FilmsNewsips

మారుతీ రావు పక్షమేనా వర్మకూడా…?

రాంగోపాల్ వర్మ… అనడం కంటే, వివాదాస్పద దర్శకుడు అంటే ప్రేక్షకులకి వెంటనే అర్థమవుతుంది. మరీ ఈసారి వివాదం ఏంటి అంటారా? రెండు సంవత్సరాల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య మళ్లీ మన ముందుకు రాబోతుంది. అయితే ఈ నిజమైన కథని ఆధారంగా తీసుకుని “మర్డర్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందు పెట్టబోతున్నారు. వర్మకు ఇలాంటి సినిమాలు తీయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు”రక్త చరిత్ర, లక్ష్మీ’స్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”అంటూ వివిధ వివాదాస్పద చిత్రాలని ప్రేక్షకుల ముందు పెట్టారు. కానీ ఆయన ఈ సినిమాలకు కరతాళ ధ్వనుల కన్నా; విమర్శలే ఎక్కువగా అందుకున్నారు. సామాజిక ఘటనలపై స్పందించడం మంచిదే కానీ వర్మ గారికి ఆ కోణం ఎందుకో అచ్చు రావట్లేదు. అయితే రెండు రోజుల క్రితం “ఫాదర్స్ డే” సందర్భంగా, ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేసారు.

ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వస్తున్న సందేహాలు వర్మ ఈ సినిమాలో విలన్ గా అమృతని చూపిస్తారా..? లేదా మారుతీరావునా..? అని. ఆయన మాటల్లో మాత్రం, ఒక తండ్రికి తన కూతురు పైన అతి ప్రేమ ఎక్కువైతే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని అంటూనే, ఇందులో ఎవరిని విలన్ గా చూపించడం లేదన్నారు. ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన కాబట్టి ఎవరి అభిప్రాయాలు వారికి  ఉంటాయి కావున, జరిగినది జరిగినట్లే చూపిస్తానని తెలిపారు. దీని గురించి అమృతని గాని, మరోకరిని గాని  ప్రత్యేకంగా కలవలేదని, కలవబోమని చెప్పారు.  ఈ సినిమా పోస్టర్లకు ఉపయోగించిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల నుంచే సేకరించారనీ చెప్పారు.

ఆ మద్య కాలంలో పరువు హత్యలు వరుసగా జరగడం చూసాము. వీటి ప్రభావం కూడా సమాజం పైన పడింది. అయితే ఇప్పుడు రాబోయే సినిమా కూడా ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందని అంచనాలు వేస్తున్నారు. పోస్టర్ విడుదల అయిన కొన్ని గంటలకే అమృత దీని పైన ఒక లేఖ ద్వారా తీవ్రంగా స్పందించిందంటూ, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, ఆ లేఖపై ఆమె మామయ్య బాలస్వామి,  అమృత దీని పైన అసలు స్పందించలేదని ఆవ్వన్ని కూడా పుకార్లని స్పష్టం చేసారు. కాగా, ఈ సినిమాలో అమృత పాత్ర సాహితి, మారుతీ రావు పాత్ర శ్రీకాంత అయ్యార్ నటించబోతున్నరని, రాబోయే, ఆగస్టు నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వర్మ ప్రకటించారు.

-సుమాంజలి.కె, విద్యార్థిని.

ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *