ఆహా..అనిపించిన డొక్కు కారు ‘ఆత్మ’కథ
రేటింగ్:3/5
క్విక్ లుక్:
ఫస్ట్ ఇంప్రెషన్: భయపెట్టి మురిపిస్తుంది; మురిపించి భయపెడుతుంది. క్లయిమాక్సే కొంచెం బలహీనంగావుంటుంది.
ప్లస్ పాయింట్స్:
-బిగింపు వున్న కథ
-ఆశ్చర్యాన్ని కొనసాగించే స్రీన్‌ప్లే
– విజయ దేవరకొండ విలక్షణ నటన
– వినోద్మాకమైన ‘సిట్ కామ్’ (సందర్భోచిత హాస్యం)
– కారును పాత్రచెయ్యగల సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
-అసంతృప్తికరమైన క్లయిమాక్స్
– తేలిపోయన పాటల చిత్రీకరణ
-ప్రారంభంలో కొంచెం ‘ల్యాగ్'(సాగుడు)
-మూఢనమ్మకాలకు ఊతమిచ్చే ‘సూడో సైన్స్’
ఎవరెవరు?
-చిత్రం: టాక్సీవాలా
నటీనట వర్గం:విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మధునందన్, మాళవికా నాయర్,రవిప్రకాష్, షిజు, ఉత్తేజ్, రవి వర్మ, మహేష్ విట్టా
దర్శకత్వం:రాహుల్ సాంకృత్యాయన్
నిర్మాత:మనోజ్ కుమార్, శ్రీనివాస్ కుమార్ నాయుడు
కథ :రాహుల్ సాంకృత్యాయన్
స్కీన్ ప్లే:సాయికుమార్ రెడ్డి
సంభాషణలు:సాయికుమార్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
సంగీతం:జేక్స్ బిజయ్
విడుదల తేదీ:17నవంబరు 2018
కథాంశం: భయాన్ని మింగే ఆప్యాయత
అవనరం ఎంతపనయినా చేయిస్తుందటారు. అది నిజమో కాదో, తెలియదు కానీ, ఆప్యాయత ఎంతటి భయాన్నయినా తీసివేస్తుంది. ఈ కథాంశం తో హారర్ సినిమా తియ్యవచ్చా? తీసి చూపించారు రాహుల్ సాంకృత్యాయన్
కథ: కారు‘ఆత్మ’ కథ
నగరం వచ్చిన శివ( విజయ్ దేవరకొండ) పలు ఉద్యోగాలు చేసి, కుదరక, పాత కారు కొనుక్కుని, క్యాబ్‌డ్రైవర్ గా స్థిరపడతాడు.. కాదు, కాదు, అస్థిరపడతాడు. డబ్బు కష్టాలు తీరి కొత్త కష్టాలు వస్తాయి. కారులో ‘ఆత్మ’ వుంటుంది. ఈ ‘ఆత్మ’ కో పగ. ఆ పగ శివ ద్వారా తీర్చుకుంటుంది. కడకు ‘ఆత్మ’ కూడా శివకు ఊహించని మేలు చేస్తుంది. అదే కథ.
ట్రీట్‌మెంట్: కనపడకుండా భయపెట్టటం
ఈ మాత్రం దయ్యం కథలు గతంలో చాలా వచ్చాయి. కానీ ఇందులోని ట్రీట్‌మెంట్ కొత్తది. ఎక్కడా దయ్యం కనపడదు. ఏ రూపాన్నీ చూపించకుండా కావలసిన భయాన్ని సృష్టించటం ఈ కథకిచ్చిన కొత్త ట్రీట్‌మెంట్.
స్క్రీన్ ప్లే: అంచనాకు అందకుండా..
నిజానికి అతి చిన్న కథ. ఇంకా చెప్పాలంటే ఒకే ఒక ఘటన. దాని చుట్టూనే కథ తిరుగుతుంది. కానీ ఎక్కడా బిగింపు సడలకుండా , ఊహకు అందకుండా సాగటానికి స్క్రీన్ ప్లే పనికి వస్తుంది.
సంభాషణలు: అతిగా వుండవు
సంభాషణల రచయితకు కడుపుబ్బ నవ్వించటమే కాదు, కంట తడిపెట్టించటం కూడా తెలుసనిపిస్తుంది. ’ఆడవాళ్ళు ఒంటిమీద బంగారాన్ని ఇద్దరికే ఇస్తారు. కట్టుకున్న భర్తకీ, కడుపున పుట్టిన బిడ్డకు..’అని అంటాడు విజయ్ అన్నయ్య. తన వదిన బంగారాన్ని అమ్మిన డబ్బిస్తూ.. ఇక హాస్యానికి అన్నీ ఉదాహరణలే.
హీరో: షాకివ్వడు, షాకిస్తాడు
భావ తీవ్రతలు ఎక్కువ గా వున్న పాత్రలకు విజయ్ దేవరకొండ బాగా సరిపోతాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో అతనిమీద ఈ ముద్ర బాగా పడింది. అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియకుండా వుండే పాత్రలయిలే ఆయన బాగా న్యాయం చేస్తాడని అంటుంటారు. కానీ ఈ చిత్రంలో అలా కాదు. అతడికి ఎప్పుడు ఏ చేదు అనుభవం ఎదురవుతుందో అతడికే అర్థం కాదు. అంటే షాకివ్వటం కాదు.. షాక్‌కు గురికావటం ‘టాక్సీవాలా’ పని అవుతుంటుంది. బాగా చేశాడు.
హీరోయిన్ పాత్ర వేసిన ప్రియాంక జవాల్కర్.. హాట్ కనిపిస్తుంది. మాళవికా నయ్యర్ మాత్రం గుర్తుండి పోతుంది. ఆమె తల్లిని ప్రేమిస్తూనే, నిందిస్తుంది. నిందిస్తునే ప్రేమిస్తుంది. ‘హాలీవుడ్’ అనే పాత్రను పోషించిన బాల నటుడు బాగా గుర్తుండి పోతాడు.
సినిమాటోగ్రఫీ: పెద్ద రిలీఫ్
గ్రాఫిక్స్‌తో పనిలేకుండా, ఇందులో కారు నటిస్తుంది. అలాగే ‘ఆత్మ’ కనిపించకుండా భయపెడుతుంది. ఈ రెంటికీ సినిమాటోగ్రఫీ ప్రాణం.
కొసమెరుపు: ఎంత సేపు భయపడ్డారూ.. లేదా ఎంత సేపు నవ్వారూ.. కాదు. నవ్వుతూ భయపడతారు; భయపడుతూ నవ్వుతారు.. ఈ సినిమా చూస్తున్నంత సేపూ.. ఇంతకు మించి వినోదం ఏమి కావాలి?
-సర్