుగు స్త్రీ ఎంత దూరం?
ప్రస్తుత సమాజంలో మహిళలు విద్య, వైద్య, వాణిజ్య రంగాలలో ముందంజలో ఉన్నారు. రాజకీయాలలో పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు మహిళ నాయకులు ఉన్నారు. అంతేకాకుండా దేశంలోనే మొదటి పౌరురాలుగా రాష్ట్రపతి హోదా వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో స్త్రీలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతుంటే మన తెలుగు రాష్ట్రాలల్లో, మహిళ ముఖ్యమంత్రి(ఇంతకుముందు వరకు ఉండేనేమో కానీ ఇప్పుడైతే కనీసం మంత్రి పదవి కూడ కేటాయించని పరిస్థితి) అనే ఊహ కూడా లేకుండ పోయింది.
నిజమే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్న రాజకీయ పార్టీలు తమ పార్టీలో ఉన్న స్త్రీ లకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఊహించలేం.
తెలంగాణ లోని టీఆర్ఎస్ అయిన, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం గాని మహిళలకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశమే లేదని ఇప్పటికే రుజువయ్యింది. ఎందుకంటే తమ తర్వాత తమ కుమారులున్నారు కదా! ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చదరంగం అంతాకూడా వారికి కట్టబేట్టడానికే.
ముఖ్యమంత్రి పదవి ఏమోగానీ, ముందు మంత్రి పదవిని కేటాయించకుండా నాలుగేళ్ళ పాటు ప్రభుత్వాన్ని నడిపించారు టి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్. కనీసం ఈ నాలుగేళ్ళ పాలనలో స్త్రీ,శిశు మంత్రిత్వ శాఖలో కూడా అవకాశంఇవ్వనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఏ మహిళ కి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని నమ్మాలి?
ఇక ఆంధ్రప్రదేశ్ కి విషయానికోస్తే, ఇంతకముందు ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్లయితే కొద్దొగొప్పో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మహిళల కి కొన్ని శాఖలలైన కేటాయించారు. అందులో ముఖ్యంగా గీత రెడ్డి, కొండా సురేఖ, సబితా ఇంద్ర రెడ్డి, అరుణ కుమారి లకు కొన్ని శాఖలు నిర్వహించారు. అంతకంటే ముందు రాష్ట్రంలోనే మొట్టమెదటి మహిళ హోం మినిస్టర్‌గా సబిత ఇంద్రారెడ్డిని చేశారు. ఇక్కడ కనీసం హోం మినిస్టర్ స్థాయిలో ఒక మహిళకి కేటాయించడం గర్హనీయమే(ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ అప్పటి పరిస్థితుల వరకు కొంత ముందు ఉన్నట్లే). ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన ఆనంతరం రెండు రాష్ట్రాలలో మహిళ మంత్రిని కూడా కేటాయించని పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇదిలా వుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతైనా సీనియర్ ముఖ్యమంత్రి కదా! ఒకడుగు ముందుకేసి ఇద్దరు మహిళలను తన కేబినేట్‌లో మంత్రులను చేశారు.
తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాకే కాదు, అంతకు ముందుకూడా మహిళా ముఖ్యమంత్రి అన్న ప్రతిపాదనే తెలుగు గడ్డ మీద రాలేదు. బహుశా! ఏ పార్టీ నాయకులు మహిళ ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించినట్లు లెరేమో!? కాని శాసన సభలో స్పీకర్ గా ప్రతిభా భారతిని నియమించారు.
బిజేపి పార్టీ నేషనల్ పార్టీ అయిన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి అంతగా ప్రాధాన్యం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి బిజేపి లో తన బాధ్యతలు నిర్వహించడంలో కీలకపాత్ర నిర్వహిస్తున్నారు. బిజేపి నేతల్లో సీనియర్లు ఉన్నా అధికారిక బాధ్యతలు మాత్రం పురంధేశ్వరి నిర్వహిస్తుందనడంలో సందేహమేమిలేదు. బి.జే.పి నుండి తనని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. (తెలంగాణలో పరిపూర్ణానందులు పీఠం వేసుకుని కూర్చున్నారు.) తెలంగాణ నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా గీతా రెడ్డి పేరు పరీశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.