FeaturedFilms

మల్లేశం: జీవితమే గొప్ప కళారూపం

రేటింగ్‌:4.5/5
క్విక్‌లుక్‌:
ఫస్ట్‌ ఇంప్రెషన్‌:
జీవితమే గొప్ప కళారూపం. దాన్ని చెడగొట్టకుండా తెరకెక్కిస్తే అంతకు మించి కళా ఖండం మరొకటి వుండదు. మల్లేశం ఓ బయోపిక్‌. మల్లేశం ఆసు యంత్రాన్ని కనిపెట్టిన నేతగాడు. కానీ మల్లేశం లాంటి వాడు మరొకడు వుండడన్నట్లు సినిమా తీయలేదు. ఈ సినిమా చూశాక, ఓ చేనేత కార్మికుడి మీద తీసినట్లే అనిపిస్తుంది. సాధారణంగా బయోపిక్‌లు ఇలా వుండవు. ఇంతటి గొప్పవాడు మరొకడు ఉండడేమో అన్నట్లు తీస్తారు. కానీ రాజ్‌ రాచకొండ ఈ పధ్ధతిని తలకిందులు చేశాడు.
కథాంశం:
నిజజీవితంలో చింతకింది మల్లేశం పెద్దగా చదువుకోలేదు. ఆరు దగ్గర ఆగిపోయింది అతని బడి చదువు. అలాంటి వాడు నేతకు ఉపయోగపడే ఆసు యంత్రాన్ని కనిపెడతాడు. అతడికి పద్మశ్రీ వస్తుంది. కానీ పెద్దగా లోకానికి అతని గురించి తెలియదు. కాకుంటే ‘టెడ్‌ టాక్స్‌’ లో అతని ఉపన్యాసం ఎవరినయినా కదలిస్తుంది. ఇంతవరకే తెలుసుకుని, అతణ్ని కలుసుకుని, తెలంగాణ పల్లెల్లో చేనేత కార్మికుల జీవితాల్ని తెలుసుకుని రాజ్‌ ఈ చిత్రానికి స్క్రిప్టు తయారు చేసుకున్నాడు.
ట్రీట్‌మెంట్‌:
ఇంతకీ ఈ యంత్రాన్ని కనిపెట్టాలని ఎందుకనిపించింది? తనను కనిపెంచిన అమ్మ రెక్కాడించి, అడించి భుజం ఎముక అరగ్గొట్టుకుంది. ఎనిమిదంకె లాగా దారప్పోగు తిప్పే ఆసు పనిని అమ్మ చేత్తో కాకుండా, యంత్రంతో చెయ్యిస్తే…. ? నెసెసిటీ ఈజ్‌ ది మదర్‌ ఆఫ్‌ ఇన్వెన్షన్‌. అంటారు. అవసరమే అన్వేషణకు మాతృక. కానీ ఈ సినిమా స్టోరీలైన్‌ చూశాక, ఈ సామెతను మార్చానిపిస్తుంది. ‘మదర్‌ ఈజ్‌ ది నెసిసిటీ ఆఫ్‌ ఇన్వెన్షన్‌’ అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మే అన్వేషణకు మూలం అయ్యింది. ఇదే కథకు కొత్త ట్రీట్‌ మెంట్‌.
స్క్రీన్‌ ప్లే:
పల్లె జీవితం ఎంత నిదానంగా వుంటుందో, ఈ స్క్రీన్‌ ప్లే కూడా అంతే నిదానంగా వుంటుంది. అమ్మచేతి కదలికలే, ఆనక యంత్రం కావాలన్న స్పృహతోనే దృశ్యాలు వస్తుంటాయి. జీవితం మధ్యలో మొదలు పెట్టి, ఫ్లాష్‌ బ్యాక్‌ లో బాల్యం చెప్పటం  వుండదు. లేదు. మల్లేశం కనపడకుండా పోయినప్పుడు, పెళ్ళికుదిరిన తీరును తీసేటప్పుడు తప్ప ఇంకెక్కడా వెనక్కి వెళ్ళి చూపించటం వుండదు. బాలుడుగా మల్లేశం, యువకుడుగా మల్లేశం, పెళ్ళాయ్యాక మల్లేశం, పట్నం వెళ్ళాక మల్లేశం, బిడ్డ పుట్టాక మల్లేశం…ఇలాగే వుంటుంది దృశ్య క్రమం కూడా. కానీ కథ ఎక్కడా ఫ్లాట్‌గా కనిపించదు. ఈ దశల్లోనే అమ్మ శ్రమ తగ్గించే యంత్రంకోసం మల్లేశం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ యత్నాలనే కథలో
అప్స్‌ డౌన్స్‌గా చూపటానికి వాడుకున్నాడు రాజ్‌ రాచకొండ
హీరో:
మల్లేశం ప్రియదర్శిగా మారిపోయాడు. అసలు మల్లేశానికీ, ప్రియదర్శికీ పోలికలే వుండవు. బయోపిక్‌ తీసేటప్పుడు పోలికల విషయంలో జాగ్రత్త పడతారు. మల్లేశం పనీ, పేరూ పరిచయమున్నంతగా, మల్లేశం రూపం తెలుగు వారికి తెలియదు. అందుచేత ప్రియదర్శి తాను ఈ పాత్ర చేసేటప్పుడు మల్లేశాన్ని అనుకరించలేదు. ఒకానొక చేనేతకార్మికుని పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియదర్శి అనగానే, హాస్యమూ, వెటకారమూ గుర్తుకొస్తాయి. కానీ ఈ చిత్రంలో అన్ని ఎమోషన్సూ పలికేస్తాడు. అతని స్థానంలో ఏ హీరోను పెట్టినా పాత్ర కనిపించేది కాదు. హీరోయే కనిపించేవాడు. ఇక్కడ పాత్రే కథ. కథే పాత్ర.
ఇతర నటులు:

మల్లేశం అమ్మ లక్ష్మిగా ఝాన్సీ, నాన్న నర్సింహులుగా చక్రపాణి ఆనందులు అలా ప్రేక్షకుల కళ్ళల్లో చిరంజీవుగా వుండిపోతారు. ఝాన్సీ వున్న సన్నివేశాల్లో అయితే ప్రియదర్శి కూడా చిన్నబోయినట్టుంటాడు. సంభాషణతో కన్నా, సంభాషణలు లేకుండా ఆమె ఎక్కువ భావాలను వ్యక్త పరచింది. కొడుకు మీద ప్రేమంతా లోపలే  దాచుకుని, పైకి కోపం వ్యక్తం చేసి, తర్వాత కుమిలిపోయే పాత్రలో చక్రపాణి ఆనంద ఝాన్సీ ముందు నిలవగలిగారు. కొడుకు మనియార్డరు పంపిస్తాడేమోనని గుమ్మం దగ్గర కూర్చుంటే, పోస్టుమాన్‌ దగ్గరకు వచ్చి రాలేదని చెయ్యాడిస్తూ వెళ్ళినప్పుడు, ఆనంద, ఝాన్సీలు నిరాశగా లోపలికి వెళ్ళిన దృశ్యం ఎప్పటికీ వెంటాడుతుంది. ఇక మల్లేశం భార్య పద్మగా అనన్య నాగళ్ళ చారడేసి కళ్ళతో ప్రపంచమంత ప్రేమను ప్రకటించేస్తుంది. ఆమె ఏ ఫ్రేమ్‌ లో కనిపించినా చాలా రిఫ్రెషింగ్‌గా వుంటుంది.

ఎడతెరపి లేని వాన మధ్య అప్పుడప్పుడూ వచ్చే మెరుపుల్లా, కడివెడు కన్నీళ్ల మధ్య కాసిన్ని నవ్వులు విరిస్తే.. ఇది కదా జీవితం అనిపిస్తుంది. అలా చూసినా ఈ సినిమా జీవితానికి నకలే. బతకలేక ఉరిపోసుకోవడమో,  బతుకుతో పోరాడి చితికి పోవటమో చేనేత వృత్తి అయిన తెంగాణ పల్లెల్ని చూసినప్పుడు, ఆ పల్లె మీదవిరక్తి కలగదు. పైపెచ్చు అనురక్తి కలుగుతుంది. పుడితే ఇక్కడే పుట్టాలీ అన్నంత ఇష్టం కుగుతుంది. అంతలోనే విసుగు, వెనువెంటనే ఆప్యాయత..పరమదరిద్రంలోనూ, నిండుమనుషులుగా చూపించటం బాగుంటుంది. అందుకే మైనర్‌ కేరక్టర్స్‌ కూడా మనసు మీద ముద్ర వేస్తాయి. తాగుబోతు రమేష్‌ ఈ సినిమాలోనూ తాగుబోతులాగే కనిపిస్తాడు. ఉన్నది నాలుగు నిమిషాలే. కానీ మంచివాడు తాగితే మరింత మంచివాడయి పోతాడేమోనన్న అనుమానం కలిగిస్తాడు.

కొసమెరుపు: తెలంగాణ యాసతో సినిమా తియ్యటం సులువే. కానీ తెలంగాణ పలుకుబడితో తియ్యటం కష్టం. మల్లేశం కేవలం విజయగాథ కాదు. యంత్రం కనిపెట్టిన వ్యక్తి జీవిత చరిత్ర మాత్రమే కాదు. దారాలు పెనవేసుకోవటం నేత ఎలా అవుతుందో, అనుబంధాలు పెనవేసుకోవటం జీవితం అని నిరూపించిన గొప్ప చిత్రంగా అనిపిస్తుంది మల్లేశం. ఈ సినిమా చూడకపోతే మనజీవితాన్ని మనమే మిస్సయ్యామా..? అన్న వెలితి మిగిలిపోతుంది.

-సర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *