FilmsNewsips

హీరోల ’వంట పాత్ర‘ పోషణ వెనుక రహస్యమేమి..?

కొన్ని సార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గానీ… రావడం మాత్రం పక్కా..!అనే ‘పవర్’ ఫుల్ డైలాగ్ వుంటుంది.  ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో  సినీ స్టార్స్ తీరు కూడా అలానే వుంది. ఈ పరిస్థితులలో సినీ నటులు ఒకరిని మించి మరొకరు సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తూ    (మరేమో కాదండీ..! ఈ మధ్యలో ఇంట్లో ఆడవాళ్ళకీ సహాయమనే ఛాలెంజ్ ఉంది కదండీ. అందులో ఏ ఇంటి పని చేస్తూనో అని) కనిపించాలనే దానిలో పోటీ పడుతూనే వున్నారు.  సినీ నటులు లాక్ డౌన్ కు ముందు, తర్వాత అని బేరీజు వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అంతకుముందు సినిమాల్లోనో లేదా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లలోనో, (ఇవి కాస్తా ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అయ్యాయిలెండి) లేదా ఇంటర్వూల్లోనో మనకు కనిపించేవారు. కేవలం ప్రోపెషనల్ గా మాత్రమే. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని కూడా పంచుకునే వారు కాదు. దీనికి కారణం  భద్రతా పరమైన కారణాలే కావచ్చు. వ్యక్తిగత విషయాల గురించి జనాల్లో అనవసర చర్చ ఎందుకనే అభిప్రాయం కూడా ఒక కారణమై ఉండచచ్చు. అప్పుడప్పుడు కొందరు నటినటులు వారు జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో వదులుతూ వుండేవారు. (అది అప్పటి సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడుతుందనే కారణమై కూడా ఉండవచ్చు.)

కానీ, ఈ లాక్ డౌన్ సమయంలో చాలామంది నటులు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. అందులో సందీప్ రెడ్డి వంగా (అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడు) మొదలుపెట్టిన ’’బి ది రియల్ మెన్‘‘ చాలెంజ్ కు సంబంధించినవి. తాను ఇంటి పనిలో సహాయ పడిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, దర్శకుడు రాజమౌళికి ఛాలెంజ్ విసరడంతో  ఇది ప్రారంభమైందనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం ఛాలెంజ్ చేసినంత మాత్రాన తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాళ్ళు ఏదైనా చేస్తారా..? అనే సందేహం ఏవరికైనా రావచ్చు. దీని వెనక అనేక కారణాలు ఉండి ఉండవచ్చు. సినిమా పరిశ్రమ మొత్తం మూతపడిన ప్రస్తుత సమయంలో వారికి కావలసినంత ఖాళీ సమయం దొరికింది కాబట్టి. ప్రస్తుతం ప్రపంచమంతా కరుణ రస ప్రధానమైన ఘట్టాలు నడుస్తున్నాయి. కాబట్టి  ఎవరూ మసిపూసి మారేడు కాయ చేసి నవరసభరిత చిత్రాలుగా మార్చలేరనే ప్రగాఢమైన విశ్వాసం కావచ్చు.

’’బి ది రియల్ మెన్‘‘ఛాలెంజ్ ను స్వీకరించిన దర్శకులు, నిర్మాతలు, హీరోలే కాకుండా వీరి తర్వాత ఇంకా చాలా మంది నటీనటులు (లింగభేదం, స్థాయి భేదం లేకుండా) కూడా వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఎందుకంటే టాలీవుడ్ కు ’’ట్రెండ్‘‘ ను ఫాలో అవటమే- తెలిసిన ఏకైక విషయం. చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే,  ’’సమరసింహా రెడ్డి‘‘ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు, ’నువ్వే కావాలి‘ తర్వాత స్నేహితులు ప్రేమికులుగా మారే సినిమాలు, ’హ్యాపీడేస్‘ తర్వాత కాలేజీ ఇతివృత్తంగా  చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి.  ఒక ప్రోడక్ట్ కు  అడ్వర్టటైజ్మెంట్ ఎంత ముఖ్యమో..!  అలాగే సెలబ్రెటీలు కూడా  ఎల్లప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచేలా ప్రణాళికలు రచిస్తుంటారు. అది వారికి అవసరం కూడా. ఇక్కడ  ప్రింట్ మీడియానా, ఎలక్ట్రానిక్ మీడియానా, సోషల్ మీడియానా, అన్నది ప్రధానాంశం కాదు.

అందుకే ఒకరిని మించి ఒకరు వస్తూనే వున్నారు. ఒకరు కిచెన్ లో నుంచి వస్తుంటే, మరోకరు హాల్ లో కనిపిస్తారు. ఇంకోకరు గార్డెన్ లో గార్డెనింగ్ చేస్తూంటే, మరోకరు వరండాలోనుంచి వస్తున్నారు. ఈ విధంగా ముందో, తర్వాతో గాని ప్రచారంలో మాత్రం ఒకరిని మించి మరోకరు పోటీ పడుతూనే వున్నారు. ఎంతైనా సినీ పరిశ్రమ కదా.!? ఆ మాత్రం పోటీ లేకపోతే ఎలాగా అని అనుకుంటున్నారో ఏమో.!?

– చంద్రశేఖర్.ఎమ్, విద్యార్థి

ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *