ఉప్పొంగెలే ‘ఉగ్ర’ గోదావరి…
ఉగ్రరూపం దాల్చిన ‘గోదావరి’
“గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను” అని ఒక రచయిత రాసినటువంటి పదాలను నేడు నిజం చేసింది గోదారమ్మ తల్లి. భయానకంగా ప్రవహిస్తున్న గోదావరి నేడు ప్రజలందరినీ భయబ్రాంతులకు గురిచేస్తుంది. ప్రస్తుత సమయంలో చూసినట్లయితే, భద్రాచలం వద్ద గోదావరి నది 60 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. ఇంక పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నది ప్రవాహం, వరదలు
సహజంగా గోదావరి నది అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. గోదావరి నీరు మట్టి రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రవాహ ప్రయాణంలో ముఖ్య భాగం అడవుల్లో ఉంటుంది. ఇప్పటివరకు సంభవించిన వరదల్లో గోదావరి నది పైచేయిగా ఉంది. 1986వ సంవత్సరాన్ని పెద్ద గోదావరి వచ్చినట్లు చాలా మంది గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆ సంవత్సరంలో గోదావరి నది భద్రాచలంలో 70 అడుగులకు పైగా నమోదయింది. అట్టి వరదల్లో చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కొన్ని వందల గ్రామాలు, చిన్న చిన్న కాలనీలు ముంపుకు గురైనాయి.
ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన సి.డబ్ల్యు.సి:
ప్రస్తుతం వస్తున్న వరదలు దృష్ట్యా కేంద్ర జల వనరుల కమీషన్ (సి.డబ్ల్యు.సి) ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఎగువన కురిసిన వర్షాలు దృష్ట్యా గోదావరి నదికి వరద ఉధృతంగా వస్తుంది. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం, లోతట్టు ప్రాంతాలతో పాటు, మారుమూల పల్లెల్లో నివసించే ప్రజలను ప్రవాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇలా చేయడం వలన పెను ప్రమాదం తప్పే అవకాశముంటుంది.
గోదావరి నది – ప్రస్థానం:
గోదావరి పుట్టుక మహారాష్ట్ర లోని త్రయంబకేశ్వరం అడవుల్లో గల బ్రహ్మగిరి పర్వతంలో జన్మించింది. అక్కడి నుండి మొదలైన గోదావరి నాలుగు రాష్ట్రాలు ప్రయాణించి చివరిగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మన భారత దేశ దక్షిణాన అత్యంత పెద్ద నదిగా విస్తరించింది అందుకే దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర లో మొదలైన గోదావరి అడవుల్లో ప్రవహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవహిస్తుంది. అట్టి గోదావరి నదికి గడ్చిరోలిలోని ప్రాణహిత అనే ఉపనది కలుస్తుంది. తర్వాత మేడిగడ్డలోనికి ప్రవహించే ఇంద్రావతి నది కలుస్తుంది. అలా ప్రవహిస్తున్న గోదావరికి తాలిపేరు, కిన్నెరసాని, శబరి మరియు సీలేరు అనే ఉపనదులు కలయిక చేత ధవళేశ్వరంలోకి వచ్చాక అఖండ గోదావరిగా మారుతుంది. ఈ విధముగా ఉపనదులు కలయిక చేత గోదావరి నది అత్యంత పెద్దదిగా ఉన్నది. చివరిగా గౌతమి, వశిష్ఠ, వైనతేయ అనే మూడు పాయలుగా విడిపోయి చివరగా బంగాళా ఖాతంలో కలిసిపోతుంది.
గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టలు:
మహారాష్ట్రలోని బాబ్రీ, తెలంగాణలో శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ తో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న పోలవరం, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో నది ప్రవహించే రాష్టాల్లో త్రాగు, సాగు నీటితో పాటు థర్మల్ విధ్యుత్ కేంద్రాలతో పాటు వివిధ కర్మాగారాలకు అవసరమయ్యే నీటి వాడకం జరుగుతుంది.
-కరుణాకర్ రెడ్డి, విద్యార్థి.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.