కేసులు పాతవే: అరెస్టులు,సమన్లు కొత్తవి.!?
నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ విచిత్రం ఏమంటే నిప్పు పాతదే… కానీ పొగే కొత్తగా ఇప్పుడు వస్తోంది. ఇదెంటో కొత్తగా ఉందనుకుంటున్నారా..? ఏం లేదండీ దీనిలో తలలు పట్టుకుని ఆలోచించాల్సిన పనేలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినట్లయితే అర్థం అయిపోతుంది. వరుసగా ప్రతిపక్ష నేతల అరెస్టులు, వారికి సమాన్లు అందడం చూడటానికి వింతగా ఉంటుందేమో కానీ, ఇది మాత్రం నిజం.
ఎప్పుడొ 14 యేళ్ళ జరిగిన కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్టు అనేది కొంత విడ్డూరంగా అనిపిస్తుంది. దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అరెస్టు చేయడం వెనక అంతర్యం ఏమిటనేది ప్రజలకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా మరో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పోలీసులు సమాన్లు పంపించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ స్థలాల విషయంలో ఆక్రమాలు చోటు చేసుకున్నాయన్న అరోపణలపై రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారనేది తెలిసిందే. 2003 నుంచి 2005 వరకు రేవంత్ రెడ్డి సోసైటీ పాలక మండలి సభ్యులలో ఒకరు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… ఈ ఇద్దరు నేతలు దశాబ్దం క్రితం నాటి కేసులు కావడం ఒకటైతే, ఈ ఇద్దరు ప్రతిపక్షంలోని గట్టి పోటీనిచ్చే నాయకులు కావడమే కారణమని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే ఎన్నికలను క్యాంపేయిన్‌లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ కుట్ర జరుగుతున్నట్లు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ నిర్వహించిన ప్రగతి నివేధన సభకు అనుకున్నంత ప్రజాధరణ దక్కలేదని, ఒకవేళ సంగారెడ్డిలో కాంగ్రెస్ సభ విజయవంతం అవుతుందేమోననే భయంతోనే ఇదంతా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసమీకరణను సాధించే నేత సంగారెడ్డి మాజీ ఎమ్మేల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) అరెస్టు చేసి జైలుకు పంపగా, తన వాక్పటిమతో ప్రజలని మెప్పించే నాయకుడు మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపిచడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చానీయంశంగా ఉంది. ఇంకా ముందు ముందు తెలంగాణ రాజకీయ చదరంగంలో ఏవిధంగా ఉండనుందో చూడాలి మరీ…