‘నేను చాలు… నా కూతురు కూడానా..?’
లీడర్ కొడుకు లీడర్ అయినట్లు, వ్యాపారి కొడుకు వ్యాపారి అయినట్లు, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్లూ, యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్లూ… యాంకర్ కూతురు, యాంకర్ కావచ్చా? కావచ్చు. కానీ అంత ఈజీ కాదు. హీరో కొడుకు హీరో అయినంత సులువుగా, హీరోయిన్ కూతురు హీరోయిన్ కాగలుగుతుందా? ఎంతో కష్టపడాలి. పాతతరం హీరోయిన్లు హేమమాలిని, మంజుల, శ్రీదేవి లాంటి వారు ఈ విషయంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది ఒక యాంకర్ తన కూతురుని యాంకర్ చెయ్యాలనుకుంటే అది అంత సులువు కాదు.
ఈజీయో, ఈజీ కాదో తర్వాత విషయం. ఝాన్సీ తన కుమార్తెను పొరపాటున కూడా యాంకర్ కానివ్వని ఒక చోట తెగేసి చెప్పేశారట. ఝాన్సీ యాంకర్ మాత్రమే కాదు. మంచి నటి. సహజత్వం వుట్టిపడే పాత్రల్ని పోషించారు. గుంటూరు యాసలో మాట్లాడే పాత్రల్ని కూడా అవలీలగా చేశారు. అంతే కాదు. ‘చేతన’ వంటి ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వుంటూ, సామాజిక సమస్యల్ని వెలికి తీశారు.
కానీ జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కున్నారు. వైవాహిక జీవితం కూడా ఆమెకు ఒక చేదు అనుభవంలాగా మిగిలిపోయింది.స్త్రీ సమస్యలపై పలు మహిళా సంఘాలతో కలసి పనిచేసిన అనుభవం కూడా వుంది. యాంకర్ కేరీర్ తోనే ఆమె పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా, దానిని ముళ్ళ బాటగానే ఆమె చూస్తున్నారు. అందుకే తన తనయకు ఈ కేరీర్ వైపు రానివ్వటం లేదు. యాంకర్ వృత్తి మరీ అంత ప్రమాదకరమా?