Featured

వ్యత్యాసం మగాడికా, విమానానికా..?

రేటింగ్:3/5
నటీ నటులు:జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగడ్ బేడీ, వినీత్ కుమార్ సింగ్, ఆయేషా రజా మిశ్రా, మానవ విజ్
దర్శకుడు:శరణ్ శర్మ
నిర్మాత:కరణ్ జోహార్
సంగీతం:జాన్ స్టీవర్ట్ ఏడురి

‘అన్నయ్యా.. పెద్దయ్యాక నేను పైలట్ అవుతా’
‘పైలట్ అవుతావా? ఇదిగో ఈ గినె పట్టుకో.నువ్వు చేయాల్సిన పని కూర వడ్డించమంటారా? పప్పు వడ్డించమంటారా అని అడగడమే… ముందు అది నేర్చుకో’


పదేళ్ల బాలిక గుంజన్ సక్సెనా పెద్దయ్యాక పైలట్ అవ్వాలీ అనుకున్నపుడు తన అన్నయ్య హేళన చేస్తూ మాట్లాడిన మాటలు ఇవి. అన్నయ్య మాటలు ఖండిస్తూ తన తండ్రి చెప్పిన మాటలు మనసులో నాటుకుపోయాయి: “విమానాన్ని స్త్రీ నడిపినా, పురుషుడు నడిపినా నడిపే వారిని పైలట్ అనే అంటారు. విమానానికి ఆడ, మగ వ్యత్యాసం లేనప్పుడు మనమెందుకు వ్యత్యాసం పాటించడం?”. భారతదేశం కోసం కార్గిల్ యుద్దంలో పోరాడిన భారత వైమానిక దళ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం గుంజన్ సక్సెనా -ది కార్గిల్ గర్ల్. గుంజన్ సక్సెనా జీవితంలోని కొన్ని ముఖ్యమయిన అంశాలనూ, అలాగే కార్గిల్‌లో ఆమె చూపిన ధైర్య సాహసాలనూ తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా థియేటర్లు మూసివేసిన కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేశారు.

కథ:
గుంజన్ సక్సెనా అలియాస్ గుంజూ (జాన్వీ కపూర్)కు ఊహ తెలిసినప్పటి నుంచి పైలెట్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. వయసుతో పాటు ఆ కోరిక కూడా మనసులో పెరుగుతూనే ఉంది. ఇంటా, బయటా ఎన్నో కష్టాలను, సమస్యలను అధిగమించి గుంజన్ సక్సెనా చివరికి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ లో పైలెట్గ స్థానం సంపాదించుకుంది. తన కలను సాకారం చేసుకొని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి అడుగుపెటింది. తొలి మహిళా పైలెట్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి వెళ్లిన గుంజన్ సక్సేనాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించింది? మహిళ అనే ఓ కారణంగా తనను చిన్నచూపు చూసిన అధికారులను ఎలా ఎదిరించింది? కార్గిల్ యుద్ధంలో ఎలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించింది? ఈ ప్రశ్నలకు సమాధానమే గుంజన్ సక్సెనా చిత్ర కథ.


ప్లస్ పాయింట్స్:
గుంజన్ సక్సేనా భారత్ పైలట్ అయ్యేందుకు ఎంతో సాహసం చేసింది అనే వాటిని చిత్రంలో చక్కగా చూపించారు. అంతేకాక యువ పైలట్ గుంజన్ జీవితంలో అనుభవించిన అవమానాలను, పోరాటాలను సైతం బాగా చిత్రీకరించారు. గుంజన్ సోదరుడు అంగద్ బేడీ పాత్ర చాలా ఆసక్తికరంగా మలిచారు. ఈ చిత్రానికి పంకజ్ త్రిపాఠి వెన్నుపూస లాంటి వాడు అని చెప్పాలి. గుంజన్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు. కూతురుతో అతనికి ఉన్న బంధాన్ని బాగా ప్రదర్శించాడు. జాన్వీ కపూర్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది చాలా కష్టమైనది అని చెప్పవచ్చు. ఆమె తన తండ్రితో చేసిన అన్ని సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారు. నిజ జీవిత పైలట్ పాత్రను చాలా చక్కగా పోషించారు. ఈ చిత్రంలో తన నటన విషయానికి వస్తే మొదట మందగించినట్లు అనిపించినా, చివరిలో మాత్రం  వేగం పెంచారు.

మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం కేవలం గంట 54 నిమిషాలు మాత్రమే ఉన్నా, కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా సాగదీసినట్లు తెలుస్తుంది. చివర్లో కార్గిల్ యుద్ధంలో గుంజన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను సరిగా తెరకెక్కించలేదనే నిరాశ మాత్రం వెంటాడుతుంటుంది. గుంజన్ జీవితంలోని డ్రామాపైనే దృష్టిని పెట్టినట్టు తెలుస్తుంది. సినిమాకు ఆయువు పట్టుగా, గుంజన్‌ జీవితంలో గొప్పగా ఉండే కార్గిల్ యుద్ద సన్నివేశాలు పెద్దగా చూపించకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పవచ్చు.

సాంకేతిక అంశాలు:
కార్గిల్ యుద్ధ సన్నివేశాలను సహజంగా ఉండేలా చిత్రీకరించారు. పాటలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించకపోయినా పలు సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చేలా నేపథ్య సంగీతం (బిజీఎం) కూర్చారని అనిపిస్తుంది. ఇతర శాఖల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. ఈ చిత్రంలోని సంభాషణలు చాలా అద్భుతంగా వున్నాయి. పంకజ్ త్రిపాఠి కోసం రాసినటువంటి మాటలు ఉద్వేగపూరితంగా వుండి, అందరినీ ఆకట్టుకున్నాయి.

ముగింపు:
పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఆర్మీలో మహిళలు ఏ విషయంలోనూ తీసిపోరనే ఓ సందేశాన్ని అందించిన చిత్రంగా గుంజన్ సక్సేనా నిలిచిపోతుంది. జీవితంలో తాను అనుకున్నది సాధించడానికి ఏమి చేసిందో తెలుసుకోవాలంటే, ఈ చిత్రాన్ని చూడవచ్చు. కాకపోతే, సైన్యంలో గుంజన్ సక్సేనా ధైర్య సహసాలను పూర్తిస్థాయిలో చిత్రీకరించి ఉంటే ఈ సినిమాకు మరింత సార్ధకత చేకూరి ఉండేదేమో అనే భావన కలుగుతుంది. బాలికలూ, మహిళలే కాకుండా అందరూ తప్పక చూడాల్సిన చిత్రమని చెప్పవచ్చు.

సాయి శరణ్య, విద్యార్థి, ఎ.పి. కాలేజ్ ఆఫ్ జర్నలిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *