బిగ్ బాస్-3 లో ట్రాన్స్‌జెండర్
ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ థర్డ్ సీజన్ రెడీ అవుతున్న విషయమూ తెలిసిందే. దానికి హోస్ట్‌గా హీరో నాగార్జున పేరు కూడా దాదాపు ఫైనల్ అయిన విషయం కూడా తెలిసిందే.ఇంతకు ముందు ఈ షోకు హోస్ట్‌లు గా జూనియర్ ఎన్టీఆర్, నానీలు టాపులేపారు. మరీ ముఖ్యంగా తారక్ ను మరచి పోవటం చాలా కష్టం.
బిగ్ బాస్ త్రీ కు కూడా ఆ రేంజ్ వుండాలని నిర్వాహకులు భావించారు. మళ్ళీ తారక్, నానీల్లో ఒకరిని ట్రై చేద్దామనుకున్నారు కానీ, వారి షెడ్యూల్స్ బిజీగా వున్నాయి. హీరో వెంకటేష్ ను కూడా అడిగి చూశారు. ఆయన ఆసక్తి చూపలేదు. ఇక అన్ని విధాలా తగిన వాడు నాగ్ అని నిర్ణయించుకున్నారు. పైపెచ్చు ఈ పని ఆయనకు కొత్త కాదు. ఇంతకు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ షో ను నిర్వహించి దుమ్ములేపాడు. అయితే నాగార్జున ఇప్పుడు మన్మథుడు-2 చిత్రం షూటింగ్ లో తలమునకలయి వున్నాడు. అది పూర్తి కాగానే ఇక బిగ్ బాస్ లోకి దూకవచ్చు.
నాగార్జున హోస్ట్‌గా వండే ఈ షోలో పాల్గొనటానికి ఇంకెవరెవరు వుంటారు? పరిశీలనలో వున్న వారి పేర్లు తెలిస్తే కాస్త ఆశ్చర్యంగా వుంటుంది. ఇటీవలనే సర్జరీ ద్వారా ‘ట్రాన్స్‌జెండర్’గా మారిన సాయితేజ వారిలో ఒకరు కావచ్చు. సాయి తేజ అనగానే జబర్‌దస్త్ షో గుర్తుకొస్తుంది. సాయి జబర్‌దస్త్‌లో ఆడవేషం వేస్తే, అచ్చుగుద్దినట్లు ఆడపిల్లలానే వుంటాడు.
ఈ మధ్య సాయితేజ ఇచ్చిన ఇంటర్వ్యూు చూస్తే, అతని జీవితమే యుధ్దంలాగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే ‘ఎల్‌జీబిటీ’ కమ్యూనిటీ హక్కును గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి తేజ నిజంగానే షోకు ఒక ప్రత్యేక ఆకర్షణగా వుండగలడు. దాంతో పాటు ‘టిక్‌టాక్’ యాప్ ద్వారా కామెడీ చేస్తున్న ఉప్పల్ బాలు, అలాగే జబర్‌దస్త్ నుంచే మరో నటుడు సుడిగాలి సుధీర్ ఉండబోతున్నారు. చూద్దాం. ఇంకా ఎవరెవరు బిగ్‌బాస్ 3 లోకి వస్తారో..?