రాజేంద్రప్రసాద్…కొత్తా ‘దేముడం’డీ..!
హీరో,కమెడియన్,కేరెక్టర్ యాక్టర్, కామికల్ విలన్… వీటన్నిటితో పాటు పూర్తి ఆడవేషం… ఇన్ని పాత్రలు పోషించిన రాజేంద్రప్రసాద్ కు … ఒకే ఒక్క కోరిక మిగిలిపోయింది. అలాగని రాజకీయల్లోకి వచ్చి, మంత్రో, ముఖ్యమంత్రో ఆయిపోవాలని కాదు… అంతకు మించి కావాలని..! అంటే..!? ఎవరూ పడి ఏడ్వకుండా వుంటానంటే ఆయన చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎకాఎకిన ‘దేవుడు’ అయిపోదామనుకుంటున్నాడు.
షాక్ అవ్వాల్సిన పని లేదు. ఎన్టీఆర్ ‘దేవుడ’వ్వలేదూ..!? అలాగా..! రాముడన్న, కృష్ణుడన్నా అందరికీ గుర్తొచ్చేది ఎన్టీఆర్. కానీ రాజేంద్రప్రసాద్‌కు ఈ విషయంలో క్లారిటీ వుంది. ఆయన కృష్ణుడికే టిక్కు పెడుతున్నారు. ఆ పాత్రలో నవరసాలూ వుంటాయి. శృంగార రసం సహా..!
ఈ ముక్కను ఈ మధ్య ఒక ఇంటర్వూలో బయటపేట్టారు. రాజేంద్రప్రసాద్‌కు బలమూ, బలహీనతా ఒకటే. వయసు మీద పడిందంటే ఒప్పుకోడు. కావాలంటే తానే వయసు మీద పడతాడు. ఆయనకిప్పుడు 64 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణుడేమిటి ఆనకూడదు.
ఆ మాటకొస్తే కృష్ణ పాత్ర ఆయనకు కొత్త కాదు. ఇంతకుముందు ”కన్నయ్య, కిట్టయ్య” ‘ఏమయింది నాలో’ వంటి సినిమాల్లో రాజేంద్రప్రసాద్ కృష్ణుడిలా ప్రత్యక్షమయ్యాడు . కానీ ప్రాబ్లెమ్ ఏమిటంటే… అంతలోనే మాయమవుతాడు. అలా కాకుండా నిడివి వుండే… అలాగే కలకాలం నిలిచి వుండే కృష్ణ పాత్ర చెయ్యాలన్నది ఆయన సంకల్పం.
అయితే ఈ పౌరాణిక స్వప్నానికి ఇతర కారణాలు కూడా లేకపోలేదు. ఆయనకు రావాల్సిన క్యారెక్టర్ యాక్టర్, కామెడీ విలన్ పాత్రల్ని రావు రమేష్ వంటి వాళ్ళు తన్నుకుపోతున్నారు. అలాగని ఆయన బిజీగా లేడని కాదు. మునుపటి కంటె ఎక్కువ పాత్రలు వస్తున్నాయి. పేరూ, ఊరు లేని నిర్మాత, దర్శకులు ఆయనతో సినిమాలు తీసి పారేస్తున్నారు. వాటిని చూసే భాగ్యం ప్రేక్షకులకు కలగటం లేదు. ఎందుకంటే అవి రిలీజ్ కావాలి కదా… అందుకే హఠత్తుగా దేవుడు కావాలనుకుంటున్నాడు. వెంటనే ‘హే కృష్ణ’ అనకండి సుమా! రాజేంద్రప్రసాద్ ప్రత్యక్షమయ్యే ప్రమాదముంది.