కరోనాకు సరే, ఆ రోగానికి వ్యాక్సీన్ ఏదీ?
కోవిద్-19 కు వ్యాక్సిన్ కనిపెట్టాక ఆ వ్యాధి మాయమవుతుందేమో కానీ, దాని వల్ల ప్రకోపించిన అంతరాలు మరింత ప్రమాదంగా మారతాయి. రాజకీయ పక్షాలకు ఇవేమీ పట్టవు. పరస్పర దూషణలే వారికి ఇప్పుడు కూడా భూషణాలు.
కోవిద్-19 అంటు వ్యాధే! మనిషిని మనిషి ‘అంటు కోకుండా’ చేసే వ్యాధే! ఒకరినొకర్ని ‘వేరు చేసే’ వ్యాధే! ఒకవర్గం చేత మరొక వర్గాన్నీ, ఒక కులం చేత మరొక కులాన్నీ ‘అణగదొక్కించే’ వ్యాధే!
ఇలా ఈ వ్యాధి సామాజిక లక్షణాలు చెప్పుకుంటూ పోతూ వుంటే, కొత్త వ్యాధి లాగా అనిపించదు. ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినట్టు అనిపించదు. కారణం ఈ తరహా లక్షణాలున్న వ్యాధులు ఎప్పటి నుంచో వున్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు.
అమెరికా, యూరప్ దేశాల్లో ‘జాతి’ అంటారు; మన దేశంలో ‘కులం’ అంటారు. ఆర్థిక వేత్తల ముఖమాటం ఎక్కువ. ఈ ‘ఎక్కువ’, ‘తక్కువ’ల్ని మరీ పచ్చిగా ‘జాతి’, ‘కులం’ అని పిలిచెయ్యకుండా, ‘ధనిక’, ‘పేద’ అని పిలిచేస్తుంటారు. గట్టిగా మాట్లాడితే, ‘ఏం తెల్లవాళ్ళలో పేదవాళ్ళుండరా?’ ‘నల్లవాళ్ళలో సంపన్నులుండరా?’ అని అటకాయిస్తారు. ఎందుకుండరూ? ఉంటారు. కాకపోతే తెల్లవాళ్ళలో తక్కువ పేదలూ, నల్లవాళ్ళలో ఎక్కువ పేదలూ వుంటారు. ఇంకా చెప్పాలంటే, కొలంబియా, బొగోటో, వెనిజులా వంటి దేశాల్లోకి తోసిపారేసిన నల్లవాళ్ళలో అయితే మరీ ఎక్కువ. (‘తెల్ల’ పదార్థం – అదే తెలివి- వుండాలే కానీ, దేశం దేశాన్నే ఊరు వెలుపలి వెలివాడగా మార్చి పారెయ్య వచ్చు. ఆ లెక్కన చూస్తే, అమెరికా ఊరయితే, లాటిన్ అమెరికా వాడ అవుతుంది.)
కోవిద్-19 వచ్చి నేరుగా ఎంత మందిని మింగిందీ? అంటే ప్రపంచం మొత్తం మీద లక్షల్లో తేలతారు. ఇక వ్యాధి సోకి బతికిపోయిన వారయితే లెక్కే లేదు. ఈ కారణంగా నెలల పాటు ‘లౌక్ డౌన్ ’ పేరు మీద చాలా మంది ‘నాలుగ్గోడల’కు పరిమితమయిపోయారు. ఇవాళ కాక పోతే, రేపు; ఈ నెల కాక పోతే వచ్చే నెల; ఈ ఏడాది కాక పోతే వచ్చే ఏడాది వ్యాక్సిన్ రాక పోదు. ఇళ్ళల్లో దాక్కున్న వారు బయిటకు రాకపోరు.
కానీ, ‘జాత్యహంకారం’ ‘కుల జాడ్యాల’కు వ్యాక్సిన్ ఇప్పట్లో రాదు. ఈ మాత్రం భరోసా చాలు, ‘తొక్కి పారెయ్యటానికి’. కోవిద్-19 రోగలక్షణాలు గురించి వైద్యులూ, శాస్త్రవేత్తలూ, రోజూ చెప్పిందే చెబుతున్నారు కానీ, ఒక్క ప్రమాదకరమైన లక్షణాన్ని ఎందుకనే దాచి వుంచారు. బహుశా ఇదీ వైద్య శాస్త్ర పరిధిలోనిది కాకపోవచ్చు. మహా అయితే ‘సామాజిక శాస్త్ర’ పరిధిలోకి వచ్చింది. ఇది ‘జాత్యహంకారాన్ని’ పదింతలు చెయ్యగలదు; ‘కులాధిపత్యాన్ని’ వంద రెట్లు చెయ్యగలదు.
లేక పోతే, మినియాపొలిస్ (అమెరికా)లో ఫ్లాయిడ్ ఒక రెస్టారెంట్ లో బౌన్సర్ గా పనిచెయ్యటమేమిటి? అది కోవిద్-19 కారణంగా మూసివెయ్యటమేమిటి? అతను రోడ్డున పడటమేమిటి? అప్పుడే అక్కడ జరిగిన ‘చిల్లర’ మోసానికి ఒకానొక ‘నల్ల వాణ్ణి’ తెల్లపోలీసులు అనుమానించటమేమిటి? ‘ఎవ్వడయితేనేం, నల్ల వాడే కదా’ అని పట్టుకోవటమేమిటి? అతడి పీక మీద మోకాలు పెట్టి ఊపిరాడకుండా నలిపి పారెయ్యటమేమిటి?
ఒకానొక ‘నల్ల వాణ్ణి’ తెల్లపోలీసులు అనుమానించటమేమిటి? ‘ అతడి పీక మీద మోకాలు పెట్టి ఊపిరాడకుండా నలిపి పారెయ్యటమేమిటి?
కోవిద్-19 సామాజిక రోగ లక్షణాల్లో ఇది కూడా ఒక్కటే. కొందరు అడుగునే వుండవచ్చు; ఇది అట్టడుక్కి తొక్కేస్తుంది; చేసేది చిరుద్యోగమే కావచ్చు, దాన్ని నిరుద్యోగంగా మార్చేస్తుంది. అవును. అడుగు వాణ్ణి అట్టడుగువాడిగానూ, దరిద్రుణ్ణి, నిష్టాదరిద్రుడి గానూ, బిచ్చగాణ్ణి నేరస్తుడిగానూ మార్చేస్తుంది.
ఆ మధ్య బెంగుళూరులోని ఆజివ్‌ు ప్రేవ్‌ుజీ యూనివర్శిటీ కోవిద్-19 లాక్ డౌన్ ప్రభావం మీద, దాదాపు నాలుగు వేల కుటుంబాలను సర్వే చేసింది. మరీ ముఖ్యంగా భృతి కోల్పోయిన వారి లెక్క తేల్చింది. నగర ప్రాంతాల్లో అయితే, 84 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 66 శాతం మంది ఉపాధి కోల్పోయారనీ, ఈ సర్వే నిగ్గు తేల్చింది. వ్యవసాయమూ, వ్యవసాయాధారిత వృత్తుల్లోని వారయితే దాదాపు 90 శాతం బువ్వ కోల్పోయారు. ఈ రెంటిజోలికి పోనివారు, అధిక శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారే వుంటారు. వారానికి రు. 2,240 లు తెచ్చుకునే వారు, కోవిద్-19 కారణంగా రు. 218లు తెచ్చుకుంటున్నారు.( రోజుకు ఎంత వస్తుందో లెక్కకట్టే ధైర్యం హృదయం వున్న వారు చెయ్యలేరు.)
ఇదిలా వుంటే, ఇక్కడ కూడా ‘నల్ల’ ఫ్లాయిడ్ పీక మీద ‘తెల్ల’ మోకాలు పెడుతూనే వున్నారు. ఈ కోవిద్-19 కాలంలోనే ఈ వర్గాల మీద దాడులూ, అత్యచారాలూ పెరిగిపోయాయి. ‘నేషనల్ క్యాంపెయిన్ అన్ దళిత్ రైట్స్’ అనే సంస్థ ఇలాంటి, అఘాయిత్యాలను దేశ వ్యాపితంగా 80 వరకూ ఎత్తి చూపింది.
తాజా ఉదాహరణలు మాత్రం మధ్యప్రదేశ్ నుంచి ఉంటంకించ వచ్చు. గుణ నగరానికి చేరువలో అహివార్- సావిత్రి అనే దళిత దంపతులు పురుగు మందు తాగేశారు. సాధారణంగా మన దేశంలో పురుగు మందు ఎవరు తాగుతారు? రైతులు. ఎప్పుడు తాగుతారు? చేతికొచ్చిన పంటను కొనే నాథుడు లేనప్పుడో, లేక కొన్నా తగిన సొమ్ము రానప్పుడో!! కానీ ఇక్కడ చిన్న తేడా వుంది. ఈ దళిత దంపతులూ పంట పండించారు. అది చేతికొచ్చింది. కానీ చేతి కొచ్చే సమయానికి బుల్డోజర్లు పెట్టి తొక్కించేశారు; అడ్చొస్తే పోలీసుల చేత కొట్టించేశారు కూడా. కారణం? ఆ భూమి వారిది కాకపోవటం వల్ల; ఆ భూమిని వారు కౌలుకి తీసుకోవవటం వల్ల; ఎన్ని భూములున్నా, అదేమిటో ఆ భూమే ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి అవసరం అవటం వల్ల.
ఇది జరిగి రెండు రోజులు కాలేదు. ఇదే రాష్ట్రంలో శివపురి వద్ద జస్వంత్ జాతవ్ అనే దళితుణ్ణి కాళ్ళు నిజంగా విరగ్గొట్టేశారు. కారణం అందరిలాగే ఖాళీగా వున్న భూమిని సాగు చేస్తున్నారు; అది కూడా ఠాకూర్లు సాగు చేసే చోట. అందుకే కోపం వచ్చేసింది. కోవిద్-19 ‘అంటు’ వ్యాధి ఈ ‘అంటరాని వ్యాధి’ని మరింత ప్రకోపింప చేసింది.
ఈ మధ్య ‘న్యూయార్క్ టైమ్స్ లో లాటిన్ అమెరికా దేశాలపై కోవిద్-19 ప్రభావం మీద విశిష్ట కథనాన్ని ప్రచురించింది. ఆ దేశాల్లో దరిద్రం గత 20 యేళ్ళుగా కాస్త తగ్గుముఖం పట్టింది. అక్కడ ఎవ్వరో కానీ అత్యంత సంపన్నులు వుండరు. వారికీ దరిద్రులకూ మధ్య ఈ కాలంలో తగ్గింది. కానీ కోవిద్-19 వచ్చి వారిని దిక్కుమాలిన వారిగా మార్చేసింది. అక్కడా ఇలా నల్ల రైతులు పండిన ‘స్ట్రా బెర్రీ పంటను’ తమ చేతుల్తో కాల్చేసుకుంటున్నారు. కొలొంబియా, వెనిజులా, ఈ దుస్థితి బాగా కనిపించింది. కుర్రవాళ్ళు అయితే విధిలేక ‘మాదకద్రవ్యాల’ను విక్రయించుకుంటున్నారు; కొన్ని దేశాల్లో వయసులో వున్న అమ్మాయిలయితే, తమ శరీరాల్నే విక్రంయించుకోవాల్సి వస్తుంది. అయితే విటులూ దరిద్రులే. కోరిక తీర్చుకుని ఆరు డాలర్లకు మించి ఇవ్వలేక పోతున్నారు.
కోవిద్-19 కు వ్యాక్సిన్ కనిపెట్టాక ఆ వ్యాధి మాయమవుతుందేమో కానీ, దాని వల్ల ప్రకోపించిన ఈ అంతరాలు మరింత ప్రమాదంగా మారతాయి. రాజకీయ పక్షాలకు ఇవేమీ పట్టవు. పరస్పర దూషణలే వారికి ఇప్పుడు కూడా భూషణాలు.