అర్జీవి వోటు : పరువుకా..? ప్రేమకా..?
‘ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది’’ అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. కానీ, ఒక ప్రేమను పరువు ముసుగులో మరో ప్రేమ భౌతికంగా దూరం చేసింది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మిర్యాలగూడలో ప్రేమించి, పెళ్ళితో ఒక్కటైయ్యారు యువ జంట అమృత-ప్రణయ్ లు. అంతలోనే వీరిపై పరువు కొరలు పడగ విప్పి బుసలు కొట్టింది. ప్రణయ్ ని అమృతకి భౌతికంగా దూరం చేసింది. ఆ చేసినదేవరో కాదు తన తండ్రి అని తెలిసి ఎక్కడ రాజీ పడలేదు అమృత. చివరి వరకు రాజీ కోసం ప్రయత్నించి, ఓటమితో తనను తాను మారుతీ రావు అంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిం చింది.
ప్రస్తుతం ఈ హత్యోదంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ గా నిలిచే దర్శకులు రామ్ గోపాల్ వర్మ. రెండు రోజుల క్రితం ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నానంటూ, ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ తో పాటు “ఓ తండ్రి తన కూతురిని అమితంగా ప్రేమిస్తే, ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనంటూ” ట్విట్ చేశారు. వర్మ విడుదల చేసిన పోస్టర్ లో అమృత, మారుతీ రావులు వున్న పాత్రలను పరిచయం చేశారు. ఈ సినిమా ద్వారా వర్మ ఏం చెప్పలనుకుంటున్నారు..? అనేది ప్రస్తుతానికి సమాదానం లేని ప్రశ్నే.
ఇప్పటి వరకు సున్నితమైన సామాజికమైన అంశాలను తన కథలుగా ఎంచుకున్న సందర్భాలు ఇప్పటి వరకు లేవు. సున్నితమైన రాజకీయ పరమైన, ప్రాంతపరమైన అంశాలనే కాకుండా ఫ్యాక్షన్ పరమైన కథాంశాలను ఎంచుకున్నారు. కానీ, సామాజిక విశాదకరమైన అంశాలను ఎంచుకోలేదు. గతంలో వర్మ తీసిన సినిమాలను పరిశీలించినట్లయితే, అందులో సున్నితమైన అంశమైనప్పటికీ, తన మార్క్ వల్గారిటీని చూపించేవారు. ఈ సినిమాను నిజ జీవితంలో జరిగిన అంశాలను తీసుకుని ఉన్నది ఉన్నట్లు చూపిస్తారా..? అనేది సాధారణ ప్రజల ఆలోచనలో మొలకెత్తిన సందేహం.
ఈ ఘటన జరిగిన సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహారు పరువు హత్యలు జరిగాయి. ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, హఠత్తుగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించి పోస్టరు విడుదల చేసి, రిలీజ్ డేట్ కూడ చేప్పేశారు. దీని వెనక ఆంతర్యం ఏమిటి..? దీని ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేది తెలియాల్సి వుంది.
సాధారణంగా బంధాలకు దూరంగా వుంటాననే వర్మ ఇందులో ఎవరి బంధం గురించి చూపిస్తారు..? ఈ పరువు హత్యలో… జీవితం మొత్తం ఒకరికి ఒకరు అంటూ, కలలు కంటూ, ప్రశాతంగా జీవిస్తున్న క్రమంలో ఈ హత్య జరిగింది. ఇందులో జీవితాంతం తోడుగా ఉంటానని అమ్మాయికి మాటిచ్చి దూరం అయిన ప్రణయ్ ని చూపిస్తారా..? లేక ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకుని, ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్న అమృతకి తీరని అన్యాయం జరిగింది. ఈ అన్యాయనికి కారణం తన నాన్నే అని తెలిసి ఇప్పటికి న్యాయం కోసం పోరాడుతున్న అమృత గురించి చూపిస్తారా..? లేక ట్వీట్టర్ పిట్ట కూసినట్టు, తండ్రి కూతురిని అమితంగా ప్రేమిస్తే, జరిగే పరిణామాలు అంటూ మారుతీ రావు వైపు చూపిస్తారా..? లేక ఈ ముగ్గరి ఎమోషన్ ని సమన్వయంగా చూపిస్తారా..? అనే వాటిపై సందేహాలు జనిస్తూనే వున్నాయి.
సమాజంలో సినిమా ప్రభావం చాలా వుంటుంది. అందులో అర్జీవి సినిమాలో ఇప్పటి వరకు నేర స్వభావం, మాఫియా, భయం కల్పించే ఉద్వేగ భరతమైన కథలతో వచ్చినవే. ఇవి ఎలాగున్నా సమాజం పట్టింపు లేనట్లుగా ఉంది. కానీ, చాలా సున్నితమైన అంశాన్ని తీసుకుని, సినిమా తీస్తున్నారంటే, అనుమానాలు కూడా వ్యక్తపరచాల్సిన అవసరం వస్తుంది. ఈ సామాజికాంశంలో విశాదాన్ని అపహాస్యం చేసేదిగా వుంటుందా.? లేక ఈ సామాజిక విశాదాన్ని జరిగిన తీరును, తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండేలా తీస్తారా? తీయగలుగుతాడా..? ఈ చిత్రీకరణలో నియంత్రణ పాటిస్తారా..? లేక ఎప్పటిలాగే చేసుకుంటుపోతారా..? అనేవి ప్రశ్నలుగానే మిగులుతాయా లేక వాటికి సమాధానంగా వుంటాడా..?
-అమర్ నాథ్