‘మహా’నాయకుడా..? ‘మహా’ నాథుడా..?
క్విక్ లుక్:
ఫస్ట్ ఇంప్రెషన్: ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్టు బాగుందా? రెండో పార్టు బాగుందా? అందరూ అడిగేది ఇదే ప్రశ్న. సమాధానం ఒక్కటే: రెండు పార్టులుగా తీయటం బాగుంది. అనుమానం లేదు. జాగర్ల మూడి రాధా కృష్ణ అనబడే క్రిష్ అత్యంత సమర్థవంతమైన దర్శకుడు. ఈయన ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు ముక్కలు తీశారు. మొదటి ముక్క ‘కథానాయకుడు’. అందులో ఎన్టీఆర్ సినిమా జీవితం దాదాపు చూపించేశారు. రెండు ముక్క ‘మహానాయకుడు’ లో ఏముంటుందని ఊహిస్తాం? ఎన్టీఆర్ రాజకీయ జీవితం మొత్తం వుంటుందని అనుకుంటామా లేదా? అలా లేదు. అది 1985 వరకూ వచ్చి ఆగిపోతుంది. కారణం ఆయన మొదటి భార్య నందమూరి బసవతారకం తుదిశ్వాస విడవటంతో కథ ముగుస్తుంది. ఆ తర్వాత ఇంకా రసవత్తర రాజకీయ జీవితం వుంటుంది. ప్రతిపక్ష నేతగా అయిదేళ్ళు పార్టీని నడిపిన తీరు విశేషంగా వుంటుంది. సారావ్యతిరేక ఉద్యమనేపథ్యంలో, ఆయన ‘మద్యనిషేధం’ హామీ ఇచ్చి, లక్ష్మీపార్వతిని పెళ్ళాడి, తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రయాణం మరింత రసవత్తరంగా వుంటుంది. క్రిష్ ఈ భాగాన్ని ఎందుకు వదిలేశారో..? ‘మూడో ముక్క’ తీద్దామనుకున్నారా? పొరపాటున కూడా అనుకున్నట్లు లేరు. అలాంటి ఛాయలేమీ కనపడలేదు.
కథాంశం:
కేన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఫోటో అల్బమ్ చూస్తూ, గత స్మృతులను ఎన్టీఆర్ కథానాయకుడులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం(గా విద్యాబాలన్) నెమరు వేసుకుంటూ వుంటుంది కదా. మళ్లీ ఆ దృశ్యాన్ని చూపించేసరికి ‘ఎన్టీఆర్- మహానాయకుడు’ కథ సగం అవుతుంది. తెలుగుదేశం ఆవిర్భావం…ఎన్టీఆర్ (గా బాలయ్య) పసుపు జెండా డిజైన్ గోడమీద వెయ్యటంతోనూ, ప్రచారానికి ‘డొక్కు వ్యాన్’ ను చైతన్య రథంగా మార్చటంతోనూ, హరికృష్ణ(గా కల్యాణ్ రామ్) సారథ్యం వహించటంతోనూ మొదలవుతుంది. స్పందన చూసి, ప్రధాని ఇందిరా గాంధీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎనిమిది నెలలు ముందుకు జరుపుతారు. ఇక అప్పటి నుంచి భాస్కరరావు.. అదే (సచిన్ ఖెడేకర్ పోషించిన) నాదెండ్ల భాస్కరరావు పాత్ర మొదలవుతుంది. మొత్తం ప్రతికూల పాత్రే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ మహానాయకుడు లో ఈయననే మెయిన్ విలన్ గా చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ గెలవటమూ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యటమూ, భాస్కరరావు మాట విని ఎన్టీఆర్ అపఖ్యాతి పాలవ్వటమూ, ఈ లోగా అల్లుడు నారా చంద్రబాబు నాయుడు (గా రాణా దగ్గుబాటి) ప్రవేశం చెయ్యటమూ చకచకా జరిగిపోతాయి. ఈ లోగా ఎన్టీఆర్- బసవతారం చికిత్స నిమిత్తం ఆమెరికా వెళ్ళి తిరిగి వచ్చేసరికి, భాస్కరరావు తనకు శాసన సభ్యుల్లో మెజారిటీ వుందని గవర్నర్ కు చెప్పటమూ అంతే వేగంగా ముగిసిపోతాయి. ఇక ఆ తర్వాత తెలిసిన కథే. నాదెండ్ల భాస్కరావు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు శాసన సభ్యుల్ని కూడగట్టి జారిపోకుండా వుంచి, తిరిగి ఎన్టీఆర్‌కు అధికారం దక్కేంత వరకూ కీలక పాత్ర పోషించినట్లుగా క్రిష్ చూపిస్తారు.
ట్రీట్‌మెంట్:
ఫ్యామిలీ సెంటిమెంటు తో పొలిటికల్ బయోపిక్ ఎవరయినా తీస్తారా? కానీ క్రిష్ తీశాడు. అంతా రాజకీయమే చెబుతారు..కానీ, ఆయన గల్లీకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా కుటుంబమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. భార్యా,భర్తల అనుబంధం చుట్టూనే ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చెప్పారు. ఇలా తీయటంలో రాజకీయ వుద్దేశ్యాలు వుంటే వుండవచ్చు. ఎన్టీఆర్ జీవిత భాగస్వామి అంటే బసవతారకమే.. ఆ తర్వాత వచ్చిన వారు కారు.. అని చెప్పటం కోసమే ఈ వ్యూహాన్ని పాటించి వుండవచ్చు. ఆ వచ్చిందెవ్వరని వేరే చెప్పనవసరం లేదు. ఈ ప్రయోజనం ఎలా వున్నా, బసవతారకం జ్ఞాపకాల్లోంచి, అంచనాల్లోంచీ, ఆకాంక్షల్లోంచీ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించటం వల్ల కథకు కొత్త ట్రీట్‌మెంటు దొరికనట్లయ్యింది.
స్క్రీన్ ప్లే:
తెలిసిన కథను తెలియనట్లు చూపించటమే బయోపిక్‌లో విశేషం. అందుకే అతి సాధారణ ఘట్టాలను కూడా ఉద్విగ్న సన్నివేశాలుగా మార్చాలి. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక, ఫలితాలు వస్తుంటాయి. ఈ దృశ్యాలను బాగా గుర్తుండిపోయేటట్టు చిత్రిస్తారు క్రిష్. ఎలాగూ ఆయన పార్టీయే గెలుస్తుందని అందరికీ తెలుసు. ఇది చరిత్ర కాబట్టి. కానీ ఫలితాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, పార్టీలో ముఖ్యులుకూడా ఆయన నివాసం వద్ద నుండే రేడియో వింటూంటారు. మొదటి ఫలితం వస్తుంది. కానీ తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్ గెలిచినట్లు తెలుస్తుంది. అందరూ డీలా పడిపోతారు. అప్పుడు బసవతారకం స్వీట్లు పంపిణీ చేయిస్తారు. అదేమంటే, ఆయన సినిమాలు కూడా అంతే. మొదటి సినిమా సక్సెస్ కాలేదు. కానీ ‘తర్వాత విజయాలే.. విజయాలు.’ ఈ విషయమే వారికి చెప్పిస్తుంది. ఇంతకీ ఈ ఫలితాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ వున్నారు..? ఇంట్లోనూ,పార్టీలోనూ అందరూ ‘నరాలు తెగిపోయే టెన్షన్’తో రేడియో వార్తలు వింటుంటే, ఈయనేమో, ఎంచక్కా మేడ గదిలో పిల్లలతో ఆడుకుంటుంటారు. చిత్రంగా వుంది కదూ! మామూలు చిత్రంగా కాదు.. ఏకంగా ‘హాలీవుడ్ చిత్రం’ గా వుంది. అవును. స్పీల్ బెర్గ్ అబ్రహాం లింకన్ పై తీసిన బయోపిక్ ‘లింకన్’ లో ఇలాంటి సీనే వుంటుంది.. ఇలాంటి సీనేమిటి.. ఈ సీనే వుంటుంది. చట్ట సభలో నల్లవారి బానిసత్వ నిర్మూలన బిల్ల్లు మీద వోటింగ్ జరుగుతుంది. అమెరికా చరిత్రలో ఇదో ముఖ్య అధ్యాయం. లింకన్ కృషికి ఫలితం వచ్చే సందర్భం అది. అక్కడ చర్చ జరుగుతుంటే అమెరికా అధ్యక్షుడయిన లింకన్ ఖచ్చితంగా ఇంటిదగ్గర మేడ గదిలో పసివాడితో ఆడుతూ వుంటాడు; కథలు పుస్తకం చూపి కథలు చెబుతుంటాడు. (అమెరికా అధ్యక్షుడు చట్టసభలో వుండనసవరంలేదు. కానీ ఎక్కడున్నా టెన్షన్‌తో వుండాలి కదా.. కానీ వుండడు. ఆయన పోరాటం మీద ఆయనకున్న విశ్వాసం అలాంటిది.) క్రిష్ కూడా అలా చేశాడు. క్రిష్ స్పీల్ బర్గ్‌ను అనుకరించాడని ఎందుకనాలి? స్ఫూర్తి పొందాడని అనుకుందాం.
హీరో:
కథానాయకుడిలో కన్నా, మహానాయకుడిలో నందమూరి బాలయ్య ఎన్టీఆర్‌లాగా ఎక్కువ కనిపించారు; ఎక్కువ అనిపించారు. అంతేకాదు, కరుణ రస సన్నివేశాల్లో కళ్ళు చెమర్చేలా చెయ్యగలిగారు. బాలయ్య ఇతర సినిమాలు చూసిన వారికి ఈ అనుభవం కాస్త కొత్తగా వుంటుంది. అందుకు సంభాషణలు కూడా దోహద పడ్డాయి. అమెరికాలో బసవతారకానికి వైద్యం చేస్తున్న వైద్యుడితో మాట్లాడుతున్న సన్నివేశంలో,ఎన్టీఆర్ ‘నన్ను పన్నెండు సార్లు తండ్రిని చేసింది… నాకు ఆమె భార్య మాత్రమే కాదు, పన్నెండు సార్లు నన్ను ప్రసవించిన తల్లి’ అని కన్నీటి పర్యంత మవుతారు. కాకుంటే ‘చైతన్య రథం’ మీద నుంచి ఉపన్యాసం చేసినప్పుడు మాత్రం.. ఎన్టీఆర్ హావభావాలయితే వచ్చాయి కానీ, ఆ ఉధృతి రాలేదు.
ఇతర నటీనట వర్గం:
బసవతారకంగా విద్యాబాలన్ మొదటి భాగంలో కన్నా, ఈ భాగంలో మరింత పరిణతి కనిపించారు. ఎన్టీఆర్ పట్ల భక్తినీ, ఇష్టాన్నీ డైలాగులతో పనిలేకుండా కేవలం కళ్ళతో ప్రకటించేశారు. ఇక చంద్రబాబు నాయుడు పాత్రలో రాణా దగ్గుబాటి అతి జాగ్రత్తగా నటించారు. చంద్రబాబులా ఎప్పుడూ తీక్షణంగానే చూస్తు వుండిపోతుంటారు. మధ్యమధ్యలో ‘బాహుబలి’లోని ‘భల్లాల దేవుడు’ పూనినట్లు చూస్తుంటారు.’నాన్నా హరీ! ‘ అనగానే కాలుస్తున్న సిగరెట్టు కింద పారేసి వచ్చే పధ్ధతిలో అచ్చం ‘హరికృష్ణ’ నే అనుకరించారు కల్యాణ్ రామ్
రాజకీయ కోణం: తెలుగుదేశానికి ప్రచారం
ఈ చిత్రంలో మూడు రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి:ఒకటి: చంద్రబాబు ఎన్టీఆర్‌ను కంటికి రెప్పలా చూసుకున్నాడని తెలియజేయటం ( రెండవ వెన్నుపోటు ఈ చిత్ర పరిధిలోకి ఎలాగూ తీసుకు రాలేదు.) రెండు: ఎన్టీఆర్ భార్య అంటే బసవతారకమే మరొకరు కారనే ముద్రను వెయ్యటం. మూడు: ముంచుకొస్తున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దోహద పడటం.
కొసమెరుపు:
ఈ చిత్రానికి క్రిష్ కాకుండా మరొక దర్శకుడు వుండి వుంటే ఇది ఉత్త ప్రచార చిత్రంగానే మిగిలిపోయేది. క్రిష్ తీయబట్టి పూర్తి రాజకీయ చిత్రం కాపోయినా.. రాజకీయ సన్నివేశాలున్న ఫ్యామిలీ డ్రామాలాగా మిగిలింది. కానీ మరో మార్గం లేదు. దీనిని బయోపిక్ అనే పిలవాలి.
-సర్