Bathuku (Life)

కప్పుకొట్టి పొంగిపోలేదు, ఓటమితో కృంగిపోలేదు!

రాంచీ గల్లీలో పట్టుకున్న బ్యాట్ ను పట్టుదలతో ప్రపంచ కప్ వరకు తీసుకెళ్ళాడు. ప్రశంసలను అందుకున్నాడు. కానీ, ఉప్పొంగిపోలేదు, మధ్యలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చిన అంగీకరించాడు కానీ కృంగిపొలేదు. మ్యాచ్ అటూఇటూ ఐనా చివరి వరకు గెలుస్తాం అనే ఒక నమ్మకాన్ని కల్పించాడు. స్టేడియంలో అడుగు పెట్టగానే అతడే ఒక సైన్యంలా కనిపిస్తాడు. బంతిని అవలీలగా గాల్లోకి కొట్టే ఒకే ఒక ఆటగాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నా “మహేంద్ర సింగ్ ధోనీ” అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పి, కూల్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇక ఒకసారి రికార్డులు చూస్తే, వన్డేలో 200 సిక్స్ లు కొట్టిన ఏకైక ఆటగాడు. మొత్తంగా దీంట్లో ధోనీ అయిదో స్థానాన్ని దక్కించకున్నాడు. బ్యాటింగ్ లోనే కాదు వికెట్ కీపర్ గానూ అత్యధిక స్కోరు సాధించాడు. 2005లో శ్రీలంకపై 183 పరుగులు తీసి నాట్ ఔట్ గా నిలిచాడు.

ఆయన జీవితం ఏమి పూల పాన్పు కాదు సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. రాంచీ అనే చిన్న నగరం, క్రికెట్ కి పెద్దగా ప్రాధాన్యం లేని వాతావరణంలో పెరిగినవాడు. కుటుంబం కోసం ఉద్యోగం చేసాడు, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాట్ నీ పక్కన పెట్టలేదు. ఏదో సాధించాలన్న తపనా, జీవితంలో పైకి రావాలన్న కోరికా బలంగా ఉంటే దేనినైనా సాధించవచ్చు అని నిరూపించాడు. ధోనీ నిర్ణయాలు తీసుకోవడంలో తడబడడు. ఆయన ప్రదర్శించే ఆట తీరు కన్నా కలిగివుండే వ్యక్తిత్వానికి అభిమానులు ఎక్కువ. ఉదాహరణకు ఒక రెస్టారెంట్ వెళ్ళితే డోర్ తెరిచి స్వాగతించే వాచ్ మెన్ దగ్గర నుంచి రెస్టారెంట్ ఓనర్ వరకు ఒక రకంగా స్పందించే గుణం, సరళత్వం కలిగినవాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అతని స్వభావం.  ఆయన జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగింది అనుకోవడం పొరపాటు. వ్యక్తిగతంగా గానీ, వృత్తిపరంగా గాని  ఎన్ని ‘వైడ్ బాల్స్’ ఎదురైనా నిలకడగా ఉండి, తనదైన శైలిలో వాటిని తిప్పి కొట్టాడు, కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాడు.

జట్టుని నిర్వహించడంలో ఎవరికీ దక్కని పేరు సంపాదించుకున్నాడు. ఆట ఆడే సమయంలో అయన వేసే ఎత్తులు ప్రత్యర్ధి ఊహించడం కష్టం. మొహంలో ఎలాంటి హావభావాలు వ్యక్తపరచకుండా ప్రశాంతంగా కనిపిస్తాడు. నిరుడు ప్రపంచ కప్ లో భారత్ ఓటమి పాలైంది. దానికి ఆయన ఎంత నిరాశ చెందాడో, తన కన్నీళ్ళ రూపంలో చూసాం. బహుశ అప్పుడే నిర్ణయించుకున్నాడు ఎమో ఇక నా ఆట ముగించాల్సిన సమయం వచ్చిందని.

ఒక భారత్ కెప్టెన్ గా ధోనీ సాధించిన అత్యధిక టెస్టు విజయాలు(27). టీ-20 లో పట్టిన క్యాచులు(54), కెప్టెన్ గా ఆడిన మ్యాచులు (72), సారథిగా సాధించిన విజయాలు (41)మహివే. ఆయన ఆడిన మ్యాచ్ లు-90 టెస్టులు, 350 వన్డే లు, 98 టీ20లు, ఇక చిరుతలాగా తీసిన పరుగులు ఎన్నెన్నో. అన్ని ఐసీసీ ప్రధాన టోర్నీలలో గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనినే. టీ20 ప్రపంచ కప్ 2007, వన్ డే ప్రపంచ కప్ 2011, ఛాంపియన్ ట్రోఫీ 2013 అందుకున్నాడు. ఇన్ని రికార్డులను, విజయాలను, కైవసం చేసుకున్న ధోనీ, ఇక ముందు మ్యాచ్ లలో కనిపించరు. “మహేంద్ర సింగ్ ధోని” అన్న పేరు క్రికెట్ బతికున్నంత కాలం గుర్తుండి పోయేలా, ఆయన జీవితాన్ని ఒక స్పూర్తి లా, ఆటని ఒక తీపి జ్ఞాపకంలా అభిమానులకీ వదిలేసి కూల్ గా, మిస్టర్ కూల్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. కలలు ఆకాశంలో వుండాలి, కానీ కాళ్ళు మాత్రం భూమి మీదే వుండాలి. ఇదే అటగాడిగా ధోనీ చెప్పక చెప్పిన సందేశం.

-సుమాంజలి.కె, విద్యార్థిని.

ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *