ప్రాణాలకు తెగించి అమ్ముతున్నాం… కొనేవారేరీ..!?
కోవిడ్-19… ప్రపంచాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకుని అడిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు లింగ భేదం, స్థాయి భేదం లేకుండా అందరినీ ఇంట్లో నుంచి బయటకి రాకుండా లాక్ డౌన్ చేసేసింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులతో అనుమతులు ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా రోజువారి అవసరాల కోసం మండి(కూరగాయాలను అమ్మే చోటు)లను ఏర్పాటు చేశారు. కరోనాకు ముందు సంతలో రైతులతో పాటు కొంత మంది తమ రోజు వారి పోట్ట కోసం కూరగాయాలను కొని, అమ్మకం చేస్తుండేవారు. అలాంటి వారి పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది.
ఇబ్రహీంపట్నం వాసి రాఘవులు, తన భార్య చంద్రమ్మ. వీరిద్దరు గత 30 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కూరగాయాల వ్యాపారం చేస్తున్నారు. వారికి సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తేలు. వారు పారంపర్యంగా ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. వారి వ్యాపారం కరోనాకి ముందు, తర్వాత ఒకేలా లేదూ, అని చెప్పవచ్చు. అంతకుముందు వ్యాపారం చాలా బిజీబిజీగా వుండేదని, ప్రస్తుతం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు వాపోయారు.
ఇంతకు ముందు మన “పట్నంలో ఎంత మంది మాంసాహారులు ఉన్నారో, అంతే మంది శాకాహారులు ఉన్నారు. కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ కూరగాయలను ఇంటికి తీసుకుని వెళ్తే కరోనాను కూడా ఇంటికి తీసుకువెళ్తామన్న భయంలో ప్రజలు ఉన్నారు. అదే మాంసం దుకాణాల ముందు అయితే మన ప్రజలు సాలు, సాలుగా గంటల తరబడి నిల్చుని 800/- నుండి 1000/- వరకు అయిన కొంటున్నారు. ఈ కరోనాకు ముందు ఒక రోజు కూరగాయలు అమ్మితే వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల వరకు మాకు లాభం వచ్చేది, కాని ఇప్పుడు మూడు వందల నుండి ఐదు వందల మాత్రమే మిగులుతూ ఉంది.
‘ఉదయం 4-5 గంటల మధ్యలో మేం మార్కెట్ కి వెళ్ళి రాత్రి 7 గంటల వరకు కష్టపడాల్సి వస్తుంది, అయిన లాభం లేని పనిలాగే వుంది. ఇది ప్రజల కోసం చేస్తున్నాం. అందరూ భయపడి ఇంట్లో కూచుంటే ఎలా..? ప్రజల కడుపులు ఎవరో ఒకరు నింపాలి కదా..! నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను. మీ ద్వారా ప్రజలకు. తాజా కూరగాయలను బాగా మరిగించి తినటం వలన ఏటువంటి రోగాలు దరికి రానే రావండి… ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. అందుకనే మంచి తాజా కూరగాయలు తినండి. ఆరోగ్యంగా ఉండండి‘‘ అని ఆ వ్యాపారి చెప్పుకొచ్చారు.
చిన్న రైతులకు, వ్యాపారులకు ఇది కాస్త కష్టంగానే ఉన్నా, తప్పడం లేదు. కొద్ది రోజులు తప్పదు అనుకుంటూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.
-ఆనంద్ కుమార్. విద్యార్థి
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.